తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Rte Admissions : పేద విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లు-ఇలా రిజిస్టర్ చేసుకోండి!

AP RTE Admissions : పేద విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లు-ఇలా రిజిస్టర్ చేసుకోండి!

22 February 2024, 20:30 IST

google News
    • AP RTE Admissions : విద్యాహక్కు చట్టం ప్రకారం పేద విద్యార్థులకు ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాల్లో 25 శాతం సీట్లు ఉచితంగా కేటాయించనున్నారు. ఈ ప్రవేశాలకు వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి షెడ్యూల్ విడుదలైంది.
 ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లు
ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లు

ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లు

AP RTE Admissions :విద్యాహక్కు(RTE) చట్టం ప్రకారం పేద విద్యార్థులకు ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో 25 శాతం సీట్లు ఉచితంగా కేటాయిస్తారు. వచ్చే విద్యాసంవత్సరం(2024-25) అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది. ప్రైవేట్‌, అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలల్లో 1వ తరగతిలో ప్రవేశాలకు ప్రభుత్వం షెడ్యూల్‌ విడుదల చేసింది. ప్రైవేటు పాఠశాలల్లో(Private Schools) 25 శాతం సీట్లు 1వ తరగతి విద్యార్థులకు కేటాయించాల్సి ఉంది. ఐబీ, ఐసీఎస్‌ఈ, సీబీఎస్సీ, స్టేట్‌ సిలబస్‌ అమలవుతున్న పాఠశాలల్లో విద్యాహక్కు చట్టం ప్రకారం 25 శాతం సీట్లు పేద విద్యార్థులకు కేటాయించాలి. ఈ నెల 6 నుంచి ప్రైవేట్, అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలల రిజిస్టర్‌ ప్రాసెస్ ప్రారంభం అయ్యింది. ప్రైవేట్ స్కూళ్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను మార్చి 1 వరకు పొడిగించారు.

రిజిస్ట్రేషన్ ప్రారంభం

విద్యార్థుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14 వరకు కొనసాగుతుందని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. cse.ap.gov.in వెబ్ సైట్ లో విద్యార్థులు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులు దరఖాస్తు సమయంలో తల్లిదండ్రుల గుర్తింపు కార్డు(ఆధార్‌, ఓటర్‌, రేషన్‌, భూహక్కు, ఉపాధి హామీ జాబ్‌కార్డు, పాస్‌పోర్ట్‌ , డ్రైవింగ్‌ లైసెన్స్‌, కరెంట్ బిల్లు, రెంటల్‌ అగ్రిమెంట్‌ కాపీ) ఒక దానిని యాడ్ చేయాలి. ప్రైవేట్ పాఠశాల్లో ప్రవేశాలకు రిజస్టర్ చేసుకున్న విద్యార్థుల దరఖాస్తులను మార్చి 20 నుంచి 22 వరకు అధికారులు పరిశీలిస్తారు. ఏప్రిల్‌ 1న లాటరీ విధానంలో అర్హులైన విద్యార్థుల తొలి లిస్ట్ విడుదల చేస్తారు. ఏప్రిల్‌ 2 నుంచి 10 వరకు విద్యార్థుల అడ్మిషన్లు ఫైనల్ చేసి ఏప్రిల్‌ 15న లాటరీ ద్వారా రెండో లిస్ట్ ప్రకటిస్తారు. ఏప్రిల్‌ 16 నుంచి 23 వరకు వివిధ ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో విద్యార్థుల అడ్మిషన్లు ఖరారు చేస్తారు అధికారులు. ఈ అవకాశాన్ని అర్హులైన పేద విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచించారు.

గురుకుల విద్యాసంస్థల్లో ప్రవేశాలు

ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డాక్టర్ బిఆర్.అంబేడ్కర్ (DR BR Ambedkar) గురుకుల విద్యాలయాలు, ఐఐటీ-మెడికల్ అకాడమీల్లో ఇంటర్మీడియట్‌ ప్రవేశాల కోసం నోటిఫికేషన్ వెలువడింది. ఈ విద్యా సంస్థల్లో ప్రవేశాలను బీఆర్‌ఏజీ ఇంటర్ సెట్ 2024 ద్వారా చేపడతారు. విద్యార్దులు తమ సొంత జిల్లాల్లోని గురుకుల(Residential Schools) విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్ధులు ఎంచుకున్న గ్రూప్ అక్కడ లేకపోతే జిల్లా జోన్‌ పరిధిలో ఉన్న మరో గురుకుల కాలేజీలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఆన్‌లైన్‌(Online)లో దరఖాస్తు చేసుకున్న తర్వాత మార్పులు చేయడానికి అనుమతించరు. గురుకుల విద్యా సంస్థల్లో ఎంపికైన విద్యార్ధులకు విద్య, వసతి ఉచితంగా కల్పిస్తారు. క్రీడల్లో ఆసక్తి ఉన్న వారికి శిక్షణ ఇస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 164 గురుకుల విద్యాలయాల్లో 5400 ఎంపీసీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. బైపీసీ సీట్లు మరో 5400 ఉన్నాయి. ఎంఈసీలో 800, సీఈసీలో 1600, హెచ్‌ఈసీలో 360 సీట్లు ఉన్నాయి.

వీటితో పాటు ఐఐటీ (IIT)మెడికల్ (Medical)అకాడమీల్లో మొత్తం 600సీట్లు ఉన్నాయి. వీటిలో ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో చెరో 300సీట్లు ఉంటాయి. కృష్ణాజిల్లా ఈడ్పుగల్లులో ఉన్న బాలికల అకాడమీలో ఎంపీసీ, బైపీసీ గ్రూప్‌లలో ఒక్కో దానిలో 160సీట్లు ఉన్నాయి. కర్నూలు జిల్లా చిన్న టేకూర్‌లోని బాలుర అకాడమీలో ఒక్కో గ్రూపులో 60సీట్లు, గుంటూరు-అడవి తక్కెళ్లపాడు బాలుర అకాడమీలో ఒక్కో గ్రూపులో 80సీట్లు అందుబాటులో ఉన్నాయి.

తదుపరి వ్యాసం