AP Schools Mobile Ban : ఏపీ స్కూళ్లలో సెల్ ఫోన్స్ బ్యాన్, విద్యాశాఖ సంచలన నిర్ణయం
28 August 2023, 14:55 IST
- AP Schools Mobile Ban : ఏపీ పాఠశాలల్లో మొబైల్స్ ను బ్యాన్ చేశారు. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు తరగతి గదుల్లో మొబైల్స్ వినియోగించవద్దని విద్యాశాఖ ఆదేశించింది.
పాఠశాలల్లో సెల్ ఫోన్స్ నిషేధం
AP Schools Mobile Ban : ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో సెల్ ఫోన్ల వినియోగంపై నిషేధం విధించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. స్కూళ్లలో విద్యార్థులు మొబైల్ ఫోన్లు వినియోగించడంపై పూర్తి నిషేధం విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది. టీచర్లు సైతం తరగతి గదుల్లోకి సెల్ ఫోన్లు తీసుకురాకూడదని ఆంక్షలు విధించింది. ఉపాధ్యాయులు క్లాస్ కు వెళ్లే ముందు తమ మొబైల్స్‌ను హెచ్ మాస్టర్ కు అప్పగించాలని సూచించింది. యూనెస్కో విడుదల చేసిన గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ నివేదిక ఆధారంగా పాఠశాలల్లో విద్యార్థుల బోధనకు ఎలాంటి ఆటంకం కలకకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ఉపాధ్యాయ సంఘాలు, ఇతర వర్గాలతో చర్చించిన అనంతరం సెల్ ఫోన్ల నిషేధం నిర్ణయం తీసుకున్నట్టు విద్యాశాఖ ప్రకటించింది. ఈ నిబంధనలు ఉల్లంఘించిన టీచర్లపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉన్నతాధికారులు ఈ నిబంధనలు కచ్చితంగా అమలు అయ్యేలా పర్యవేక్షించాలని విద్యాశాఖ ఆదేశాలు ఇచ్చింది.
దిల్లీ పాఠశాలల్లో కూడా
ఇటీవల దిల్లీ సర్కార్ కూడా స్కూళ్లలో మొబైల్ ఫోన్ల వాడకంపై నిషేధం విధించింది. తరగతి గదులు, లైబ్రరీలు, ప్లే గ్రౌండ్స్‌తో పాటు పాఠశాల పరిధిలో మొబైల్ ఫోన్ల వాడకంపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉపాధ్యాయులతోపాటు విద్యార్థులు కూడా మొబైల్ ఫోన్లు వాడరాదని దిల్లీ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. అత్యవసర పరిస్థితుల్లో తల్లిదండ్రులు, విద్యార్థుల కోసం హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. విద్యాశాఖ ఆదేశాల మేరకు విద్యార్థులకు వారి తల్లిదండ్రులు స్కూల్ డేస్ లో సెల్ ఫోన్లు ఇవ్వరాదని సూచించింది. ఒక వేళ విద్యార్థులు సెల్ ఫోన్లు తీసుకొస్తే వాటిని, సురక్షితంగా నిల్వ చేసేందుకు లాకర్లను ఏర్పాటు చేయాలని స్కూళ్ల యాజమాన్యాలకు దిల్లీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని ఆజంగఢ్‌లో 17 ఏళ్ల విద్యార్థి సూసైడ్ చేసుకున్న ఘటనలో ప్రిన్సిపాల్, టీచర్ అరెస్టు అయ్యారు. ఈ నేపథ్యంలో పాఠశాలల ఆవరణల్లో మొబైల్ ఫోన్లు వినియోగించవద్దని దిల్లీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. స్కూళ్లలో మొబైల్ ఫోన్లు వాడకంపై నిషేధం విధిస్తూ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు.
ఈ తరహా ఆంక్షలు అనేక దేశాల్లో అమల్లో ఉన్నాయని విద్యావేత్తలు అంటున్నారు. చాలా ప్రైవేట్ పాఠశాలల్లో ఇప్పటికే ఈ తరహా ఆంక్షలు ఉన్నాయని గుర్తుచేస్తున్నారు. మొన్న దిల్లీ, తాజాగా ఏపీ ప్రభుత్వం.... ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు మొబైల్ ఫోన్ల వినియోగంపై నిషేధం విధించడాన్ని విద్యావేత్తలు స్వాగతిస్తున్నారు. వీటిని ఆదర్శంగా తీసుకుని ఇతర రాష్ట్రాల్లోనూ మొబైల్స్ పై ఆంక్షలు విధించాలని కోరుతున్నారు.