AP Assembly Session : 10 కీలక బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం, మహిళా రిజర్వేషన్ కు మద్దతుగా తీర్మానం!
25 September 2023, 19:55 IST
- AP Assembly Session : ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో మూడో రోజు 10 కీలక బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. మహిళా రిజర్వేషన్ కు మద్దతుగా ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసింది.
సీఎం జగన్
AP Assembly Session : ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో మూడో రోజు కీలక బిల్లులను ఆమోదించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 10 బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అసైన్డ్ ల్యాండ్స్-భూముల రీసర్వేపై స్వల్పకాలిక చర్చ జరిగింది. చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్లకు మద్దతుగా అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఈ తీర్మానంపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఏపీపీఎస్సీ చట్ట సవరణ బిల్లు, ఏపీజీఎస్టీ సవరణ బిల్లు, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే చట్ట సవరణ బిల్లు, ఏపీ మోటార్ వెహికల్స్ ట్యాక్సెస్ సవరణ బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఏపీ రవాణా వాహనాల పన్నుల చట్టంలో రెండో సవరణ బిల్లు, ఏపీ అసైన్డ్ ల్యాండ్స్ సవరణ బిల్లు, ఏపీ భూదాన్- గ్రామదాన్ సవరణ బిల్లు, హిందూ ధార్మిక చట్టం సవరణ బిల్లు, ఏపీ ప్రైవేట్ యూనివర్సిటీల సవరణ బిల్లులను శాసనసభ ఆమోదించింది. నేటి సమావేశాలను ప్రతిపక్ష పార్టీ టీడీపీ శాసన సభ్యులు బహిష్కరించారు. దీంతో విపక్షం లేకుండానే మొత్తం 10 బిల్లులకు ప్రభుత్వం ఆమోద ముద్రవేసింది.
రవాణా శాఖకు చెందిన 3 బిల్లులు
మూడో రోజు అసెంబ్లీలో పది బిల్లులను ప్రవేశపెట్టిన ప్రభుత్వం వాటికి ఆమోదముద్ర వేసింది. వీటిల్లో రవాణా శాఖకు చెందిన మూడు బిల్లులున్నాయి. మరో 7 బిల్లులు వివిధ శాఖలకు చెందినవిగా తెలుస్తోంది. ఏపీపీఎస్సీ చట్ట సవరణ బిల్లును సీఎం జగన్ కు బదులుగా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి శాసనసభలో ప్రవేశపెట్టారు. కొన్ని యూనివర్సిటీలను చట్టంలో చేర్చకపోవడంతో నియామకాల విషయంలో ఇబ్బందుల ఎదురవుతున్నాయని తెలిపిన మంత్రి, ఈ చట్టంలో సవరణలను ప్రతిపాదించారు. ఈ సవరణతో కొత్తగా పలు యూనివర్సిటీలను చట్టం పరిధిలోకి తీసుకురానుంది.
చట్ట సవరణ బిల్లులు
ఏపీ ప్రైవేట్ యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లును మంత్రి బొత్స సత్యనారాయణ ప్రవేశపెట్టారు. అంతర్జాతీయ యూనివర్సిటీలతో డిగ్రీలు ఎంఓయూలు చేసుకునేందు మోహన్ బాబు యూనివర్సిటీ, అపోలో యూనివర్సిటీల అభ్యర్ధనతో వీటికి అవకాశం కల్పించేలా చట్టంలో మార్పులు చేశారు. ఏపీ జీఎస్టీ చట్ట సవరణ బిల్లును ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టారు. ఈ-కామర్స్ ఆపరేటర్ల ద్వారా డెలవరీకి సంబంధించి కాంపోజిట్ ట్యాక్స్ ల్లో మార్పులు చేశారు. ఏపీఎస్ఆర్టీసీ సవరణ బిల్లును రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అసెంబ్లీ ప్రవేశపెట్టారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత సీసీఏ రూల్స్ సవరణ చేయకపోవడంతో పాత విధానంలో ఉద్యోగులపై చర్యలు తీసుకుంటున్నారు. దీంతో న్యాయపరమైన సమస్యలు తలెత్తడంతో.. సీసీఏ రూల్స్ అమల్లోకి వచ్చే వరకూ ఏపీఎస్ఆర్టీసీ రెగ్యులేషన్ ప్రకారమే చర్యలు తీసుకునేందుకు చట్ట సవరణ చేశారు.