Anantapur : సలామ్ 'భారతమ్మ'... కూలికెళ్తూనే కెమిస్ట్రిలో పీహెచ్డీ పూర్తి
20 July 2023, 10:24 IST
- Story of Sake Bharathi: దినసరి కూలీ.. కెమిస్ట్రీలో పీహెచ్డీ పూర్తి చేసింది. ఓవైపు పుట్టెడు కష్టాలు వెంటాడుతున్నప్పటికీ… తన ప్రయత్నాన్ని ఏ మాత్రం ఆపలేదు అనంతపురం జిల్లాకు చెందిన సాకే భారతి. చివరగా తను అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేసి… శ్రీకృష్ణదేవరాయ వర్శిటీ నుంచి పీహెచ్డీ పట్టా అందుకుంది.
కుటుంబంతో సాకే భారతి
Sake Bharathi: ఓ మారుమూల పల్లె.... అందులోనూ ఓ నిరుపేద కుటుంబం..! ఆ తల్లిదండ్రులకు ముగ్గురు ఆడపిలల్లే.. అందులో పెద్ద కుమార్తె 'సాకే భారతి'. ఊర్లోనే పదో తరగతి వరకు చదవుకుంది. ఆ తర్వాత ఓ కాలేజీలో ఇంటర్ పూర్తి చేసింది. అప్పటికే ముగ్గురి ఆడపిల్లల పోషణ, వీరి బాధ్యతల భారం, కుటుంబ ఆర్థిక స్థితి బాగోలేకపోవటంతో భారతికి ఆమె మేనమామ శివప్రసాద్‌తో పెళ్లి చేశారు. ఉన్నత చదువుల వైపు అడుగులు వేసే సమయంలో వివాహం జరగటంతో భారతి చదువులకు బ్రేక్ పడింది. అయితే భార్య పరిస్థితిని అర్థం చేసుకున్నాడు భర్త. చదువుకునేందుకు ప్రోత్సాహాం అందించాడు. ఓవైపు చదువుతూనే... మరోవైపు కూలీ పనులకు వెళ్లేది భారతి. కానీ తాను అనుకున్నది సాధించింది. రసాయన శాస్త్రంలో పీహెచ్డీ పూర్తి చేసి... యూనివర్శిటీని పట్టా పొందింది. ఇప్పుడు భారతి రియల్ స్టోరీ.... సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఆమె జీవితాన్ని చదివిన ప్రతి ఒక్కరూ... సెల్యూట్ చెప్పేస్తున్నారు. చదువుల తల్లి భారతి నీకు సలామ్ అమ్మ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
కష్టపడి డిగ్రీ, పీజీ పూర్తి చేసి…
అనంతపురం జిల్లా శింగనమల మండలం నాగులగుడ్డం అనే ఓ మారుమూల పల్లెలో జన్మించింది సాకే భారతి. తలిదండ్రులకు ముగ్గురు సంతానం కాగా... అందులో పెద్ద అమ్మాయి భారతి. ఇంటర్ తర్వాత మేనమామ శివప్రసాద్ తో వివాహం జరిపించారు. అయితే భార్య అభిరుచిని అర్థం చేసుకున్న భర్త శివప్రసాద్... పై చదువులు చదివేందుకు ప్రోత్సాహం అందించాడు. భారతి కూడా తమ జీవితాలను బాగు చేసుకోవడానికి ఇదో అవకాశం అనుకుంది. భర్త ఆర్థిక పరిస్థితీ అంతంత మాత్రమే. అందుకే కొన్నిరోజులు కాలేజీకి వెళ్తూ, మరికొన్ని దినాలు కూలీపనులు చేస్తూనే అనంతపురం ఎస్‌ఎస్‌బీఎన్‌లో డిగ్రీ, పీజీ పూర్తి చేసింది. కోచింగ్‌లూ, అదనపు తరగతుల సాయం లేకుండా రసాయన శాస్త్రాన్ని లోతుగా అర్థం చేసుకుంది. మరోవైపు తనకు కూమార్తె గాయత్రి ఉంది. ఆ బిడ్డ ఆలనా పాలనా చూసుకుంటూనే చదువూ, పనులూ సమన్వయం చేసుకునేది. రోజూ రాత్రి పొద్దుపోయే వరకూ, మళ్లీ కోడి కూయక ముందే లేచి పుస్తకాలతో కుస్తీ పట్టేది భారతి. కాలేజీకి వెళ్లాలంటే ఊరి నుంచి దాదాపు 30 కిలో మీటర్లు ప్రయాణించాలి. టికెట్ ఖర్చులు ఇబ్బందులు ఉన్నా... భరించి తరగతులకు వెళ్లేది. ఆమె కృషిని అర్థం చేసుకున్న ఉపాధ్యాయులు పీహెచ్డీ వైపు ఆలోచించాలని సూచించారు. అందుకు భర్త కూడా ప్రోత్సాహించాడు.
యూనివర్శిటీలో పీహెచ్డీ...
గురువుల సూచనలు, భర్త ప్రోత్సాహాంతో పీహెచ్డీ వైపు అడుగులు వేసింది భారతి. ఎస్కే యూనివర్శిటీలో పీహెచ్డీ సీటు సంపాదించింది. ప్రొఫెసర్ డా.ఎంసీఎస్ శుభ దగ్గర ‘బైనరీ మిక్చర్స్’ అంశంపై పరిశోధనకు అవకాశం లభించింది. ఇందుకోసం వచ్చే ఉపకార వేతనం భారతికి కొంత ఉపయోగపడింది. ఓవైపు కూలీ పనులకు వెళ్తూనే... మరోవైపు పీహెచ్డీని పూర్తి చేసింది. ఇట ఇటీవలే అనంతపురంలో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం జరిగింది. పీహెచ్‌డీ పట్టా అందుకోవడానికి వేదిక మీదకు భర్త, కూతురు కలిసి వచ్చింది సాకే భారతి. సాదాసీదాగా వచ్చిన ఆమెను చూసి కార్యక్రమంలో భాగమైన అధ్యాపకులు, ఇతర అథితులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. లక్ష్యాన్ని చేధించేందుకు పేదరికం అడ్డుకాదనే నిరూపించిన భారతిని చూసి అబ్బురపడిపోయారు.
పీహెచ్డీ పట్టాతో ఇంటికి వెళ్లిన భారతిపై గ్రామస్థులు ప్రశంసలు కురిపించారు. ఇక తనతో పాటు కూలీకి వెళ్లే వాళ్లు కూడా వచ్చి... భారతిని చూసి సంబురపడిపోయారు. కూలీ పనులకు వెళ్లే భారతి... డాక్టర్. భారతిగా మారిపోవటంతో ఆమె కుటుంబంలో చెప్పలేనంత సంతోషం నిండినట్లు అయింది. పీహెచ్డీ అర్హతతో యూనివర్శిటీ స్థాయిలో మంచి ఉద్యోగం సంపాదించాలని... అదే తన కోరిక అని చెబుతోంది సాకే భారతి. జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను ఎదుర్కొంటూ వచ్చిన భారతి... క్లిష్టమైన కెమిస్ట్రీలో పీహెచ్డీ సాధించి ఔరా అనిపించింది...! నిజంగానే ఆమె జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం... మరెందరికో ప్రేరణ...!