తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Samineni Udayabhanu Out: వైసీపీలో మరో వికెట్‌ ఔట్, జనసేనలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను

Samineni Udayabhanu Out: వైసీపీలో మరో వికెట్‌ ఔట్, జనసేనలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను

19 September 2024, 13:20 IST

google News
    • Samineni Udayabhanu Out: వైఎస్సార్సీపీ నాయకులు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కీలక నాయకుడిగా గుర్తింపు పొందిన సామినేని ఉదయభాను వైసీపీని వీడనున్నారు. జనసేనలో చేరేందుకు ముహుర్తం ఖరారు చేసుకున్నారు.  బాలినేని బాటలోనే సామినేని  కూడా  జనసేనలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. 
సామినేని ఉదయభాను
సామినేని ఉదయభాను (twitter)

సామినేని ఉదయభాను

Samineni Udayabhanu Out: ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీ ముఖ్య నాయకుల్లో ఒకరైన సామినేని ఉదయభాను పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. 2019లో జగ్గయ్యపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఉదయభాను సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో ఎమ్మెల్యేగా పనిచేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవి ఆశించినా సామాజిక సమీకరణల్లో భాగంగా కృష్ణా జిల్లాలో పేర్ని నానికి పదవి వరించింది.

2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైనప్పటి నుంచి ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరిగా ప్రత్యామ్నయం చూసుకుంటున్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన నాయకులెవరు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి కూడా ముందుకు రావడం లేదు. తాజాగా బాలినేని సైతం వైసీపీని వీడనుండటంతో జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కూడా అదే బాటలో పయనించాలని నిర్ణయించుకున్నారు.

తన అనుచరులతో కలిసి జనసేనలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రస్తుతం జగ్గయ్యపేటలో టీడీపీ తరపున శ్రీరాం తాతయ్య ఎమ్మెల్యేగా గెలిచారు. 2014-19 మధ్య శ్రీరాం తాతయ్య జగ్గయ్యపేటలో గెలుపొందారు.

22న చేరనున్నట్టు ప్రచారం…

సామాజిక సమీకరణల నేపథ్యంలో సామినేని ఉదయభాను జనసేన పార్టీలో చేరనున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 22వ తేదీన అనుచరులతో కలిసి ఉదయభాను జనసేనలో చేరుతారని ప్రచారం జరుగుతోంది.

ఉదయభాను రాకను స్వాగతిస్తూ జనసేన శ్రేణులు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు కూడా పెడుతున్నారు. ఉదయభాను వైసీపీకి రాజీనామాచేసిన తర్వాత జనసేనలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీలో చేరికకు సంబంధించి ఇప్పటికే జనసేన ముఖ‌్య నాయకులతో సంప్రదింపులు పూర్తి చేసినట్టు జనసేన వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్, వైసీపీల తరపున ఉమ్మడి కృష్ణా జిల్లాలో గుర్తింపు పొందిన నాయకుడిగా మూడు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ప్రభుత్వ విప్‌గా పనిచేసిన అనుభవం ఉంది.

ఉదయభానుకు పార్టీలో సముచిత స్థానం ఇస్తామని జనసేన నాయకత్వం హామీ ఇచ్చినట్టు ఆయన అనుచరులు చెబుతున్నారు. సామినేని చేరికలో బాలినేని ప్రోత్సాహం కూడా ఉందని తెలుస్తోంది. వీరితో పాటు మరికొందరు మాజీ నేతల్ని కూడా జనసేనలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

తదుపరి వ్యాసం