తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cda Centre : విజయవాడలో సైబర్‌ డేటా అనలిటికల్ సెంటర్ ఏర్పాటు

CDA Centre : విజయవాడలో సైబర్‌ డేటా అనలిటికల్ సెంటర్ ఏర్పాటు

HT Telugu Desk HT Telugu

31 July 2022, 7:36 IST

google News
    • సైబర్‌ నేరాలను నిరోధించడానికి రాష్ట్ర స్థాయిలో అత్యాధునిక కేంద్రాన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు డిజిపి రాజేంద్రనాధ్‌ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని పోలీస్‌ స్టేషన్లకు సమాచారం అందించడానికి, కేసుల దర్యాప్తును సులభం చేయడానికి సైబర్‌ డేటా అనలిటికల్ సెంటర్ ఉపయోగపడుతుందని చెప్పారు. 
డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి
డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి

డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి

ఏపీలో సైబర్‌ డేటా అనలిటికల్‌ సెంటర్‌ ద్వారా సైబర్‌ నేరాల కట్టడికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి చెప్పారు. నూతనంగా ఏర్పడిన కొత్త జిల్లాలలోని పోలీసు కార్యాలయాలు, పోలీసు స్టేషన్లలో మౌలిక సదుపాయాలను క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తున్నారు. కొత్తగా ఏర్పాటైన శ్రీ సత్యసాయి జిల్లా, అనంతపురంలలో ఆంధ్రప్రదేశ్ డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి పర్యటించారు.

సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న ముఠాలు, వ్యక్తులకు అడ్డుకట్ట వేయడానికి రాష్ట్ర పోలీసు శాఖ విజయవాడలో సైబర్‌ నేరాల పరిశోధనలో కీలకమైన సైబర్‌ డేటా అనలిటికల్‌ సెంటర్‌ ను ఏర్పాటు చేస్తున్నట్లు డిజిపి ప్రకటించారు.

సైబర్‌ డేటా అనలిటికల్‌ సెంటర్‌తో రాష్ట్రం లోని అన్ని పోలీసు స్టేషన్లను అనుసంధానం చేయడంతో పాటు అన్ని పోలీస్ యూనిట్లకు యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌లను అందిస్తారు. వీటి ద్వారా వివిధ రాష్ట్రాలకు చెందిన డేటా సెంటర్‌ నుండి కావల్సిన సమాచారాన్ని పొందవచ్చు. జిల్లా స్థాయిలో పోలీసు అధికారులకు సైబర్‌ నేరాల పరిశోధనలో శిక్షణ అందిస్తున్నామని, ఈ విధానం ద్వారా సైబర్‌ నేరాల పరిశోధన వ్యవస్థను మరింత పటిష్టంగా తయారవుతుందని చెప్పారు.

శ్రీసత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తిలోని పోలీసు హెడ్ క్వార్టర్స్, జిల్లా పోలీసు కార్యాలయం, పరేడ్ మైదానం, జిల్లా ఎస్పీ రెసిడెన్స్, తదితర కార్యాలయాలను పరిశీలించారు. కొత్త జిల్లాలలో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు పోలీసు వ్యవస్థ సక్రమ నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తామన్నారు.

శ్రీ సత్యసాయి జిల్లాలోని పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కీలక కేసులను సమీక్షించి దిశానిర్ధేశం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ, మహిళా సమస్యలపై త్వరితగతిన స్పందన, నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాల కట్టడికి కృషి చేయాలని డిజిపి సూచించారు.

తదుపరి వ్యాసం