AP Tenant Farmers : కౌలు రైతులకు సీఎం జగన్ గుడ్ న్యూస్, వచ్చే నెలలో అకౌంట్లో డబ్బులు జమ!
21 August 2023, 21:32 IST
- AP Tenant Farmers : ఏపీ ప్రభుత్వం కౌలు రైతులకు శుభవార్త చెప్పింది. రైతు భరోసా కేంద్రాల ద్వారా కౌలు రైతు కార్డులు పొందిన రైతులకు వచ్చే నెలలో డబ్బులు చేయనున్నారు.
కౌలు రైతులకు డబ్బులు
AP Tenant Farmers : సీఎం జగన్ కౌలు రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు. వచ్చే నెలలో కౌలు రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే ప్రభుత్వం కౌలు రైతులకు కార్డులు జారీ చేసింది. రైతు భరోసా కేంద్రాల ద్వారా 7.77 లక్షల మందికి కౌలు రైతులకు కార్డులు జారీచేశారు. కౌలు రైతుల వివరాలను రైతు భరోసా పోర్టల్ లో అప్ లోడ్ అవ్వడంతో ప్రభుత్వం తదుపరి ప్రక్రియ ప్రారంభించింది. ఆగస్టు 17 గడువు ముగిసే నాటికి రైతు భరోసా పోర్టల్ లో నమోదు చేసుకున్న 7.77 లక్షల మందికి కౌలు రైతు కార్డులు అందించారు. వీరందరికీ వచ్చే నెలలో డబ్బులు జమ చేయనున్నారు.
7.77 లక్షల మందికి కౌలు రైతు కార్డులు
రైతు భరోసా కేంద్రాలలో నమోదు చేసుకున్న 7.77 లక్షల మంది కౌలు రైతులకు సెప్టెంబర్ లో తొలి విడత సాయం అందించనున్నారు. నేరుగా కౌలు రైతుల అకౌంట్ లోనే డబ్బులు జమచేయనున్నారు. వీటితో పాటు ఈ ఏడాది కౌలు రైతులకు రూ. 4 వేల కోట్ల పంట రుణాలను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అర్హులైన ప్రతి కౌలు రైతుకు పంట రుణాలతో పాటు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలని వైసీపీ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. 2019లో పంట సాగుదారుల హక్కుపత్రాల (సీసీఆర్సీ) చట్టం ప్రకారం 11 నెలల కాల పరిమితితో కౌలు రైతు కార్డులు జారీచేస్తు్న్నారు.
కౌలు రైతులకు రుణాలు
గత నాలుగేళ్లుగా కౌలు రైతులకు పంట రుణాలతో పాటు అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని వ్యవసాయ అధికారులు తెలిపారు. గడిచిన 4 సంవత్సరాల్లో 9 లక్షల మంది కౌలుదారులకు రూ. 6,668.64 కోట్ల పంట రుణాలను అందించామన్నారు. రాష్ట్రంలో 3.92 లక్షల మంది కౌలుదారులకు రైతు భరోసా కింద రూ. 529 కోట్ల పెట్టుబడి సాయం అందించామని ప్రభుత్వం తెలిపింది. వచ్చే నెలలోనే కౌలు రైతులకు తొలి విడత నిధులు రైతుల అకౌంట్లో పడతాయని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో కౌలు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రైతు భరోసా కేంద్రాలలో ఈ-క్రాప్ నమోదు
కౌలు రైతు కార్డులు పొందిన రైతుల పంటలను ఈ-క్రాప్ లో నమోదు చేస్తున్నారు. రైతులు పంటలను అమ్ముకుందుకు ప్రభుత్వం ఈ క్రాప్ బుకింగ్ చేస్తుంది. రైతులు పండించిన ప్రతీ పంట ఈ క్రాప్ బుకింగ్ చేసేందుకు వ్యవసాయశాఖ పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తుంది. ఈ క్రాప్ బుకింగ్ కు రైతులు తమ దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రాల ద్వారా నమోదు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. వ్యవసాయశాఖకు సంబంధించిన సంక్షేమ పథకాలు అందాలంటే ఈ-క్రాప్ బుకింగ్ ఆధారంగా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది.