తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Liquor Scam Links : ఏపీతో ఢిల్లీ లిక్కర్‌ స్కాం లింకులు…..

Liquor Scam Links : ఏపీతో ఢిల్లీ లిక్కర్‌ స్కాం లింకులు…..

HT Telugu Desk HT Telugu

11 November 2022, 11:13 IST

google News
    • Liquor Scam Links ఢిల్లీ లిక్కర్‌స్కాం వ్యవహారం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. అటు తిరిగి ఇటు తిరిగి ఈ వ్యవహారం ఏపీ రాజకీయాలను చుట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈడీ అరెస్ట్‌ చేసిన అరబిందో శరత్ చంద్రా రెడ్డికి ఎంపీ విజయసాయి రెడ్డి సమీప బంధువు కావడం, ఇదే గ్రూపుకు చెందిన కంపెనీలు ఏపీలో కూడా  మద్యం వ్యాపారాల్లో ఉండటంతో రాజకీయ విమర్శలు రేగుతున్నాయి. ఏపీ నుంచి ప్రారంభించిన మద్యం వ్యాపార సామ్రాజ్యాన్ని ఢిల్లీ వరకు విస్తరించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. 
ఢిల్లీ లిక్కర్‌ స్కాంపై బీజేపీ నిర్వహించిన  ఆందోళన (ఫైల్‌)
ఢిల్లీ లిక్కర్‌ స్కాంపై బీజేపీ నిర్వహించిన ఆందోళన (ఫైల్‌) (PTI)

ఢిల్లీ లిక్కర్‌ స్కాంపై బీజేపీ నిర్వహించిన ఆందోళన (ఫైల్‌)

Liquor Scam Links : ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో రాజకీయ లింకులు బయట పడుతున్నాయి. గత కొద్ది నెలలుగా తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోన్న ఢిల్లీ లిక్కర్‌ స్కాం వ్యవహారంలో వైఎస్సార్సీపీ ఎంపీ

విజయ సాయి రెడ్డి అల్లుడి సోదరుడిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయడంతో కలకలం రేగింది. అరబిందో శరత్ చంద్రా రెడ్డిని లిక్కర్‌ స్కాంలో కీలక సూత్రధారిగా ఈడీ ఆరోపిస్తోంది. ఈ వ్యవహారం ఎటు తిరిగి ఎటు వెళ్తుందనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సాగుతోంది.

విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి అన్న శరత్‌ చంద్రారెడ్డిని ఈడీ అరెస్ట్ చేయడంతో దాని డొంక ఎక్కడ కదులుతుందోనని చర్చ మొదలైంది. శరత్‌ రిమాండ్ రిపోర్ట్‌లో ఈడీ పలు కీలక అంశాలను ప్రస్తావించింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో లబ్ది పొందిన వారిలో శరత్‌ చంద్రారెడ్డి, లిక్కర్ పాలసీ నిబంధనలకు విరుద్ధంగా బినామీ కంపెనీలతో పలు జోన్లలో మద్యం వ్యాపారాన్ని దక్కించుకున్నారని ఈడీ ఆరోపిస్తోంది.

ఆ కంపెనీ సాయిరెడ్డి అల్లుడిదే…..?

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ రిమాండ్ రిపోర్ట్‌లో ప్రస్తావించిన ట్రైడెంట్‌ కెమ్‌పర్‌ లిమిటెడ్‌లో సాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డికూడా డైరెక్టర్‌గా ఉన్నాడు. ట్రైడెంట్‌ కంపెనీలో 99.99శాతం వాటాలు ఆర్‌పిఆర్‌ సన్స్‌ అడ్వైజర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్ పేరున ఉన్నారు. ట్రైడెంట్‌ కెమ్‌ఫర్‌ లిమిడటెడ్‌ కంపెనీకి ఆర్‌పిఆర్‌ సన్స్‌ అడ్వైజర్స్‌ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మాతృ సంస్థగా ఉంది. ఈ కంపెనీలో విజయ సాయిరెడ్డి అల్లుడు రోహిత్‌ రెడ్డి డైరెక్టర్‌గా ఉన్నారు. 2021 ఏప్రిల్ 21న రోహిత్ రెడ్డి ఈ సంస్థలో చేరారు. ఇందులో పి.వెంక రామ్ ప్రసాద్ రెడ్డి, పి.సుశీలారాణిలు డైరెక్టర్‌లుగా ఉన్నారు.ఢిల్లీ మద్యం కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన ట్రైడెంట్ కెమ్‌ఫర్‌ కంపెనీ సాయిరెడ్డి అల్లుడు రోహిత్‌ రెడ్డి, ఆయన కుటుంబసభ్యులదేనని స్పష్టమవుతోంది.

ఆంధ్రా మద్యం వ్యాపారంతోను సంబంధాలు.....

ఏపీలో మద్యం విక్రయాలపై ప్రభుత్వానికి ఏటా 25వేల కోట్ల రుపాయల ఆదాయం లభిస్తోంది. 2019 తర్వాత ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహిస్తోంది. వీటిలో విక్రయించే బ్రాండ్లలో చాలా వరకు 2019 తర్వాత దుకాణాల్లోకి వచ్చి చేరాయి. 2019లో ఏర్పాటైన అదాన్ డిస్ట్రిలరీస్‌ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం రూ.1164కోట్ల రుపాయల విలువైన 68లక్షల కేసుల మద్యం సరఫరా ఆర్డర్లను ఇచ్చింది. ఆదాన్ డిస్ట్రీలరీస్ డైరెక్టర్‌గా ఉన్న శ్రీనివాస్ కాశీచయనుల, ట్రైడెంట్‌ కెమ్‌ఫర్‌ కంపెనీలో చీఫ్‌ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ఈ రెండు సంస్థలకు ఉన్న సంబంధం ఏమిటో దీంతో స్పష్టమవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో మద్యం వ్యాపారంలో ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందని విపక్షాలు చాలా కాలం నుంచి ఆరోపిస్తున్నాయి. ఆంధ్రాలో మొదలైన లిక్కర్ వ్యాపారాన్ని దేశ రాజధాని వరకు విస్తరించారనే ఆరోపణలున్నాయి.

ఆదాన్‌తో అనుబంధం....?

ఏపీలో 2019 అక్టోబర్‌2 నుంచి కొత్త మద్యం విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. 2019 డిసెంబర్ 2న హైదరాబాద్‌ కేంద్రంగా ఆదాన్ డిస్ట్రీలరీస్ ఏర్పాటైంది. సొంతంగా ఒక్క డిస్టిలరీ లేకపోయినా ఆ సంస్థ ఏర్పాటైన రెండు సంవత్సరాల్లోనే 2019 డిసెంబర్ నుంచి 2021 డిసెంబర్ మధ్య కాలంలో ఏపీ స్టేట్ బేవరేజేస్‌ కార్పొరేషన్‌ రూ.1164.02 కోట్ల విలువైన 68లక్షల కేసుల మద్యాన్ని సరఫరా చేయాలని ఆర్డర్లు ఇచ్చింది. ఏపీ ఎక్సైజ్ శాఖ వద్ద 100డిస్టిలరీ కంపెనీలు నమోదై ఉంటే వాటిలో 16కంపెనీలకు మాత్రమే 74శాతం ఆర్డర్లు లభించాయి. ఈ 16కంపెనీల్లో అత్యధిక శాతం ఆర్డర్లు ఆదాన్‌ కంపెనీకి దక్కాయి.

సొంత డిస్టిలరీలు లేకున్నా భారీగా ఆర్డర్లు….

సొంత డిస్ట్రీలరీలు లేకపోవడంతో విశాఖ డిస్టిలరీస్‌, పిఎంకే డిస్టిలేషన్‌ ప్రైవేట్ లిమిటెడ్, నంద్యాల ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌లను లీజుకు తీసుకుని ఏసీ బ్లాక్ రిజర్వ్‌ విస్కీ, ఆదాన్స్ సుప్రీం బ్లెండ్ సుపరీయర్‌ విస్కీ, ఆరిస్ట్రోకాట్ ప్రీమియం క్లాసిక్ విస్కీ, తదితర బ్రాండ్లను తయారు చేసి, ఏపీబీసీఎల్‌కు సరఫరా చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఈ బ్రాండ్లనే విక్రయించేలా మొదట్లో ఎక్సైజ్ సిబ్బందికి లక్ష్యాలు కూడా నిర్ణయించారు.

ట్రైడెంట్ కెమ్‌ఫర్‌ లిమిటెడ్‌ కంపెనీలో సిఎఫ్‌ఓగా ఉన్న శ్రీనివాస్‌ అనే వ్యక్తిని డైరెక్టర్‌గా ఆదాన్ డిస్ట్రిలరీస్‌ సంస్థ ఏర్పాటైంది. నెలకు రూ.75వేలు జీతం తీసుకునే వ్యక్తిని డైరెక్టర్‌గా ఓ కంపెనీ ఏర్పాటు చేసి దాని మీద కోట్ల రుపాయల వ్యాపారాలు చేయడం వెనుక కుట్ర ఉందనే అనుమానాలు ఉన్నాయి. ఆదాన్‌ డిస్టిలరీస్‌ డైరెక్టర్‌ ముప్పిడి అనిరుధ్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ఐటీ సలహాదారు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి తోడల్లుడు. ముఖ్యమంత్రికి రాజశేఖర్‌ రెడ్డి సన్నిహితుడిగా పేరుంది. ఏ కంపెనీ నుంచి ఎంత మద్యాన్ని కొనుగోలు చేయాలన్నది రాజశేఖర్‌ రెడ్డి నిర్ణయించేవారని టీడీపీ ఆరోపిస్తోంది. 2020 జూన్‌ 26న ఆదాన్‌ డిస్టిలరీస్‌ నుంచి అనిరుధ్‌ రెడ్డి తప్పుకున్నారు.

మద్యం నిధులు…. ఇన్‌ఫ్రా కంపెనీల్లోకి మళ్లింపు….

ట్రైడెంట్‌ కెమ్‌ఫర్‌ సంస్థలో పెనక శరత్‌ చంద్రారెడ్డి 2007 ఫిబ్రవరి 21 నుంచి 2016 మే 27 వరకు డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఆయన తమ్ముడు రోహిత్ రెడ్డి 2010-18 మధ్య కాలంలో డైరెక్టర్‌గా పనిచేశారు. ఢిల్లీ మద్యం పాలసీ స్కాంలో శరత్‌ చంద్రారెడ్డి కీలక సూత్రధారిగా వ్యవహరించారని ఈడీ ఆరోపిస్తోంది. ట్రైడెంట్‌ కెమ్‌ఫర్‌ సంస్థ నుంచి అరిబిందో రియాలిటీ అండ్ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్‌ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి 2020 ఏప్రిల్‌ నెలలో రూ.250 కోట్లను మళ్లించారు. మద్యం విక్రయాల ద్వారా వచ్చిన లాభాలను రియాలిటీ ఇన్‌ఫ్రాలోకి మళ్లించి ఉంటారని విపక్షాలు ఆరోపిస్తున్నారు. ఏపీలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అరబిందో రియాలిటీ కంపెనీకి భారీగా ప్రాజెక్టులను అప్పగించారు.

తదుపరి వ్యాసం