School Girl Death: అన్నమయ్య జిల్లాలో స్కూల్ బస్సు బోల్తా, ఓబులవారిపాలెంలో విద్యార్ధిని మృతి
School Girl Death: అన్నమయ్య జిల్లాలో స్కూల్ బస్సులో బడికి బయల్దేరిన చిన్నారి అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయింది. రోడ్డుపై అడ్డుగా ఉన్న రాయిని ఎక్కిన బస్సు బోల్తా పడటంతో డోర్ వద్ద కూర్చున్న బాలిక బస్సు కింద పడి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.
School Girl Death: కండిషన్‌లో లేని స్కూల్ బస్సు చిన్నారి ప్రాణాలను బలి తీసుకుంది. అన్నమయ్య జిల్లా ఓబులవారి పాలెం నుంచి స్కూలు పిల్లలతో బయల్దేరిన శ్రీవాణి పబ్లిక్ స్కూల్ బస్సు రోడ్డు పక్కన బోల్తా పడింది. ఈ ఘటనలో ఎనిమిదేళ్ల భవిష్య అనే చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. బస్సు రోడ్డుకు అడ్డంగా ఉన్న రాయిపైకి ఎక్కి తిరగబడింది. ఈ ఘటనలో బస్సు తలుపుకు పక్కనే కూర్చుని చిన్నారి అదుపు తప్పి రోడ్డుపై పడిపోయింది.
బాలికపై బస్సు బోల్తా పడటంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. బోల్తా పడిన బస్సును జేసీబీ సాయంతో పక్కకు తొలగించడంతో దాని కింద చిన్నారి కనిపించింది. అన్నమయ్య జిల్లాలో స్కూల్ బస్సులకు ఫిట్‌నెస్ లేకపోయినా రవాణా శాఖ పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. కొద్ది రోజుల క్రితమే ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సు జిల్లాలో ప్రమాదానికి గురైంది. తాజాగా ఘటనలో విద్యార్ధిని ప్రాణాలు కోల్పోవడంతో తలత్లిదండ్రుల్లో విషాదాన్ని నింపింది. ప్రమాద స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.