AP Petrol Bunks : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం, ఖాళీ బాటిళ్లలో పెట్రోల్ అమ్మకాలపై నిషేధం
18 May 2024, 19:49 IST
- AP Petrol Bunks : ఏపీలో పోలింగ్ తర్వాత జరిగిన ఘటనలు, కౌంటింగ్ సమయంలో కూడా జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. పెట్రోల్ బంక్ లలో ఖాళీ బాటిల్స్, క్యానులలో పెట్రోల్ కొట్టొద్దని ఆంక్షలు విధించింది.
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం, ఖాళీ బాటిళ్లలో పెట్రోల్ అమ్మకాలపై నిషేధం
AP Petrol Bunks : ఏపీలో పోలింగ్ అనంతరం హింసాత్మక ఘటనలు చెలరేగాయి. పల్నాడు, అనంతపురం, చంద్రగిరి, తిరుపతి, తాడిపత్రి సహా పలు ప్రాంతాల్లో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య తీవ్ర దాడులు జరిగాయి. అలాగే కౌంటింగ్ అనంతరం దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అలర్ట్ చేసింది. దీంతో రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. ఇటీవల సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా దిల్లీ వెళ్లి రాష్ట్రంలో పరిస్థితులపై ఈసీకి వివరణ ఇచ్చిన సగంతి తెలిసిందే. రాష్ట్రంలో మళ్లీ హింస చెలరేగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశించింది. ఇటీవల జరిగిన ఘటనపై సిట్ వేసింది. రెండ్రోజుల్లో సిట్ దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వనుంది. ఇప్పటికే పలు జిల్లాల ఎస్పీలను బదిలీ చేసిన ఈసీ...పలువురు పోలీసుల చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. కింది స్థాయి పోలీసు అధికారులు దాడులు నిరారించడంలో అలసత్వం ప్రదర్శించారన్న ఆరోపణలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
పెట్రోల్ బంక్ లపై ఆంక్షలు
ఏపీలోని పెట్రోల్ బంక్‌లపై ఆంక్షలు విధించింది. పెట్రోల్ బంక్ లలో ఖాళీ బాటిళ్లు, డబ్బాల్లో పెట్రోల్ అమ్మకాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఖాళీ బాటిళ్లలో పెట్రోల్ నింపితే బంక్ నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరిచింది. ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల జరిగిన అవాంఛనీయ సంఘటనల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పల్నాడు ప్రాంతంలో ఇరు వర్గాలు పెట్రోల్ బాంబులతో దాడులు చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. ఇలాంటి ఘటనలు నివారించేందుకు ప్రభుత్వం రాష్ట్ర వ్యా్ప్తంగా పెట్రోల్ బంక్ లకు నోటీసులు జారీ చేసింది. బంక్ యాజమాన్యాలు ప్రభుత్వ ఆదేశాలను తప్పక పాటించాలని పెట్రోల్ బంక్ ల అసోసియేషన్ పిలుపునిచ్చింది.
మూడు జిల్లాలకు నూతన ఎస్పీలు
ఏపీలో అవాంఛనీయ సంఘటనలు జరిగిన జిల్లాల ఎస్పీలపై ఈసీ ఇటీవల బదిలీవేటు చేసింది. తాజాగా ఆ జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించింది. పల్నాడు జిల్లా కలెక్టర్‌గా లట్కర్ శ్రీకేశ్ బాలాజీతో పాటు మూడు జిల్లాలకు నూతన ఎస్పీలను నియమించింది ఈసీ. పల్నాడు ఎస్పీగా మల్లికాగార్గ్, తిరుపతి ఎస్పీగా హర్షవర్ధన్, అనంతపురం ఎస్పీగా గౌతమి సాలిని ఈసీ నియమించింది. ఇటీవల జరిగిన ఘటనల నేపథ్యంలో పల్నాడు, అనంతపురం ఎస్పీలపై ఈసీ సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. అలాగే వారినిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
పల్నాడు ఎస్పీగా మల్లికా గార్గ్
పల్నాడు జిల్లా ఎస్పీగా మల్లికా గార్గ్ ను ఈసీ నియమించింది. అత్యంత తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న పల్నాడు జిల్లాకు మహిళా ఎస్పీని నియమించడంపై ఆమె ట్రాక్ రికార్డుపై సర్వత్రా జరుగుతోంది. మల్లికా గార్గ్ గతంలో తిరుపతి, ఒంగోలు ఎస్పీగా విధులు నిర్వర్తించారు. ఈ ప్రాంతాలకు మల్లికా గార్గ్ మొదటి మహిళా ఎస్పీ కావడం విశేషం. ఒంగోలులో ఎస్పీగా ఉన్న సమయంలో ఆమె...విధుల్లో నిర్లక్ష్యం వహించిన పోలీసులపై చర్యలు తీసుకున్న ఘటనలు ఉన్నాయి. అనంతరం ఆమె తిరుపతి జిల్లా ఎస్పీగా బదిలీ అయ్యారు. అయితే తిరుపతి ఎస్పీ బాధ్యతలు తీసుకున్న మూడు వారాల్లోనే మల్లికా గార్గ్ బదిలీ అయ్యారు. వైసీపీ నేతల ఒత్తిళ్ల మేరకు ఆమెను విజయవాడ సీఐడీ ఎస్పీగా బదిలీ చేశారు. అవినీతి అధికారులకు మల్లికా గార్గ్ పేరు చెబితే హడల్ అని డిపార్ట్ మెంట్ లో టాక్ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆమెను పల్నాడు ఎస్పీ నియమించడం సరైన నిర్ణయమే అని అంటున్నారు.