తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Ecet 2023 : ఆదివారం కూడా ఏపీ ఈసెట్ అడ్మిషన్ల ప్రక్రియ, ఆగస్టు 1 నుంచి తరగతులు

AP ECET 2023 : ఆదివారం కూడా ఏపీ ఈసెట్ అడ్మిషన్ల ప్రక్రియ, ఆగస్టు 1 నుంచి తరగతులు

29 July 2023, 19:23 IST

google News
    • AP ECET 2023 : ఏపీఈసెట్ 2023 అడ్మిషన్ల ప్రక్రియ ఆదివారం(జులై 30న) కూడా కొనసాగుతోందని కన్వీనర్ తెలిపారు. ఆగస్టు 1 నుంచి తరగతులు ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు.
ఏపీ ఈసెట్
ఏపీ ఈసెట్

ఏపీ ఈసెట్

AP ECET 2023 :ఏపీఈసెట్ 2023 అడ్మిషన్ల ప్రక్రియలో సీట్లు పొందిన విద్యార్థులు ఆదివారం (జులై 30) కూడా కేటాయించిన కళాశాలల్లో రిపోర్టు చేయవచ్చని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, కన్వీనర్ చదలవాడ నాగరాణి ఓ ప్రకటనలో తెలిపారు. రెండో సంవత్సరం ఇంజినీరింగ్ ప్రవేశాలకు నిర్దేశించిన ఈసెట్ కౌన్సిలింగ్ షెడ్యూలును అనుసరించి ఆగస్టు 1వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు. ఈ ఏడాది ఈసెట్ కోసం 38,181 మంది దరఖాస్తు చేసుకోగా, పరీక్షకు 34,503 మంది విద్యార్థులు హాజరయ్యారు. 92.55 శాతంతో 31,933 మంది అర్హత సాధించారు. వీరిలో 19,994 మంది రిజిస్టర్ చేసుకోగా, 19720 మందిని అర్హులుగా నిలిచారని, తద్వారా 19,602 మంది ఆప్షన్స్ పెట్టుకున్నారని కన్వీనర్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 237 కళాశాలల్లో 37,467 సీట్లు ఉండగా, ప్రైవేట్ విభాగంలో 218 కళాశాలలకు గాను 35,100 సీట్లు, ప్రభుత్వ పరంగా 19 విశ్వవిద్యాలయ కళాశాలల్లో 2,367 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు.

తొలి విడత కౌన్సిలింగ్ లో భాగంగా యూనివర్సిటీ కళాశాలలకు 1,912 మంది అభ్యర్థులను, ప్రైవేట్ కళాశాలలకు 15,667 మందిని కేటాయించామని కన్వీనర్ నాగమణి తెలిపారు. మిగిలిన సీట్లను రెండో విడత కౌన్సిలింగ్ లో భర్తీ చేస్తామని నాగరాణి పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం క్రీడలు, వికలాంగులు, సాయుధ దళాల ఉద్యోగుల పిల్లలు, ఎన్సీసీ, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటాలకు రిజర్వేషన్లు వర్తిస్తాయని, అయితే 166 క్రీడల కోటా, 336 ఎన్సీసీ కోటా సీట్లు భర్తీ చేయలేదని వివరించారు. క్రీడా ప్రాధికార సంస్థ, ఎన్సీసీ అధికారుల నుంచి మెరిట్ జాబితా రావాల్సి ఉందన్నారు. విద్యార్థులు మరింత సమాచారం కోసం మంగళగిరి, సాంకేతిక విద్యాశాఖ కార్యాలయం ఆవరణలోని ఏపీ ఈసెట్ కన్వీనర్ కార్యాలయాన్ని సందర్శించవచ్చన్నారు. 7995681678, 7995865456, 9177927677 ఫోన్ నెంబర్ల ద్వారా సహాయ కేంద్రాల అధికారులను సంప్రదించవచ్చని కన్వీనర్ నాగరాణి పేర్కొన్నారు.

ధృవీకరణ పత్రాల నిర్ధారణ, కౌన్సిలింగ్ ప్రక్రియ తదితర అంశాల కోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో 14 సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశామని కన్వీనర్ తెలిపారు. ఆన్ లైన్ లో ఏపీ ఈసెట్ కౌన్సిలింగ్ కు నమోదైన విద్యార్థులకు సహాయ కేంద్రాల వివరాలు అందుబాటులో ఉంటాయన్నారు. ధృవీకరణ పత్రాల నిర్ధారణ కోసం విద్యార్ధులు ఏపీ ఈసెట్ ర్యాంకు కార్డు, హాల్ టిక్కెట్ పదో తరగతి ఉత్తీర్ణత పత్రం, డిప్లమో మార్కుల జాబితా, ప్రోవిజినల్ సర్జిఫికెట్, ఏడవ తరగతి నుంచి డిప్లమో వరకు స్టడీ సర్టిఫికేట్, టిసి, ట్యూషన్ ఫీజు రిఎంబర్స్ మెంట్ కోరుకునే అభ్యర్థులు 2020 జనవరి ఒకటో తేదీ తరువాత జారీ చేసిన ఆదాయ ధృవీకరణ పత్రం, వివిధ రిజర్వేషన్లకు అవసరమైనధృవీకరణ పత్రాలు , లోకల్ స్టేటస్ కోసం రెసిడెన్షియల్ సర్జిఫికెట్, ఈడబ్ల్యూఎస్ ధృవీకరణ తదితర పత్రాలు సిద్ధం చేసుకోవాలన్నారు.

తదుపరి వ్యాసం