CM Jagan Review : వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఏపీ ఎంఎస్పీ యాక్ట్‌ను ప్రవేశపెట్టాలి
02 September 2023, 6:50 IST
- AP CM YS Jagan Latest News: వర్షాల కొరత నేపథ్యంలో రాష్ట్రంలో వ్యవసాయ రంగం పరిస్థితులు, కంటిన్జెన్సీ ప్రణాళికపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.వర్షాల కొరత నేపథ్యంలో పంటల ప్రత్యామ్నాయ ప్రణాళికపై అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి దిశినిర్దేశం చేశారు.
సీఎం జగన్ సమీక్ష
CM Jagan Latest News: అన్ని జిల్లాల్లో కంటిన్జెన్సీ ప్రణాళికపై కలెక్టర్ల నేతృత్వంలో రైతుల సలహామండళ్లతో సమావేశాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. శుక్రవారం క్యాంప్ కార్యాలయంలో వ్యవసాయం రంగంపై సమీక్షించిన ఆయన... వర్షాల కొరత నేపథ్యంలో పంటల ప్రత్యామ్నాయ ప్రణాళికపై అవగాహన కల్పించాలన్నారు. వెంటనే ఈ సమావేశాలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులను సీఎంకు అధికారులు వివరించారు. జూన్ నుంచి ఆగస్టు వరకూ రాష్ట్రంలో కురవాల్సిన సాధారణ వర్షపాతం 419.6 మి.మీ. కాగా 314.6 మి.మీ. వర్షం కురిసిందని తెలిపారు. కోనసీమ, కాకినాడ, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, ఎస్పీఎస్ నెల్లూరు, తిరుపతి, పల్నాడు, ప్రకాశం, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్సార్, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో వర్షాల కొరత ఉన్నట్టు చెప్పారు. అన్ని రిజర్వాయర్లలో నీటి సామర్ధ్యం 1174.58 టీఎంసీలు కాగా, 507.88 టీఎంసీల నీరు ఉందని పేర్కొన్నారు. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లోనూ తెలంగాణ రాష్ట్రం విద్యుత్ ఉత్పత్తి కోసం దిగువకు నీరును విడిచిపెడుతోందని తెలిపారు. ముందస్తుగా సాగునీటిని విడుదలచేయడం వల్ల కృష్ణాడెల్టాకు అవసరమైన నీటిని అందించగలిగామని అధికారులు అభిప్రాయపడ్డారు. గోదావరి డెల్టాకు ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగునీరు అందుతోందన్నారు. వంశధార కింద సాగునీటికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేవని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
అసెంబ్లీ సమావేశాల్లో ఎంఎస్పీ యాక్ట్ - సీఎం జగన్
ఇ–క్రాప్ నమోదుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీఎం జగన్ సూచించారు. రైతుల్ని ఆదుకునే చర్యలకు ఈ డేటా చాలా కీలకమని అభిప్రాయపడ్డారు. పశువులకు అవసరమైన దాణా, గ్రాసాన్ని సిద్ధంచేసుకోవాలన్నారు. సచివాలయాల వారీగా పశువుల వివరాలు తెప్పించుకుని, అక్కడున్న పరిస్థితులపై కూడా వివరాలు తెప్పించుకుని ఆమేరకు సిద్ధం కావాలని... పశుగ్రాసానికి ఎక్కడ ఇబ్బందిరాకుండా చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఏపీ ఎంఎస్పీ యాక్ట్‌ను ప్రవేశపెట్టాలని అధికారులను ఆదేశించారు. రైతులకు నిర్ణయించిన కనీస మద్దతు ధర ఇవ్వకుంటే ఈ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. పంటలకు కనీస మద్దతు ధరల అమలు విషయంలో ఆర్బీకేలది కీలక పాత్ర అని చెప్పారు.
వర్షాల కొరత నేపథ్యంలో కరెంటు డిమాండు, పంపిణీలపైనా సీఎం సమీక్షించారు. గత ఏడాదితో పోలిస్తే గ్రిడ్ నుంచి డిమాండ్ కనీసంగా 18 శాతం వరకూ పెరిగిందని అధికారులు తెలిపారు. వ్యవసాయ రంగం నుంచి కూడా డిమాండ్ పెరిగిందన్నారు. దేశవ్యాప్తంగా ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నాయని... దేశవ్యాప్తంగా కూడా విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా పెరిగిందని సీఎం చెప్పారు. అయినా ఎక్కడా కూడా రైతులకు, ప్రజలకు ఇబ్బందులు రాకుండా చేయడానికి అన్నిరకాలుగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. అధిక రేట్లు ఉన్నాసరే.. ప్రజలకు ఇబ్బందులు రాకుండా కొనుగోలు చేస్తోందని వివరంచారు. ఒక్క ఆగస్టు–2023లోనే రూ. 966.09 కోట్లు విద్యుత్ కొనుగోలు చేశామన్న సీఎం... యూనిట్ ధర రూ.7.52లు పెట్టి మరీ కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
"ఎండలు అధికంగా ఉన్న మార్చి, ఏప్రిల్, మే, జూన్ నెలలో కూడా విద్యుత్ కొనుగోలు కోసం చేసిన ఖర్చు ఇంతలేదు. మార్చిలో రూ. 501 కోట్లు ఖర్చు చేస్తు, ఏప్రిల్లో రూ. 493 కోట్లు, మేలో రూ.430 కోట్లు, జూన్ నెలలో రూ. 346.28 కోట్లు, జులైలో రూ.197.57 కోట్లు ఖర్చు చేశాం. ఒక్క ఆగస్టు–2023లోనే రూ. 966.09 కోట్లు విద్యుత్ కొనుగోలు చేశాం. ఇంత ఖర్చు చేసి విద్యుత్‌ను సరఫరా చేస్తున్నాం. అయినా విస్తృతంగా నెగెటివ్ ప్రచారం చేస్తున్నారు. రానున్న రోజుల్లో కూడా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆ మేరకు తగిన చర్యలు తీసుకోవాలి" అని సీఎం ఆదేశించారు.