Andhrapradesh Floods : ఇంకా నివేదికలే పంపలేదు.. ఏపీకి కేంద్ర సాయం వార్తలు అవాస్తవం - సీఎం చంద్రబాబు
06 September 2024, 21:05 IST
- కేంద్రం నుంచి ఏపీకి వరద సాయం అందినట్లు వస్తున్న వార్తలపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. కేంద్ర సాయంపై వచ్చిన వార్తలు అవాస్తవమన్నారు. తాము ఇంకా నివేదికలే పంపలేదని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. శనివారం ప్రాథమిక అంచనాలతో కూడిన రిపోర్ట్ ను పంపిస్తామని చెప్పారు.
ఏపీ సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. ఈ వర్షాలు కారణంగా వరదలు సంభవించాయి. దీంతో ఇరు రాష్ట్రాల్లో వేల కోట్ల నష్టం వాటిల్లింది. అయితే రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ సాయం (రూ.3,300 కోట్లు) ప్రకటిించినట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. కేంద్రం నుంచి సాయంపై వచ్చిన వార్తలు అవాస్తమని చెప్పారు. అవన్నీ తప్పుడు వార్తలని క్లారిటీ ఇచ్చారు.
శుక్రవారం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు… కేంద్ర సాయంపై రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. రాష్ట్రం నుంచి ఇంకా నివేదికలే పంపలేదని చెప్పారు. రూ. 3300 కోట్ల సహాయం అంటూ వచ్చిన వార్తలు అవాస్తవమన్నారు. దీనిపై తమకు కేంద్రం నుంచి ఎలాంటి సమాచారం కూడా లేదన్నారు. వరద నష్టం అంచనాపై శనివారం ఉదయం కేంద్రానికి ప్రాథమిక నివేదిక పంపుతామని తెలిపారు.
ప్రతి ఒక్కరికీ నిత్యావసర వస్తువులు - సీఎం చంద్రబాబు
“ఈరోజు బుడమేరు, కృష్ణా పరివాహక ప్రాంతంలో ఏరియల్ సర్వే చేశాను. బుడమేరుకి పడిన గండిని పూడ్చే పనులు ముమ్మరం అయ్యాయి. ఇప్పటికే ఆర్మీ కూడా వచ్చింది. రేపటికి మూడో గండి పూడ్చే విధంగా పనులు జరుగుతున్నాయి. 7100 మంది సానిటేషన్ వర్కర్స్ 24 గంటలు పని చేస్తున్నారు. 12 వేల మెట్రిక్ టన్నుల వేస్ట్ ని డిస్పోజ్ చేశారు” అని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో 681 వాహనాలు పని చేస్తున్నాయని సీఎం చంద్రబాబు ప్రకటించారు. బస్సులు, ట్రాక్టర్లు, జేసీబీలు గ్రౌండ్ లో పని చేస్తున్నాయని తెలిపారు. .మూడు రోజుల్లో ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం నిత్యావసర వస్తువులు ఇచ్చే విధంగా చూస్తున్నామని చెప్పారు. ఈ నిత్యావసర వస్తువులు ఇచ్చిన రోజు, డ్రై ఫుడ్ కింద… మరో కిట్ కూడా ఇస్తామని చెప్పారు.