తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Assembly Session: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. ఎల్లుండి సభలోఓటాన్‌ అకౌంట్ బడ్జెట్

AP Assembly Session: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. ఎల్లుండి సభలోఓటాన్‌ అకౌంట్ బడ్జెట్

Sarath chandra.B HT Telugu

05 February 2024, 7:32 IST

google News
    • AP Assembly Session: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు  గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు (https://www.aplegislature.org/)

నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

AP Assembly Session: ఏపీ అసెంబ్లీ ఓటాన్‌ అకౌంట్‌ (Vote on Account) బడ్జెట్‌ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10గంటలకు గవర్నర్ ప్రసంగం తర్వాత బిఏసి సమావేశం జరుగుతుంది. బిఏసీలో సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకుంటారు. మూడు, నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశాలు ఉన్నాయి.

ఈ నెల 7న ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది. 7తేదీన ఉదయం 8 గంటలకు కేబినెట్ సమావేశం జరగనుంది. 8వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది.

తొలిరోజు ఉదయం 10 గంటలకు గవర్నర్‌(Governor) ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం ఉభయసభలూ మంగళవారానికి వాయిదా పడతాయి. సభ వాయిదా పడిన తర్వాత శాసనసభాపతి తమ్మినేని సీతారాం నేతృత్వంలో శాసనసభా వ్యవహారాల కమిటీ సమావేశం జరుగుతుంది.

ఈ సమావేశానికి శాసనసభా పక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డితో పాటు, టీడీపీ శాసనసభాపక్ష ఉపనేత కింజరాపు అచ్చెన్నాయుడు హాజరవుతారు. ప్రశ్నోత్తరాలకు సమయం ఇవ్వాలని ఈ సమావేశంలో టీడీపీ (tdp) పట్టుబట్టే వీలుంది.

ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ సమావేశాలే చివరి అసెంబ్లీ సెషన్‌ కావడంతో కనీసం వారం రోజులైనా సభ నిర్వహించాలని టీడీపీ కోరనుంది. మంగళవారం గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది.

రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ మృతి పట్ల శాసనమండలిలో సభ్యులు సమావేశమై సంతాప తీర్మానాన్ని ప్రవేశ పెడతారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను బుధవారం ఉదయం 11 గంటలకు శాసనసభలో ప్రవేశపెడతారు. శాసనమండలిలో డిప్యూటీ సిఎం అంజాద్‌ బాషా ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి.

అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అధ్యక్షతన ఆ పార్టీ శాసన సభాపక్షం భేటీ అయింది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలు హాజరయ్యారు. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా చర్చించారు. సమావేశాల్లో మొత్తం పది అంశాలపై చర్చకు పట్టుబట్టాలని టీడీపీ యోచిస్తోంది. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై శ్వేతపత్రం, అప్పుల ఊబిలో చిక్కుకున్న రాష్ట్రం, సౌర విద్యుత్‌ ప్రాజెక్టుల పేరుతో ప్రభుత్వ పెద్దల బినామీలకు వేల ఎకరాల కేటాయింపు వంటి అంశాలపై చర్చించారు.

ఫిక్సిడ్‌ ఛార్జీల పేరుతో వినియోగ దారులపై పడుతున్నభారం, స్థానిక సంస్థల నిధుల మళ్లింపు, బ్యాక్‌లాగ్‌ పోస్టులను భర్తీ చేయకపోవడంపై సభలో చర్చకు తీసుకు రావాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు.

విశాఖ రైల్వే జోన్‌కి అవసరమైన భూమి అప్పగించకుండా రాష్ట్రప్రభుత్వం మోకాలడ్డటంపై టీడీఎల్పీలో చర్చించారు. కరవు మండలాల ప్రకటనలో వైఫల్యం, మిచౌంగ్‌ తుపాను బాధిత రైతుల్ని ఆదుకోవడంలో ప్రభుత్వ నిర్లక్ష్యంపైనా శాసనసభాపక్షం సమాలోచనలు జరిపింది.

ఆధివారం మధ్యాహ్నం పవన్‌ కల్యాణ్‌తో భేటీ సారాంశాన్ని చంద్రబాబు నేతలకు వివరించారు. రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని నిలబెట్టే అంశంపై కూడా ప్రాథమిక చర్చలు జరిపారు. రాజ్యసభ ఎన్నికల్లో మూడు స్థానాల్లో ఒక్కదానిని దక్కించుకోవాలని టీడీపీ భావిస్తోంది.

తదుపరి వ్యాసం