Purandeswari Vs Ysrcp : కల్తీ మద్యం వెనుక వైసీపీ పెద్దలు, పేర్లు బయటపెట్టినందుకే ఉలికిపాటు- బీజేపీ కౌంటర్
05 November 2023, 20:12 IST
- Purandeswari Vs Ysrcp : బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిపై వైసీపీ నేతలు విరుచుకుపడ్డారు. పురందేశ్వరి టీడీపీకి కోవర్టుగా పనిచేస్తున్నారని విమర్శలు చేశారు. వైసీపీ విమర్శలకు బీజేపీ కౌంటర్ ఇచ్చింది.
పురందేశ్వరి, వెల్లంపల్లి, పెద్దిరెడ్డి
Purandeswari Vs Ysrcp : బీజేపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బీజేపీ చీఫ్ పురందేశ్వరి వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. పురందేశ్వరి లక్ష్యంగా వైసీపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. పురందేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉంటూ టీడీపీకి కోవర్టుగా, తొత్తుగా పనిచేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, హామీల గురించి ఆమె ఏనాడూ మాట్లాడరని, వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించడం, చంద్రబాబును బీజేపీతో కలపడమే పురందేశ్వరి లక్ష్యమన్నారు. పురందేశ్వరి బీజేపీ అధ్యక్షురాలిగా కాకుండా టీడీపీ గౌరవాధ్యక్షురాలిగా పనిచేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి సెటైర్లు వేశారు. చంద్రబాబు తరపున ఆమె మాట్లాడితే తమకేం ఇబ్బంది లేదన్న ఆయన.. మద్యం డిస్టలరీలపై వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. రాష్ట్రంలో డిస్టిలరీలన్నీ చంద్రబాబు హయాంలో మంజూరు చేసినవే అని గుర్తుచేశారు. మద్యం డిస్టలరీలపై పురందేశ్వరి చంద్రబాబుతో మాట్లాడితే మంచిదన్నారు. బీజేపీలో పనిచేస్తున్న పురందేశ్వరి టీడీపీ కోసం పనిచేస్తున్నారని విమర్శించారు.
బీజేపీ కౌంటర్
వైసీపీ నేతల విమర్శలకు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. విషయం మీద అవగాహన, సమాధానం లేనివాళ్లే పనికిమాలిన విషయాలు మాట్లాడతారనే నానుడి వైసీపీ నాయకుల మాటలను చూస్తే నిజం అని అర్ధం అవుతుందని ట్వీట్ చేసింది. వైసీపీ ప్రభుత్వాన్ని బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అడిగిన ప్రశ్నలు ఒకసారి చూస్తే ఎన్నికల ముందు మద్యపాన నిషేధం మీద సీఎం జగన్ ఇచ్చిన హామీ నిజం కాదంటారా? అని ప్రశ్నించింది. వైసీపీ ప్రభుత్వం మద్యం మీద వచ్చే ఆదాయం తాకట్టు పెట్టి అప్పులు తెచ్చింది నిజం కాదంటారా? అని నిలదీసింది.
అవినీతి సొమ్ము ప్యాలస్ కు
'రాష్ట్రంలో కల్తీ మద్యంతో అమాయక ప్రజల ప్రాణాలతో మీ రాక్షస ఆటలు నిజం కాదంటారా? డిస్టలరీ కంపెనీలను బెదిరించి వైసీపీ నేతలు ఆక్రమించుకుంది నిజం కాదంటారా? మద్యం షాపుల్లో డిజిటల్ లావాదేవీలు జరగకుండా అవినీతి సొమ్ము మొత్తం ప్యాలస్ కు తరలింపు నిజం కాదంటారా? కల్తీ మద్యం వెనుక ఉన్న మీ పార్టీ పెద్దల పేర్లు బయట పెట్టినందుకా మీకు ఉలికిపాటు? మీ ఉలికిపాటు, మా అధ్యక్షురాలిపై మీ ముఠా మూకుమ్మడి దాడి చూస్తుంటే, దొంగ భుజాలు తడుముకున్నట్టు ఉంది. తప్పుదోవ పట్టించటం మీకు అలవాటైన పనేగా' అని బీజేపీ ట్వీట్ చేసింది.
పురందేశ్వరి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు అయినప్పటి నుంచీ వైసీపీ ప్రభుత్వంపై ఎదురుదాడి మొదలుపెట్టారు. వైసీపీ ప్రభుత్వ మద్యం పాలసీ, ఇసుక విధానం, డిస్టలరీస్ పై పురందేశ్వరి ప్రశ్నలు సంధిస్తున్నారు. తాజాగా ఎంపీ విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీజేఐకు లేఖ రాశారు. దీంతో వైసీపీ నేతలు ఎదురుదాడి మొదలుపెట్టారు. చంద్రబాబుకు అనుకూలంగా పురందేశ్వరి మాట్లాడుతున్నారంటూ వైసీపీ నేతలు విమర్శలు చేస్తు్న్నారు.