Mla Adimulam: సత్యవేడు ఎమ్మెల్యేపై టీడీపీ నాయకురాలి లైంగిక వేధింపుల ఆరోపణలు
05 September 2024, 13:41 IST
- Mla Adimulam: తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే తనపై అత్యాచారానికి పాల్పడ్డారని మహిళ ఆరోపించింది. ఎమ్మెల్యేను పార్టీ నుంచి సస్పెండ్ చేసి మహిళల్ని ఎమ్మెల్యే నుంచి కాపాడాలని ఆరోపించింది.
సత్యవేడు ఎమ్మెల్యేపై టీడీపీ నాయకురాలి ఆరోపణలు
Mla Adimulam: సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం చిక్కుల్లో పడ్డారు. నియోజక వర్గానికి చెందిన మహిళా నాయకురాలిపై ఎమ్మెల్యే పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్టు వీడియోలు బయటపెట్టింది. హైదరాబాద్‌లో మీడియాకు వీడియోలు, లేఖలను బాధితురాలు విడుదల చేసింది.
సత్యవేడు నియోజక వర్గానికి చెందిన మహిళా అధ్యక్షురాలిని ఎమ్మెల్యే లైంగికంగా వేధించారని బాధితురాలు ఆరోపించింది. పార్టీ ప్రచార కార్యక్రమాల్లో ఆదిమూలంతో పరిచయం ఏర్పడినట్టు వివరించింది. ప్రతిపక్షంలో ఉండగా టీడీపీ నిర్వహించిన నిరసనలు, ధర్నాల్లో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలను నిర్వహించినట్టు బాధితురాలు పేర్కొన్నారు. గత ప్రభుత్వానికి, అప్పటి అధికార పార్టీ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా తాను పనిచేశానని చెప్పారు.
ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన ఆదిమూలం అభ్యర్థిత్వాన్ని తాను వ్యతిరేకించి బిఫాం ఇవ్వకూడదని వ్యతిరేకించినా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఆదిమూలం కోసం ఎన్నికల్లో పని చేసినట్టు తెలిపారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎమ్మెల్యే తనను లైంగికంగా వేధించినట్టు ఆరోపించారు.
ఎన్నికల్లో ప్రచారం చేసిన సమయంలో తన మొబైల్ తీసుకుని మాట్లాడేవాడని, మొదట్లో చెల్లెమ్మా అని తనను పిలిచేవాడని బాధితురాలు పేర్కొంది. ఎమ్మెల్యే అయ్యాక పదేపదే తనకు కాల్స్ చేసేవాడని, లైంగిక వాంఛలు తీర్చాలని వేధించినట్టు ఆరోపించింది. ఈ ఏడాది జైలు 6న తిరుపతిలోని ఓ హోటల్‌కు తనను పిలిపించి అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపించింది. ఆ విషయం బయటపెడితే తన పిల్లల్ని చంపుతానని బెదిరించాడని, ఆ తర్వాత జులై 17వ తేదీన మరోసారి తనపై అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపించారు.
ఎమ్మెల్యే ఆదిమూలం పదేపదే ఫోన్లు చేస్తుండటం వల్ల.. ఓ రోజు తన భర్త నిలదీయడంతో ఇంట్లో గొడవలు జరిగాయని, తన కాపురం కూలిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. చివరకు తన భర్తకు విషయం చెప్పడంతో అతని సూచనతో ఆదిమూలం స్వరూపాన్ని బయటపెట్టడానికి తానే వీడియోలు చిత్రీకరించినట్టు చెప్పారు. సత్యవేడులోని పలువురు మహిళలు తనలా అన్యాయానికి గురయ్యారని, ఆగస్టు 10వ తేదీన ఆదిమూలం తనను హోటల్‌కు పిలిచినపుడు వీడియోలు రికార్డ్ చేసినట్టు ఆరోపించారు.
ఆ తర్వాత వాటిని పార్టీ దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు చేశానని చెప్పారు. విషయం తెలియడంతో తన ఇంటికి మనుషుల్ని పంపి బెదిరింపులకు పాల్పడ్డాడని, ఎమ్మెల్యేను వెంటనే సస్పెండ్ చేయాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును బాధితురాలు డిమాండ్ చేశారు. ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేసి తనను కాపాడాలని, చర్యలు తీసుకోపోతే తమకు ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదని బాధితురాలు వాపోయింది.
ఈ వ్యవహారంపై తాను పోలీసులకు ఫిర్యాదు చేయలేదని బాధితురాలు తెలిపారు. గతంలో తాను పోలసుల్ని ఆశ్రయిస్తే ఎలాంటి న్యాయం జరగలేదని, ఇప్పుడు కూడా జరగదని భావించి మీడియా ముందుకు వచ్చానని చెప్పారు. హోటల్ గదిలో దృశ్యాలను బాధిత మహిళ విడుదల చేయడంతో అవి వైరల్‌గా మారాయి. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయకుండా చంద్రబాబును న్యాయం చేయాలని ఆశ్రయించడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.