Andhra pradesh Debts: ఐదున్నర లక్షల కోట్లు దాటేసిన ఆంధ్రప్రదేశ్ అప్పులు
14 March 2023, 11:57 IST
- Andhra pradesh Debts ఆంధ్ర ప్రదేశ్ అప్పులు రూ.5,50,650 కోట్లు ఉన్నాయి. ఏటేటా ఈ మొత్తం పెరుగుతూనే ఉంది. ఇందులో బహిరంగ మార్కెట్ నుంచి తెచ్చిన రుణాలతోపాటు, కేంద్రం నుంచి తెచ్చిన రుణాలు, ఇతర సంస్థల ద్వారా సమీకరించిన రుణాలు, ప్రభుత్వ రంగ సంస్థలకు ఇచ్చిన గ్యారంటీ రుణాలు కూడా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ అప్పులు ఐదున్నర లక్షల కోట్లు
Andhra pradesh Debts ఆంధ్ర ప్రదేశ్ అప్పులు రూ.5,50,650 కోట్లు ఉన్నాయి. ఏటేటా ఈ మొత్తం పెరుగుతూనే ఉంది. ఇందులో బహిరంగ మార్కెట్ నుంచి తెచ్చిన రుణాలతోపాటు, కేంద్రం నుంచి తెచ్చిన రుణాలు, ఇతర సంస్థల ద్వారా సమీకరించిన రుణాలు, ప్రభుత్వ రంగ సంస్థలకు ఇచ్చిన గ్యారంటీ రుణాలు కూడా ఉన్నాయి.
గ్యారంటీల ద్వారా తీసుకొచ్చిన రుణాలు మినహాయిస్తే మిగిలిన అప్పులు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 33.94 శాతంగా ఉన్నట్లు లెక్క తేలింది. 2014లో రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి ఇప్పటివరకు రుణాల లెక్కలను ఏపీ ప్రభుత్వం ఖరారు చేసింది.
మొత్తం రుణాల్లో ప్రభుత్వ సెక్యూరిటీలను రిజర్వు బ్యాంకు వద్ద తనఖా పెట్టడం ద్వారా తీసుకున్న బహిరంగ మార్కెట్ రుణాలు రూ.2,04,033 కోట్లుగా ఉన్నాయి. ఈ అప్పులు ఫిబ్రవరి 14వ తేదీ వరకు తీసుకున్నవి.ఆ తర్వాత నెల రోజుల వ్యవధిలో మరిన్ని రుణాలను రాష్ట్ర ప్రభుత్వం వివిధ మార్గాల్లో సేకరించింది.
కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకున్న రుణాలు రూ.20,962 కోట్లు, ఇతర సంస్థల నుంచి సంక్షేమ పథకాల అమలు కోసం తీసుకున్న రుణాలు రూ.18,079 కోట్లు, చిన్న మొత్తాల పొదుపు సంస్థల నుంచి తీసుకున్న రుణాలు రూ.8227 కోట్లు, ప్రావిడెండ్ ఫండ్ నుంచి తీసుకున్న రుణాలు రూ.29,236 కోట్లు, డిపాజిట్లు ద్వారా సేకరించిన రుణాలు రూ.51,719 కోట్లుగా ఉన్నాయి.
రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో పెరుగుతున్న అప్పులవాటా…
2014 నుంచి జిఎస్‌డిపిలో రుణాల శాతం క్రమంగా పెరుగుతూ వస్తోంది. 2014-15లో 28.25 శాతంగా ఉన్న రుణం తరువాత కొంత తగ్గుముఖం పట్టగా, 2019-20 నుంచి పెరగడం ప్రారంభించింది. ఆ సంవత్సరం 31.02 శాతానికి చేరుకున్న రుణం మరుసటి ఏడాది 35.53 శాతానికి చేరుకుంది. 2021-22లో 31.46 శాతానికి ఉన్న రుణం, ఈ ఏడాది ఫిబ్రవరికి అప్పుల వాటా స్థూలరాష్ట్ర ఉత్పత్తిలో 33.94 శాతానికి చేరుకుంది.
గ్యారంటీ రుణాల భారం కూడా ఎక్కువే…..
ప్రభుత్వ రంగ సంస్థలకు ఇచ్చే గ్యారంటీల ద్వారా వచ్చిన రుణాలు కూడా ప్రస్తుతం రూ.1,18,394 కోట్లుగా ఉన్నాయి. ఈ రుణాల్లో పౌర సరఫరాల సంస్థ దగ్గర రూ.31 వేల కోట్లకు అప్పులున్నాయి. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా మరో రూ.18,115 కోట్లు రుణంగా తీసుకున్నారు. రుణాల సమీకరణ కోసమే ఏర్పాటుచేసిన ఎపి రాష్ట్రాభివృద్ధి సంస్థ తీసుకున్నవి రూ.22,504 కోట్లు ఉన్నాయి. ఇవి కాకుండా నబార్డు ద్వారా వివిధ పథకాలకు మరో రూ.8,367 కోట్లు రుణంగా తీసుకున్నారు.
2014 నాటికి ఆంధ్రప్రదేశ్ అప్పులు రూ.97,177కోట్లు ఉన్నాయి. రాష్ట్ర విభజన తర్వాత తొలి ఏడాది అప్పులు రూ.1,48,743కోట్లకు చేరాయి. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పుల వాటా 28.25శాతం ఉండేది.2015-16లో అప్పులు రూ.1,69,458కోట్లకు పెరిగాయి. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పుల వాటా 27.97శాతానికి పరిమితమైంది. 2016-17లో రూ.1,94,862కోట్లకు అప్పులు చేరాయి. జిఎస్‌డిపిలో అప్పుల వాటా 27.83శాతానికి చేరాయి. 2017-18లో అప్పులు 2,23,706కోట్లకు అప్పులు చేరుకున్నాయి. ఆ తర్వాత ఏడాది 2018-19లో 2,57,510కోట్లకు అప్పలు చేరుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ఏడాది 2019-20లో అప్పులు 3,01,802కోట్లకు చేరుకున్నాయి. జిఎస్‌డిపిలో అప్పులు 31.02శాతానికి చేరాయి. 2020-21లో అప్పులు 3,50,557కోట్లకు చేరుకున్నాయి. స్థూల ఉత్పత్తిలో అప్పుల వాటా 35శాతం దాటింది. 2021-22లో రూ.3,78,087కోట్లకు అప్పుల భారం చేరింది. 2022-23లో 4,32,257కోట్లకు ఏపీ అప్పులు చేరాయి. వచ్చే ఏడాది నాటికి 5లక్షల కోట్లకు చేరువలో అప్పులు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.