తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Gps Contract Employees Bills : జీపీఎస్, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజ్ బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం, సభ నిరవధిక వాయిదా

GPS Contract Employees Bills : జీపీఎస్, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజ్ బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం, సభ నిరవధిక వాయిదా

27 September 2023, 17:39 IST

google News
    • GPS Contract Employees Bills : ఏపీ అసెంబ్లీ పలు కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ బిల్లుకు ఆమోదం తెలిపింది. అనంతరం ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

GPS Contract Employees Bills : ఏపీ అసెంబ్లీ చివరి రోజు సమావేశాల్లో కీలక బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ బిల్లుకు సభ ఆమోదం తెలపగా, జీపీఎస్ బిల్లును మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు సభ ఆమోదం పొందింది. జీపీఎస్‌ ను సీపీఎస్‌ ఉద్యోగులు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్‌ అయ్యే నాటికి ఉన్న బేసిక్‌ పేలో 50 శాతం గ్యారెంటీ పెన్షన్‌ ఇవ్వనున్నట్లు మంత్రి బుగ్గన తెలిపారు. పింఛనుదారు మరణిస్తే భార్య లేదా భర్తకు ఆ పింఛన్‌లో 60 శాతం గ్యారెంటీ పొందవచ్చాన్నారు. ప్రభుత్వ ఉద్యోగి వార్షిక ఆదాయంలో తగ్గుదల ఉంటే నెలకు రూ.10 వేలు కనీస పింఛన్ భరోసా కల్పిస్తామన్నారు. రిటైర్డ్‌ ఉద్యోగులకు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ స్కీమ్ అమలుచేస్తామన్నారు.

జీపీఎస్ తో రూ.2500 కోట్ల భారం

వాలంటరీ రిటైర్మెంట్‌ కు కనీసం 20 ఏళ్ల సర్వీస్‌ చేసి ఉండాలని బిల్లులో నిబంధన పెట్టామని మంత్రి బుగ్గన తెలిపారు. సర్వీస్‌ మధ్యలో రాజీనామా చేస్తే పథకం వర్తించదు. క్రమశిక్షణా చర్యలు, బర్తరఫ్‌ లాంటి సందర్భాల్లో ఈ పథకం వర్తించదన్నారు. జీపీఎస్‌తో ప్రభుత్వంపై రూ.2500 కోట్ల అదనపు భారం పడుతుందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి తెలిపారు. ఆశా వర్కర్లకు గతంలో రూ.3 వేలు మాత్రమే ఇచ్చేవారనీ, వైసీపీ ప్రభుత్వంలో వీరి జీతాలను రూ.10 వేలకు పెంచామన్నారు. 108 డ్రైవర్లకు జీతాలు పెంచామని, ప్రతి విభాగానికి మేలు చేశామని మంత్రి బుగ్గన అన్నారు.

వారందరినీ రెగ్యులరైజ్ చేశాం

"ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు గత ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసింది. పోలీసులకు వీక్లీ ఆఫ్‌ ఇచ్చి సీఎం జగన్ మాట నిలబెట్టుకున్నారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌ బిల్లుకు ఆమోదం తెలిపాం. ప్రభుత్వ ఉద్యోగులకు అన్ని విధాలుగా అండగా నిలిచాం. ఉద్యోగుల ప్రయోజనాలకు వైసీపీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62కు పెంచాం. 2014 నాటి నుంచి ఉద్యోగం చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తున్నాం. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేశాం. దీంతో దాదాపు 53 వేల మందికి ప్రయోజనం కలిగింది"- మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్

ఆమోదం పొందిన బిల్లులు

  • ఏపీ సివిల్ కోర్ట్స్ (సవరణ) బిల్లు-2023
  • ఏపీ గ్యారెంటీ పెన్షన్ సిస్టమ్ బిల్లు- 2023
  • ఏపీ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ సెకండ్ సవరణ బిల్లు -2023
  • ఏపీ రెగ్యులైజేషన్ ఆఫ్ సర్వీసెస్ ఆఫ్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ బిల్లు-2023
  • ఏపీ అప్రాప్రియేషన్ నెంబర్ -3 బిల్లు -2023

తదుపరి వ్యాసం