తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Vizag Capital : 2023 ఏప్రిల్ నుంచి విశాఖ నుంచి పాలన….

Vizag Capital : 2023 ఏప్రిల్ నుంచి విశాఖ నుంచి పాలన….

HT Telugu Desk HT Telugu

29 November 2022, 8:15 IST

google News
    • Vizag Capital 2023 ఏప్రిల్ నెల నుంచి  కార్యనిర్వాహక రాజధాని విశాఖపట్నం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనను ప్రారంభిస్తారని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి, వైఎస్ఆర్ పార్టీ శాసనసభ్యుడు గుడివాడ గుడివాడ అమర్‌నాథ్  పునరుద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్‌ పరిపాలనా వ్యవహారాలు వచ్చే ఏడాది నుంచి విశాఖ కేంద్రంగా జరుగుతాయని చెప్పారు. మరోవైపుు తాము  మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని, అది తమ ప్రభుత్వ విధానం అని మంత్రి బొత్స  స్పష్టం చేశారు.
మంత్రి బొత్స సత్యనారాయణ
మంత్రి బొత్స సత్యనారాయణ

మంత్రి బొత్స సత్యనారాయణ

Vizag Capital వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి విశాఖపట్నం నుంచి కార్యనిర్వాహక రాజధాని కార్యకలాపాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రారంభిస్తారని ఆంధ్రప్రదేశ్‌ ఐటీ శాఖ మంత్రి, వైఎస్‌ఆర్‌ పార్టీ శాసనసభ్యుడు గుడివాడ గుడివాడ చెప్పారు.

వికేంద్రీకరణపై సీఎం జగన్‌ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తేనే న్యాయం జరుగుతుందని, రాజధాని అనేది కొద్దిమంది స్వార్థపరుల నిర్ణయం కాదని, రాష్ట్ర ప్రజలందరి ఆకాంక్ష అని అమర్‌నాథ్ అన్నారు.

వైజాగ్‌లో కావాల్సినన్ని ప్రభుత్వ కార్యాలయాలు, అతిథి గృహాలు ఉన్నాయి. రాజధాని నగరాల్లోనే ఉండాలని, స్వార్థ ప్రయోజనాల కోసం మారుమూల ప్రాంతాల్లో ఉండకూడదని చెబుతున్నామని అన్నారు.

మూడు రాజధానులపై హైకోర్టు తన పరిధిని దాటి తీర్పునిచ్చిందని, ఇది సరైనది కాదని చెప్పామని, సుప్రీంకోర్టుపై మాకు నమ్మకం ఉందని ముఖ్యమంత్రి, అసెంబ్లీ నిర్ణయాలను కోర్టులు అడ్డుకోవడం సరికాదని ఇప్పటికే చెప్పామన్నారు.

సుప్రీం చెప్పిందే చెబుతున్నాం… మంత్రి బొత్స

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. రైతులతో చేసుకున్న ఒప్పందాలకు కట్టుబడి ఉన్నామని శాసనసభ సాక్షిగా సీఎం చెప్పారని, వారికి మెరుగైన వసతులు కల్పిస్తున్నామని చెప్పారు.

రాష్ట్రంలో అధికార వికేంద్రీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, యూటర్న్ తీసుకునే అలవాటు మాకు లేదన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రశ్నించిన, చేసిన వ్యాఖ్యలనే మా ప్రభుత్వం మొదటి నుంచీ చెబుతోందన్నారు. రైతులకు అభివృద్ది చేసిన భూములను ఇస్తామని, మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు.

రాజధాని అమరావతిలోనే పెట్టాలని ఒప్పంద పత్రంలో చంద్రబాబు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం వికేంద్రీకరణ నిర్ణయం తీసుకుని, శాసన రాజధానిని అమరావతిలో పెడుతున్నామని చెప్పారు. ఐదేళ్లలో చంద్రబాబు ఎందుకు రాజధాని కట్టలేదని, కేవలం రెండు బిల్డింగులు మాత్రమే కట్టారని, తాత్కాలిక సెక్రటేరియట్ నిర్మాణానికి చ. అడుగు రూ.10వేలకు కట్టారంటే దానిలో ఏం జరిగిందో ఆలోచించాలన్నారు.

పాలన అనేది ఎక్కడ నుంచైనా చేయవచ్చని, పాలన సజావుగా సాగుతుందన్నదే చూడాలని, ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ది అద్భుతంగా జరుగుతున్నాయని చెప్పారు. మేనిఫెస్టో చెప్పిన అంశాలని 98శాతం మూడున్నరేళ్ళలోనే నెరవేర్చామన్నారు.

అమరావతి రైతుల ముసుగులో ఉన్నవారంతా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, దళారులు, చంద్రబాబు చుట్టాలే ఉన్నారని, అందులో రైతులు ఎవరు ఉన్నారని ప్రశ్నించారు. కోర్టు తీర్పులకు కట్టుబడి ఉన్నామని వాటిపై కామెంట్ చేయదలుచుకోలేదన్నారు. చంద్రబాబు రాజధాని పేరుతో దోపిడీ చేశారని, ఇప్పుడు అమరావతి పేరుతో ఆందోళన చేస్తుంది కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, దళారులు, చంద్రబాబు చుట్టాలు, అనుచరులేనన్నారు. మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని, అది తమ ప్రభుత్వ విధానం అని బొత్స స్పష్టం చేశారు. అంతిమంగా న్యాయమే గెలుస్తుందని, ప్రజలకు మంచి చేయాలనే చిత్తశుద్ది ఉంటే దేవుడు సైతం అండగా ఉంటాడని చెప్పారు.

తదుపరి వ్యాసం