తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Congress: ఏపీ కాంగ్రెస్‌లో అసెంబ్లీ టిక్కెట్ల కోసం దరఖాస్తుల స్వీకరణ

Ap Congress: ఏపీ కాంగ్రెస్‌లో అసెంబ్లీ టిక్కెట్ల కోసం దరఖాస్తుల స్వీకరణ

Sarath chandra.B HT Telugu

24 January 2024, 13:49 IST

google News
    • Ap Congress: ఎన్నికల్లో గెలుపొటములతో సంబంధం లేకుండా ఏపీ కాంగ్రెస్‌లో కొత్త ఉత్సాహం నెలకొంది.  గత పదేళ్లలో లేని విధంగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. 
కాంగ్రెస్ ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న మాణిక్కం ఠాగూర్
కాంగ్రెస్ ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న మాణిక్కం ఠాగూర్

కాంగ్రెస్ ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న మాణిక్కం ఠాగూర్

Ap Congress: ఏపీ కాంగ్రెస్‌లో కోలాహలం నెలకొంది. రాష్ట్ర విభజన తర్వాత గత పదేళ్లుగా స్తబ్దుగా ఉన్న ఏపీ కాంగ్రెస్‌లో ఇటీవల కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. షర్మిలకు పిసిసి పగ్గాలు అప్పగించిన తర్వాత కాంగ్రెస్‌కు ఎప్పటికైనా పూర్వ వైభవం వస్తుందనే నమ్మకం మొదలైంది.

మరోవైపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఏపీలో కూడా ఈసారి గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తామని కాంగ్రెస్ భావిస్తోంది. ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా క్షేత్ర స్థాయిలో పోరాటంలోకి దిగాలని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది.

ఇందుకు అనుగుణంగా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరణ కార్యక్రమాన్ని ఏపి కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్కం ఠాగూర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కెవిపి, మంగళగిరి ఎమ్మెల్యే ఆర్ కె, కాంగ్రెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి పాల్గొన్నారు.

మడకశిర అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ కోసం తొలి అప్లికేషన్ ఇచ్చిన కె.సుధాకర్ నుంచి దరఖాస్తును మాణిక్కం ఠాగూర్ స్వీకరించారు.

గుంటూరు నుంచి మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి, బద్వేలు నుంచి మాజీ ఎమ్మెల్యే కమలమ్మ ఎమ్మెల్యేగా పోటీకి దరఖాస్తు చేశారు.

ప్రజాస్వామిక వాదంతో కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుందని మాణిక్కం ఠాగూర్ చెప్పారు. ఏఐసిసి స్క్రీనింగ్ కమిటీ సూచనల మేరకు అభ్యర్థుల ఎంపిక ఉంటుందని, కులం కోసం, డబ్బు కోసం రాజకీయాలను కాంగ్రెస్ పార్టీ చెయ్యదన్నారు.

కాంగ్రెస్ ఎన్నికల కమిటీ త్వరలో ఏపిలో పర్యటిస్తుందని చెప్పారు. పార్టీ లీడర్స్ ఎవరైనా ఎన్నికలో పోటీ చేసే ఆసక్తి ఉంటే చెయ్యొచ్చన్నారు. భావ సారుప్యత కలిగిన పార్టీలతో కలిసి అడుగులు వెయ్యడానికి కాంగ్రెస్ పార్టీ సిద్దంగా ఉందని తెలిపారు. .

స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పని చేసే నేతలను కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించదని, కాంగ్రెస్ భావజాలం కలిగిన అన్ని పార్టీలలో ఉన్న నేతలను పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు.

తదుపరి వ్యాసం