Ambedkar Statue: రూ.400కోట్ల ఖర్చుతో అంబేడ్కర్ స్మృతి వనం ప్రారంభోత్సవానికి సిద్ధం
04 January 2024, 16:02 IST
- Ambedkar Statue: రూ.400కోట్ల రుపాయల ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులతో నిర్మిస్తోన్న 125 అడుగుల ఎత్తైన అంబేడ్కర్ విగ్రహం, స్మృతి వనం ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యాయి. జనవరి 19న విగ్రహావిష్కరణ చేయనున్నారు.
విజయవాడలో ప్రారంభోత్సవానికి సిద్ధమైన అంబేడ్కర్ స్మృతివనం
Ambedkar Statue: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అంబేడ్కర్ స్మృతి వనం పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులతో విజయవాడ నగరం నడిబొడ్డున చేపట్టిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్మృతివనం పనులు తుది దశకు చేరుకున్నాయి. దాదాపు ఏడాది క్రితమే పనులు పూర్తి కావాల్సి ఉన్నా రకరకాల కారణాలతో పనుల్లో జాప్యం జరిగింది.
దేశంలోనే అత్యంత ఖరీదైన అంబేడ్కర్ స్మృతి వనాన్ని ఏపీ ప్రభుత్వం విజయవాడలో ఏర్పాటు చేస్తోంది. అంచనాలకు రెట్టింపు ఖర్చుతో ప్రాజెక్టును పూర్తి చేశారు. రెండేళ్ల క్రితమే అంబేడ్కర్ స్మృతి వనం పనులు పూర్తివ కావాల్సి ఉన్నా కోవిడ్ ఆంక్షలు, నిధుల విడుదలలో జాప్యం, ఆకృతులు ఖరారు కాకపోవడం వంటి కారణాలతో తీవ్ర జాప్యం జరిగింది.
గత ఏడాది ఏప్రిల్‌లో హైదరాబాద్‌లో 125అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించే సమయానికి విజయవాడ విగ్రహం పనులు ప్రారంభదశలోనే ఉన్నాయి. రెండు విగ్రహాలను ఒకే నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసింది. తెలంగాణలో దాదాపు 200కోట్ల రుపాయలతో విగ్రహ నిర్మాణం, మ్యూజియం, ఇతర పనుల్ని పూర్తి చేశారు. ఏపీలో మాత్రం 125 అడుగల విగ్రహం, 80 అడుగల ఎత్తున పీఠం, కాన్ఫరెన్స్ హాల్స్, మ్యూజియం, థియేటర్లు, ల్యాండ్ స్కేపింగ్ ఇతర పనులకు దాదాపు రూ.400కోట్ల రుపాయలు ఖర్చు చేశారు.
స్మృతివనంలో భాగంగా నిర్మించిన మినీ థియేటర్, మ్యుజియం పనులను పరిశీలించిన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మి, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌లు పనులు తుది దశకు చేరుకున్నాయని చెప్పారు. జనవరి 10 కల్లా అన్ని పనులు పూర్తిచేసి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్మృతి వనం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు మొదలు పెట్టాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
విజయవాడ నగరంలో 19 ఎకరాల విస్తరణలో అభివృద్ధి చేస్తున్న అంబేద్కర్ స్మృతివనం లోని మ్యూజియంలో ప్రదర్శించే ఛాయాచిత్రాలు మరియు కళాఖండాలు అంబేద్కర్ ఆయన చిన్నతనంలో చేసిన కృషిని మరియు దేశంలో అత్యంత గౌరవమైన నాయకుడిలా మారడానికి తన మార్గంలో అడ్డంకులను ఎలా అధిగమించారో తెలియజేసే చిత్రాలని , డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కృషిని ఆడియో, వీడియోల ద్వారా తెలిపేందుకు మినీ ధియేటర్ సిద్ధంగా చేసినట్టు తెలిపారు. జనవరి 10 కల్ల మిగిలిన నిర్మాణ పన్నులని పూర్తి కానున్నట్టు అధికారులు వివరించారు.
ప్రారంభోత్సవానికి భారీ ఏర్పాట్లు…
దేశంలోనే మరెక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన అంబేద్కర్ స్మృతివనం, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణకు అన్ని ప్రాంతాల నుంచి అంబేద్కర్ అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చే అవకాశం ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. ఈ నెల 19న జరిగే ఈ కార్యక్రమంలో ప్రజలకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తెలెత్తకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
స్వరాజ్య మైదానంలో రెండు దశలుగా చేపట్టిన అంబేద్కర్ స్మృతివనం పనులను తొలి దశలో రూ.268.46 కోట్లతోనూ, మలి దశలో రూ.106.64 కోట్లతోనూ చేపట్టారన్నారు. సుమారుగా రూ.400 కోట్ల తో స్మృతివనాన్ని తీర్చిదిద్దినట్టు చెప్పారు.
విగ్రహ నిర్మాణం కొద్ది రోజుల క్రితం పూర్తవగా దీనికి సంబంధించిన లైటింగ్, పెయింటింగ్ పనులు కొనసాగుతున్నాయని, మినీ థియేటర్, మ్యూజియం, స్కై లైటింగ్, ఫౌంటెన్లు, విగ్రహం ముందు, వెనుక భాగాల్లో ఉద్యానవనాలతో సుందరీకరణ, భవనాలు, ప్రహారీ గోడల నిర్మాణం,లిఫ్టులు, వెహికల్ పార్కింగ్, ఫుడ్ కోర్ట్ తదితర ప్రధానమైన పనులన్నీ దాదాపుగా పూర్తయిపోయాయని తెలిపారు.
2024 ఎన్నికలే లక్ష్యం…
త్వరలో జరుగనున్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల లక్ష్యంగా అంబేడ్కర్ విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. విజయవాడ పార్లమెంటు నియోజక వర్గం పరిధిలో గత ఆనవాయితీలకు భిన్నంగా ఎస్సీ, బీసీ అభ్యర్థులను లోక్‌సభ బరిలో వైసీపీ నిలుపుతుందని ప్రచారం జరుగుతోంది. మార్చి నెలాఖరులోగా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఖరారు చేసినట్టు తెలుస్తోంది.
గత ఏడాది నవంబర్‌లోనే విగ్రహావిష్కరణ చేయాలని భావించినా చివరి నిమిషంలో దానిని వాయిదా వేశారు. పనులు కొలిక్కి రాకపోవడంతో పాటు జనవరిలో అయితే అధికార పార్టీకి అన్ని విధాలుగా అనువుగా ఉంటుందనే ఉద్దేశంతో వాయిదా వేసినట్టు తెలుస్తోంది.