Polavaram Project : పోలవరం నుంచి దిగువకు నీరు.. ఎక్కువ వరద విడుదల చేసే గేట్లు ఇవే
13 July 2022, 14:23 IST
- మెుదటిసారిగా పోలవరం ప్రాజెక్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. గేట్లను ఆపరేట్ చేయడం ఇదే తొలిసారి అని అధికారులు ప్రకటించారు.
పోలవరం ద్వారా దిగువకు నీరు
పోలవరం వరద నీటి విడుదల స్పిల్ వే వ్యవస్థ మొదటి సీజన్ లోనే సమర్థవంతంగా పనిచేసింది. ఈ స్పిల్ వే లోని అతిపెద్దవైన 48 హైడ్రాలిక్ గేట్లు తొలిసారిగా అతి తక్కువ సమయంలోనే పూర్తి స్థాయిలో వినియోగంలోకి వచ్చాయి. గోదావరికి ఆకస్మాత్తుగా వచ్చిన వరదను నియంత్రించే విధంగా పోలవరంలో హైడ్రాలిక్ పద్ధతిలో ఏర్పాటు చేసిన గేట్లు విజయవంతంగా పని చేస్తున్నాయి. అన్నీ ఒకేసారి అతి తక్కువ సమయంలోనే 15 లక్షల క్యూసెక్కుల నీటిని స్పిల్ ఛానెల్ మీదుగా గోదావరిలోకి విడుదల చేశాయి.
పోలవరం ప్రాజెక్ట్ ఇంకా నిర్మాణంలో ఉంది. స్పిల్ వేలోని ప్రధానమైన పనులన్నీ పూర్తయ్యాయి. గేట్లను ప్రపంచంలోనే అతిపెద్ద స్థాయిలో అందులోనూ హైడ్రాలిక్ పద్ధతిలో పనిచేసే విధంగా అమర్చారు. మొత్తం 48 గేట్లన్ని ఏకకాలంలో ఎత్తడం ద్వారా వాటి పనితీరు సమర్థంగా ఉందని నిరూపించినట్టైంది. వరద నీటిని సులువుగా 6 కిలోమీటర్ల మేర అప్రోచ్ ఛానెల్, స్పిల్ వే, స్పిల్ ఛానెల్, పైలెట్ ఛానెల్ మీదుగా గోదావరిలోకి విడుదల చేయడంలో గేట్ల పాత్ర కీలకంగా మారింది.
100 ఏళ్లలో గోదావరికి రికార్డు స్థాయి వరద
గతంలో ఎన్నడూ లేనివిధంగా సీజన్ మొదట్లోనే గోదావరి నదికి భారీఎత్తున వరదలు వస్తున్నాయి. ఇలా గోదారికి వరదలు రావడం 100 ఏళ్ల చరిత్రలో ఇదే మొదటి సారి అంటున్నారు ఇరిగేషన్ అధికారులు. అయితే ఎగువ నుండి వచ్చే భారీ వరదలను తట్టుకోవడానికి పోలవరం ప్రాజెక్టును ముందస్తుగానే సిద్ధంగా ఉంచారు. స్పిల్ వే నుంచి వరద నీటిని దిగువకు విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లూ చేశారు. స్పిల్ వే లో గతేడాది వరదల సమయానికే 48 గేట్లకు గానూ 42 రేడియల్ గేట్లు అమర్చడంతో పాటు, వాటిని ఎత్తడానికి అవసరమైన 84 హైడ్రాలిక్ సిలిండర్లనూ అమర్చారు. అదేవిధంగా 24 పవర్ ప్యాక్ సెట్లను సైతం స్పిల్ వే పై అమర్చి గేట్లను ఆపరేట్ చేశారు.
రివర్ స్లూయిజ్ గేట్లు
పోలవరం ప్రాజెక్టు లో రేడియల్ గేట్లతో పాటు డెడ్ స్టోరేజి లెవల్ లో రివర్ స్లూయిజ్ గేట్లు ఉంటాయి. మొత్తం 10 రివర్ స్లూయిజ్ గేట్లు, వాటికి ఒక్కో గేటుకు రెండు చొప్పున 20 హైడ్రాలిక్ సిలిండర్లు, వాటిని ఆపరేట్ చేయడానికి 10 పవర్ ప్యాక్ సెట్లు ఉంటాయి. స్పిల్ వే దగ్గరకు వచ్చిన వరదను ముందుగా రివర్ స్లూయిజ్ గేట్ ద్వారానే విడుదల చేస్తారు. వీటిని గతేడాదే అమర్చి ముందుగా వచ్చిన వరదను ఈగేట్ల ద్వారానే విడుదల చేశారు. రిజర్వాయర్ లో డెడ్ స్టోరేజి ఉన్న సమయంలో గోదావరి డెల్టాకు తాగు, సాగునీరు అందించడానికి ఈగేట్లను ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తారు.
ప్రపంచంలోనే ఎక్కువ వరద విడుదల చేసే గేట్లు
పోలవరం స్పిల్ వేలో అమర్చిన 48 రేడియల్ గేట్ల ద్వారా 50 లక్షల క్యూసెక్కుల వరదనీటిని దిగువకు విడుదల చేసేలా డిజైన్ చేశారు. చైనాలోని త్రిగార్జెస్ డ్యాం 41 లక్షల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేసేవిధంగా డిజైన్ చేస్తే పోలవరం ప్రాజెక్టు లో మాత్రం 50 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకుని విడుదల చేసేవిధంగా రూపొందించారు. అంతేకాకుండా 100 ఏళ్ల చరిత్రను ఆధారంగా చేసుకుని పోలవరం స్పిల్ వేను, గేట్లను డిజైన్ చేశారు నిపుణులు. వందేళ్లలో గోదావరికి 36 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిన చరిత్ర ఉందని అందుకే 50లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా తట్టుకునేలా పోలవరం ప్రాజెక్టు స్పిల్ వేను, గేట్లను డిజైన్ చేశారు. ఒక్కో రేడియల్ గేటు 16 మీ.వెడల్పు, 20 మీటర్ల పొడవు, 300 మెట్రిక్ టన్నుల బరువుతో రోజుకు 432 టీఎంసీలు వరద నీటిని దిగువకు విడుదల చేసే సామర్థ్యంతో పోలవరం ప్రాజెక్టు రేడియల్ గేట్లను డిజైన్ చేశారు.
సిద్ధంగా ఉన్న స్టాఫ్ లాగ్ గేట్లు
పోలవరం ప్రాజెక్టులో 48 రేడియల్ గేట్లకు 96 హైడ్రాలిక్ సిలిండర్లు ఉంటాయి. వాటిని ఆపరేట్ చేయడానికి 24 పవర్ ప్యాక్ సెట్లు ఉంటాయి. ఒక్కో పవర్ ప్యాక్ సెట్ సాయంతో రెండు గేట్లను ఆపరేట్ చేయవచ్చు. అదేవిధంగా రేడియల్ గేట్లు ఆపరేట్ చేసే సమయంలో ఏదైనా సాంకేతిక సమస్య వచ్చినా లేదా గేట్లకు ఏవైనా అడ్డుపడినప్పుడు ముందుగా స్టాఫ్ లాగ్ గేట్లను దించి అడ్డంకులను, సాంకేతిక సమస్యలను పరిష్కరించి ఆతరువాత రేడియల్ గేట్లను ఆపరేట్ చేస్తారు. దీనికోసం పోలవరం ప్రాజెక్టులో 5సెట్ల స్టాఫ్ లాగ్ ఎలిమెంట్స్ ను సిద్ధంగా ఉంచారు. 17మీటర్ల వెడల్పు, 21 మీటర్ల ఎత్తుతో వీటిని డిజైన్ చేశారు. ప్రస్తుతం ఈస్టాఫ్ లాగ్ గేట్లు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం పోలవరం స్పిల్ వే గేట్ల నుంచి 15 లక్షాల క్యూసెక్కులకు పైగా వరద నీరు దిగువకు విడుదల చేస్తున్నారు.