తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Amit Shah: ఏపీలో వరదల నష్టం అంచనాకు నిపుణుల బృందాన్ని పంపుతున్నట్టు ప్రకటించిన అమిత్ షా

Amit shah: ఏపీలో వరదల నష్టం అంచనాకు నిపుణుల బృందాన్ని పంపుతున్నట్టు ప్రకటించిన అమిత్ షా

06 September 2024, 9:48 IST

google News
    • Amit shah: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో నెలకొన్న పరిస్థితిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఎక్స్​లో స్పందించారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న వరద పరిస్థితిని కేంద్రం నిశితంగా పరిశీలిస్తోందన్నారు.వరద ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. 
రాష్ట్రానికి కేంద్ర బృందాన్ని పంపినట్టు ప్రకటించిన అమిత్ షా
రాష్ట్రానికి కేంద్ర బృందాన్ని పంపినట్టు ప్రకటించిన అమిత్ షా

రాష్ట్రానికి కేంద్ర బృందాన్ని పంపినట్టు ప్రకటించిన అమిత్ షా

Amit shah: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో నెలకొన్న పరిస్థితిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఎక్స్​లో స్పందించారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న వరద పరిస్థితిని కేంద్రం నిశితంగా పరిశీలిస్తోందన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని అంచనా వేసి, తక్షణ సాయం కోసం సిఫారసులు చేసేందుకు నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా స్పందించారు. రాష్ట్రంలో వరదల పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని హోంమంత్రి అమిత్‌ షా తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని అంచనా వేసి, తక్షణ సాయం కోసం సిఫారసులు చేసేందుకు హోం శాఖ అదనపు కార్యదర్శి నేతృత్వంలో నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఎక్స్‌ వేదికగా తెలిపారు.

ఈ బృందం వరద నిర్వహణ, రిజర్వాయర్ నిర్వహణ, డ్యామ్ భద్రత తదితర అంశాలను అక్కడికక్కడే అంచనా వేయడానికి వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శిస్తుందని చెప్పారు. రాష్ట్రంలోని వరద ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించనుంది. పర్యటన తర్వాత తక్షణ సాయంపై కేంద్ర బృందం సిఫారసు చేస్తుందని తెలిపారు.

ఏపీలో వరద పరిస్థితిపై సత్వరమే స్పందించినందుకు ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర బృందం పర్యటనను స్వాగతిస్తున్నట్లు సీఎం చంద్రబాబు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కేంద్ర బృందం సిఫార్సుల కోసం ఎదురు చూస్తున్నామన్నారు. బాధిత ప్రజలకు సకాలంలో సహాయాన్ని అందించడానికి కేంద్ర బృందానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు.

వైసీపీ వల్లే నగరంలో నష్టం…

ఒక వ్యక్తి దుర్మార్గానికి నగరం గడగడలాడిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. ఇలాంటి దుర్మార్గులను కఠినంగా శిక్షిస్తే తప్ప ప్రజలకు మంచి జరగదని ఆయన పేర్కొన్నారు. ఎగువన కురిసిన వర్షాల వల్ల బుడమేరులో వరద ప్రవాహం దాదాపు 8 వేల క్యూసెక్కులు పెరగవచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. మళ్లీ బుడమేరు పొంగితే ఏం చేయాలనే ఆందోళనలో తాము ఉంటే, రాక్షసులు మాదిరి జగన్ వ్యవహారం ఉందని దుయ్యబట్టారు.

విజయవాడ నగరం వైపు పడిన 3 గండ్లలో ఒక గండిని పూడ్చామని, మరో 2 గండ్లు పూడ్చాల్సి ఉందని పేర్కొన్నారు. బుడమేరులో ఎగువ ప్రాంతంలో పెరుగుతున్న వరద ప్రవాహం వల్ల ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేసే యంత్రాంగం ఏర్పాటు చేశామని సీఎం తెలిపారు. కృష్ణా నదికి మరో 40 వేల క్యూసెక్కుల నీరు వచ్చుంటే మరింత ప్రమాదం సంభవించేదని అన్నారు.

భవానీపురంలో వచ్చిన వరద అన్ని ప్రాంతాలనూ ముంచెత్తిందని అన్నారు. బుడమేరు ప్రవాహాన్ని మళ్లించేందుకు తీసుకున్న చర్యలేవీ అమలు కాలేదన్నారు. బుడమేరు సమీపంలో 2019 నుంచి ఆక్రమణలు పెరిగాయన్న సీఎం బుడమేరు కాల్వ, వాగును గతంలో ఆక్రమించారని తెలిపారు.

గత ఐదేళ్లల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏం గాడిదలు కాసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుడమేరు ఆక్రమణలపై సర్వే చేయమన్నామని తెలిపారు. పోలవరం రైట్ మెయిన్ కెనాల్ గట్లను కూడా తవ్వేశారని దుయ్యబట్టారు. వైఎస్సార్సీపీ చేసిన తప్పునకు అమాయకులు ఇబ్బంది పడ్డారని చంద్రబాబు ఆరోపించారు.

వైఎస్సార్సీపీ లాంటి పార్టీకి రాష్ట్రంలో ఉండే అర్హత లేదని అన్నారు. సాయం చేయకపోగా నిందలేసి తప్పుడు ప్రచారం చేస్తారా అని సీఎం విమర్శించారు. ప్రజల కోసం తాను యజ్ఞం చేస్తుంటే వైఎస్సార్సీపీ నేతలు రాక్షసుల్లా అడ్డం పడుతున్నారని దుయ్యబట్టారు. ప్రజలకు సేవ చేయాలని, మరోవైపు రాక్షసులతో యుద్ధం చేయాల్సి వస్తోందని అన్నారు. బురద జల్లడం ఆపాలని, సిగ్గుంటే క్షమాపణ కోరాలని చంద్రబాబు అన్నారు. తప్పుడు ప్రచారం చేసేవాళ్లని సహించనని హెచ్చరించారు. తన ఇంటిలోకి నీళ్లొస్తే.. వస్తాయి, వెళ్తాయి అని చంద్రబాబు అన్నారు.

కేంద్ర మంత్రి అమిత్ షాతో ఫోన్లో మాట్లాడానని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఏపీలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని కోరానని తెలిపారు. విజయవాడలో, రాజధానిలోనూ ముంపు బారిన పడకుండా కార్యాచరణ రూపొందిస్తామని పేర్కొన్నారు. బోట్లల్లో తరలింపు కోసం డబ్బులు తీసుకుంటే కేసులు పెడతామని సీఎం హెచ్చరించారు. ప్రైవేట్ బోట్ల వాళ్లూ డబ్బులు వసూలు చేయకూడదని తెలిపారు.

తరలింపు కోసం డబ్బులు తీసుకుంటే అరెస్ట్ చేస్తామన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెంచకుండా ఉండేలా ప్రణాళిక రూపొందించామన్నారు. నిత్యావసరాలు, కూరగాయల ధరలకు ప్రభుత్వమే ఫిక్స్​డ్ ధర నిర్ణయిస్తుందని తెలిపారు. సాయంత్రం లేదా రేపట్నుంచి నిత్యావసర వస్తవుల పంపిణీ చేపట్టనున్నామని తెలిపారు.

తదుపరి వ్యాసం