AP Heat Wave : వచ్చే మూడు రోజులు ఏపీ వాసులు బీకేర్ ఫుల్, ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు
14 May 2023, 9:43 IST
- AP Heat Wave : రాబోయే మూడు రోజులు ఏపీలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ప్రజలు వీలైనంత వరకు బయటకు రావొద్దని సూచించింది.
ఏపీలో వడగాల్పులు
AP Heat Wave : ఆంధ్రప్రదేశ్ లో రాబోయే మూడు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. ఆదివారం 136 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 173 మండలాల్లో వడగాల్పులు, సోమవారం 153 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 132 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు వెల్లడించారు. శనివారం నంద్యాల జిల్లా గోస్పాడులో 42.2°C, తూర్పుగోదావరి జిల్లా రాజానగరం, సీతానగరం మండలాల్లో 41.9°C ల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు చెప్పారు. ఇప్పటికే ఎండ తీవ్రత నేపథ్యంలో ప్రభావిత జిల్లాల యంత్రాంగానికి, సంబంధిత మండల అధికారులకు సూచనలు జారీచేశామని, క్షేత్రస్థాయిలో ప్రజలకు విపత్తుల సంస్థ నుంచి హెచ్చరిక సందేశాలు పంపుతున్నామని తెలిపారు. ప్రజలు వారి మండలంలోని ఎండ తీవ్రత ఇతర సమాచారం కోసం విపత్తుల సంస్థలో 24 గంటలు అందుబాటులో ఉండే స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్లో టోల్ ఫ్రీ నెంబర్లు 1070, 112, 18004250101 సంప్రదించాలని కోరారు.
వీలైనంత వరకు ఇంట్లోనే ఉండండి
ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. ప్రజలు వీలైనంతవరకు ఇంట్లోనే ఉండాలని, డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS, ఇంట్లో తయారుచేసుకునే పానీయాలైన లస్సీ, మజ్జిగ, నిమ్మకాయ నీరు, కొబ్బరినీరు మొదలైనవి తాగాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ డా.బీఆర్ అంబేడ్కర్ సూచించారు. మరోవైపు వేసవిలో అక్కడక్కడ ఈదురగాలులతో కురిసే అకాల వర్షాలతో పాటుగా పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే కూలీలు, పశు-గొర్రె కాపరులు చెట్ల కింద ఉండవద్దని సూచించారు.
రాబోవు మూడు రోజులు అధిక ఉష్ణోగ్రతలు
మే 14(ఆదివారం)
- విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, SPSR నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45°C - 47°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
- శ్రీకాకుళం, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42°C - 44°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
- విశాఖపట్నం, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40°C - 41°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
మే 15(సోమవారం)
- విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, SPSR నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45°C - 47°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
- కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42°C - 44°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
- శ్రీకాకుళం, విశాఖపట్నం, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40°C - 41°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
మే 16(మంగళవారం)
- శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, SPSR నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45°C - 48°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
- విశాఖపట్నం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42°C - 44°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
- శ్రీసత్యసాయి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 41°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.