AP Pension Distribution : పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన- సచివాలయాల్లో నేరుగా లబ్దిదారులకు అందజేత
31 March 2024, 16:00 IST
- AP Pension Distribution : ఏపీలో పింఛన్ల పంపిణీపై సెర్ప్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. లబ్దిదారులు ఆధార్ కార్డు, ఇతర గుర్తింపు కార్డుతో గ్రామ, వార్డు సచివాలయాల్లో పింఛన్లు తీసుకోవాలని సూచించింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు వాలంటీర్లు నగదు పంపిణీ చేయరని తెలిపింది. ఈ విషయాన్నే సజ్జల సైతం తెలిపారు.
పింఛన్ల పంపిణీపై ప్రభుత్వం కీలక ప్రకటన
AP Pension Distribution : ఏపీలో వాలంటీర్ల విధులపై (EC on Volunteers)ఈసీ ఆంక్షల విధించిన సంగతి తెలిసిందే. పింఛన్లు సహా నగదు పంపిణీని వాలంటీర్లతో చేయించొద్దని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కోడ్ కారణంగా వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ(AP Pension Distribution) చేయరని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు. ఈసారి లబ్దిదారులు గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్లి తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో మూడో తేదీ నుంచి పెన్షన్ల పంపిణీ చేస్తారని పేర్కొన్నారు. టీడీపీ నేతల ఫిర్యాదులతోనే ఈసీ వాలంటీర్లపై ఆంక్షలు విధించిందని ఆరోపించారు. చంద్రబాబు కుట్రతోనే వాలంటీర్ల సేవలను వినియోగించుకోలేకపోతున్నామన్నారు. ఆదివారం సజ్జల మీడియాతో మాట్లాడారు.
వాలంటీర్లపై చంద్రబాబు కక్ష
వాలంటీర్ల వ్యవస్థపై(AP Volunteer System) చంద్రబాబు కక్ష కట్టారని సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Rama Krishna Reddy)ఆరోపించారు. వాలంటీర్ల వల్లే నేరుగా ఇంటి వద్దకు ప్రభుత్వ పథకాలు(Govt Schemes) అందుతున్నాయన్నారు. చంద్రబాబు వాలంటీర్ వ్యవస్థను దెబ్బతీయడానికి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. వాలంటీర్లపై చంద్రబబు పూటకో మాట మాట్లాడుతున్నారన్నారు. నిమ్మగడ్డ రమేష్ సిటిజన్ ఫర్ డెమొక్రసీ(citizen for Democracy) చంద్రబాబు తరపున పనిచేస్తుందన్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థ ఉందని పరోక్షంగా మేసెజ్ ఇచ్చారన్నారు. వృద్ధులు, వికలాంగులను ఇబ్బంది పెడితే చంద్రబాబుకు ఏమొస్తుందని ప్రశ్నించారు.
సెర్ప్ ఆదేశాలు
పింఛన్ల పంపిణీపై అధికారులకు సెర్ప్ ఉత్తర్వులు(SERP on Pensions) జారీ చేసింది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో సచివాలయాల్లో(Sachivalayas) పింఛన్లు పంపిణీ చేయాలని ఆదేశించింది. ఎన్నికల కోడ్ (Election Code)వల్ల వాలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేయకూడదని తెలిపింది. ఎన్నికల కోడ్ ముగిసేవరకు ఇంటింటికీ పింఛన్ల పంపిణీ ఉండదని ఉత్తర్వుల్లో పేర్కొంది. పింఛను లబ్ధిదారులు ఆధార్, లేదా ఇతర గుర్తింపు కార్డు తీసుకెళ్లాలని సెర్ప్ తెలిపింది.
వైసీపీ విష ప్రయోగమని టీడీపీ ఆరోపణ
పింఛన్లు పంపిణీ చేయకుండా టీడీపీ(TDP) అడ్డుకుంటుందని వైసీపీ(Ysrcp) విష ప్రచారం చేస్తుంది ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఈసీ ఆదేశాలను వక్రీకరించి ఎన్నికల్లో లబ్దిపొందాలని చూస్తున్నారన్నారు. టీడీపీ నేతలు ఫిర్యాదుతో పింఛన్ల పంపిణీ నిలిపివేసినట్లు లబ్దిదారులకు సమాచారం చేరవేయాలని వైసీపీ కుట్ర చేస్తుందని ఆరోపించారు.
పెన్షన్ల పంపిణీపై సీఎస్ కు చంద్రబాబు లేఖ
రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీకి(Pension Distribution) అవసరమైన ఏర్పాట్లు చేయాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Letter)లేఖ రాశారు. ఎన్నికల కోడ్ కారణంగా వాలంటీర్లతో(Volunteers) పెన్షన్ల పంపిణీని నిలిపివేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చిందని గుర్తుచేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా రేపు పెన్షన్ లు అందేలా చూడాలని టీడీపీ అధినేత లేఖలో కోరారు. రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం తక్షణమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సీఎస్ ను కోరారు. వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీపై కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఉన్న కారణంగా లబ్ధిదారులకు నగదు అందించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. వృద్ధులు, వింతంతువులు, ఇతర లబ్దిదారులకు నగదు రూపంలో పెన్షన్ మొత్తం చెల్లించాలన్నారు. గ్రామ సచివాలయం ఉద్యోగులు, ఇతర క్షేత్రస్థాయి సిబ్బంది ద్వారా సకాలంలో, ఎటువంటి జాప్యం లేకుండా పెన్షన్ పంపిణీ జరిపేలా చూడాలన్నారు. దీని కోసం సచివాలయ సిబ్బంది పెన్షన్ మొత్తాన్ని(Pension Amount) బ్యాంకుల నుంచి తీసుకుని వెళ్లాడానికి అనుమతించాలి...దీనికి అసవరం అయిన అనుమతులు ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో పెన్షన్ ల పంపిణీకి తగు చర్యలు చేపట్టేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని సీఈవోను(CEO) కోరారు చంద్రబాబు నాయుడు.
"పెన్షన్ ల పంపిణీకి అవసరం అయిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేయలేదు అనే వార్తలు వస్తున్నాయి. పెన్షన్ల పంపిణీకి అవసరమైన అయిన నిధులు వెంటనే అందుబాటులో ఉంచండి. గతంలో ఇచ్చిన విధంగా 1 నుంచి 5 తేదీ మధ్య పెన్షన్ల పంపిణీ ప్రక్రియ పూర్తి చేయడానికి అవరమైన యంత్రాంగాన్ని, నిధులను సిద్ధం చేయాలని కోరుతున్నాను"- చంద్రబాబు