Undavalli Petition: ఉండవల్లి పిటిషన్‌పై విచారణ వాయిదా…
27 September 2023, 11:36 IST
- Undavalli Petition: స్కిల్ డెవలప్‌మెంట్ కేసును సిబిఐ విచారణకు అప్పగించాలంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ దాఖలు చేసిన పిటిషన్ విచారణ వాయిదా పడింది. ఈ కేసు విచారణకు జస్టిస్ రఘునందన్ రావు విముఖత చూపడంతో మరో బెంచ్‌కు పంపాలని సీజే హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించారు.
ఏపీ హైకోర్టులో విచారణ
Undavalli Petition: స్కిల్ డెవలప్‌మెంట్ కేసును సిఐడి విచారణ నుంచి సిబిఐకు అప్పగించాలని కోరుతూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గత వారం ఉండవల్లి వేసిన పిటిషన్ నేడు సీజే నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ముందుకు విచారణకు వచ్చింది.
ఉండవల్లి పిటిషన్ విచారణ సందర్భంగా ఈ పిటిషన్‌ను తాను విచారించలేనని జస్టిస్ రఘునందన్ రావు స్పష్టం చేశారు. డివిజన్ బెంచ్ ముందుకు ఉండవల్లి పిటిషన్ వచ్చిన నేపథ్యంలో ఈ మ్యాటర్ తాము వినలేమని న్యాయమూర్తి తెలపారు. ఉండవల్లి పిటిషన్‌లో 44మందిని ఉండవల్లి ప్రతివాదులుగా చేర్చారు.
ఇందులో సిబిఐతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఈడీ, చంద్రబాబు నాయుడు, డిజైన్‌టెక్, సీమెన్స్, స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లు ఉన్నాయి. ప్రతివాదుల్లో కొందరి తరపున గతంలో తాను వకాల్తా పుచ్చుకున్నందున ఈ వ్యవహారంపై తాను విచారించలేనని జస్టిస్ రఘునందన్ రావు తెలిపారు.
ఉండవల్లి ప్రతివాదులుగా పేర్కొన్న వారిలో కొందరి తరపున గతంలో తాను వాదించి ఉన్నందున ఈ కేసును తాను విచారించడం సహేతుకంగా ఉండదని న్యాయమూర్తి తెలిపారు. దీంతో ఉండవల్లి పిటిషన్‌ను మరో బెంచ్‌కు పంపాలని రిజిస్ట్రీని చీఫ్ జస్టిస్ ఆదేశించారు. కేసు విచారణకు మరో తేదీని కేటాయించనున్నారు.