తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Andhra Telangana Mlc Elections: ఏపీ, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

Andhra Telangana MLC Elections: ఏపీ, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

HT Telugu Desk HT Telugu

09 February 2023, 14:16 IST

google News
    • Andhra Telangana MLC Elections ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో త్వరలో ఖాళీ కానున్న ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. 
కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం
కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం (HT_PRINT)

కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం

Andhra Telangana MLC Elections తెలుగు రాష్ట్రాల్లో శాసన మండలి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలిలో ఖాళీ అయ్యే మూడు పట్టభద్రుల నియోజక వర్గాలతో పాటు రెండు ఉపాధ్యాయ నియోజక వర్గాలను భర్తీ చేయాల్సి ఉంది. దీంతో పాటు ఎనిమిది స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలను కూడా భర్తీ చేస్తారు. అటు తెలంగాణ శాసన మండలిలో ఖాళీ అయ్యే రెండు స్థానాలను భర్తీ చేయనున్నారు. మార్చి 29తో సభ్యుల పదవీ కాలం పూర్తి కానుండటంతో కొత్త వారి ఎన్నికకు షెడ్యూల్ కరారు చేశారు. స్థానిక సంస్థల కోటాలో భర్తీ చేసే సభ్యుల పదవీ కాలం మే 1వరకు ఉంది.

ఆంధ్రప్రదే‌శ్‌లో ప్రకాశం- నెల్లూరు-చిత్తూరు పట్టభద్రుల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న యండపల్లి శ్రీనివాసులు రెడ్డి, కడప-అనంతపురం-కర్నూలు నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న వెన్నపూస గోపాలరెడ్డి, శ్రీకాకుళం- విజయనగరం- విశాఖపట్నం పట్టభద్రుల స్థానంలో ఎమ్మెల్సీగా ఉన్న పివిఎన్‌ మాధవ్‌, ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు ఉపాధ్యాయ నియోజక వర్గంలో ఎమ్మెల్సీగా ఉన్న విఠపు బాలసుబ్రహ్మణ్యం, కడప-అనంతపురం- కర్నూలు టీచర్స్‌ ఎమ్మెల్సీగా ఉన్న కత్తి నరసింహారెడ్డిల పదవీ కాలం ముగిసింది.

మరోవైపు అనంతపురం స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఉన్న దీపక్‌ రెడ్డి పదవీ కాలం, కడప ఎమ్మెల్సీ మర్రెడ్డి రవీంద్రనాథ్‌ రెడ్డి అలియాస్ బిటెక్ రవి పదవీ కాలం మార్చి 29తో పూర్తి కానుంది. వీరితో పాటు నెల్లూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన అంగర రామ్మోహన్‌, మంతెన వెంకట సత్యనారాయణ రాజు, తూర్పు గోదావరి జిల్లాలో చిక్కాల రామచంద్రరావు, శ్రీకాకుళంలో శత్రుచర్ల విజయరామరాజు, చిత్తూరులో బి.ఎన్.రాజసింహులు, కర్నూలులో కేఈ.ప్రభాకర్ పదవీ కాలం మే 1తో ముగియనుంది. త

తెలంగాణలో మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఉన్న కాతేపల్లి జనార్థన్ రెడ్డి పదవీ కాలం కూడా ముగియనుంది. తెలంగాణలోని హైదరాబాద్ లోకలబాడీ ఎమ్మెల్సీగా ఉన్న సయ్యద్ అమిన్ ఉల్ హసన్ జఫ్రీ పదవీ కాలం ముగిసింది. త్వరలో ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ స్థానాలకు ఫిబ్రవరి 16న నోటిఫికేషన్ విడుదల కానుంది

రెండు తెలుగు రాష్ట్రాల శాసన మండళ్లలో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి ఫిబ్రవరి 16న నోటిఫికేషన్ జారీ చేస్తారు. నామినేషన్ల దాఖలకు ఫిబ్రవరి 23వ తేదీన గడువుగా ప్రకటించారు. నామినేషన్ల పరిశీలనకు ఫిబ్రవరి 24వరకు గడువుగా నిర్ణయించారు. నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 27వ తేదీని గడువుగా నిర్ణయించారు. మార్చి 13వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. మార్చి 16న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. మార్చి 21నాటికి ఎన్నికల ప్రక్రియను ముగిస్తారు.

తదుపరి వ్యాసం