Amaravati : ఈ బామ్మది ఎంత మంచి మనసు.. అభినందించిన సీఎం చంద్రబాబు
29 October 2024, 10:19 IST
- Amaravati : ఇతరుల సొమ్ముకు ఆశపడే ఈ రోజుల్లో.. తన ఆస్తిని పేదల కోసం ఇచ్చేందుకు ఓ వృద్ధురాలు ముందుకొచ్చింది. ఆ బామ్మను సీఎం చంద్రబాబు అభినందించారు. త్వరలోనే అధికారులు సంప్రదిస్తారని వృద్ధురాలికి వివరించారు. అటు ఓ బాలిక సీఎంపై తనకున్న అభిమానాన్ని చాటుకుంది. అది చూసి బాబు మురిసిపోయారు.
రాజమ్మను అభినందిస్తున్న చంద్రబాబు
పేదల కోసం ప్రభుత్వం నిర్మించే ఇళ్లకు స్థలం వితరణ చేసేందుకు.. సత్తెనపల్లికి చెందిన ఓ వృద్ధురాలు ముందుకొచ్చారు. తమ గ్రామంలోని 15 పేద కుటుంబాలకు ప్రభుత్వం ఇళ్లు నిర్మిస్తే.. అందుకు తాను తన సొంత స్థలం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. పల్నాడు జిల్లా నకరికల్లు మండలం, కమ్మవారిపాలెంనకు చెందిన నరిశెట్టి రాజమ్మ.. సోమవారం సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిశారు. వదర బాధితుల సహాయార్ధం చెక్కు అందించేందుకు వచ్చారు.
ఈ నేపథ్యంలో తమ గ్రామంలో ఇళ్లు లేని పేద కుటుంబాలు ఉన్నాయని.. వారికి ప్రభుత్వం తరపున ఇళ్లు మంజూరు చేస్తే అందుకు అవసరమైన 2 లేదా 3 సెంట్ల చొప్పున స్థలం సమకూర్చుతానని తెలిపింది. దీంతో త్వరలో గృహ నిర్మాణ పథకం ప్రారంభం అవుతుందని.. ఆ సమయంలో అధికారులు సంప్రదిస్తారని సీఎం చంద్రబాబు ఆమెతో అన్నారు. పేదల ఇళ్ల నిర్మాణం కోసం స్థలం ఇచ్చేందుకు ఉదారంగా ముందుకొచ్చిన రాజమ్మను చంద్రబాబు అభినందించారు.
పొంగిపోయిన చంద్రబాబు..
తన అభిమాన నాయకుడిని నేరుగా కలిసి తీపి జ్ఞాపికను అందించింది ఓ విద్యార్ధిని. విజయవాడ పడమట విశ్వవాణి ఇంగ్లీష్ మీడియం స్కూల్‌కు చెందిన 8వ తరగతి విద్యార్ధిని లాస్యకు చంద్రబాబు అంటే అభిమానం. దీంతో తన స్వహస్తాలతో గీసిన బాబు చిత్రాన్ని తీసుకొని సోమవారం సచివాలయానికి వచ్చింది.
తాను గీసిన చిత్రాన్ని ముఖ్యమంత్రికి అందజేయడంతో ఆయన ఆనందంతో మురిసిపోయారు. 'సంపద సృష్టించి పేదవారికి పంచి ఇచ్చే పెన్నిధికి ఒక పేద విద్యార్ధి ఇచ్చే చిరుజ్ఞాపిక' అంటూ చిత్రంపై రాసింది. ఇది చూసిన చంద్రబాబు లాస్యను అభినందించారు. బాగా చదువుకొని తల్లిదండ్రులకు మంచిపేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.