ANU Distance Admissions 2024 : నాగార్జున యూనివర్సిటీ దూర విద్యలో డిగ్రీ, PG అడ్మిషన్లు - నవంబర్ 1 వరకు దరఖాస్తుల గడువు
06 October 2024, 13:09 IST
- ANU Distance Education Admissions 2024 : గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూర విద్యలో ప్రవేశాలు కొనసాగుతున్నాయి. ఈ గడువును నవంబర్ 1వ తేదీ వరకు అధికారులు పొడిగించారు. డిగ్రీ, పీజీ, డిప్లోమా, సర్టిఫికెట్ కోర్సులతో కలిపి మొత్తం 30కి పైగా కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు.
నాగార్జున యూనివర్సిటీ దూర విద్యా కోర్సుల్లో ప్రవేశాలు 2024
ఈ విద్యా సంవత్సరానికి సంబంధిచి గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూర విద్యలో ప్రవేశాలు కొనసాగుతున్నాయి. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ జూన్ లో విడుదల కాగా జూలై 31వ తేదీతోనే గడువు ముగియాల్సి ఉంది. ఆ తర్వతా పలు మార్లు గడువు పొడిగిస్తూ అవకాశం ఇచ్చారు. తాజాగా ఈ గడువును నవంబర్ 1వ తేదీ వరకు పొడిగించారు. అర్హులైన అభ్యర్థులు డిగ్రీ, పీజీ, డిప్లోమా, సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు.
ముఖ్య వివరాలు:
- డిగ్రీ, పీజీ, లైబ్రరీ ప్రోగ్రామ్స్ డిప్లొమా, సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ విభాగాల్లో మొత్తం 31 కోర్సుల్లో ప్రవేశాలకు అవకాశం ఉంది. అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
- డిగ్రీ మూడేళ్ల వ్యవధి, పీజీ రెండేళ్ల వ్యవధితో ఉంటుంది. డిప్లోమా కోర్సులు ఏడాది కాలపరితిమితో ఉంటాయి. సెమిస్టర్ విధానంలో పరీక్షలు రాయాల్సి ఉంటుంది.
- అండర్ గ్రాడ్యూయేట్ (యూజీ) ఆర్ట్స్ కోర్సులు 9 ఉన్నాయి. ఇందులో అభ్యర్థి ఆసక్తికి తగ్గట్టుగా కాంబినేషన్ ఎంచుకోవచ్చు.
- పోస్టు గ్రాడ్యూయేట్ (పీజీ) ఆర్ట్స్ కోర్సులు 11 ఉన్నాయి. ఈ కోర్సుల కాల వ్యవధి రెండేళ్లు (నాలుగు సెమిస్టర్స్) ఉంటుంది. ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ తెలుగు, ఎంఏ సంస్కృతం, ఎంఏ హిందీ, ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ హిస్టరీ, ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ సోషియాలజీ కోర్సులకు ఏడాది ఫీజు రూ.6,530 ఉంటుంది.
- ఈ కోర్సుల్లో ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ సంస్కృతం, ఎంఏ హిందీ మినహా ఇస్తే మిగిలిన కోర్సులన్నీ తెలుగు మాధ్యమంలోనే ఉంటాయి.
- లైబ్రరీ అండ్ ఇన్‌ఫర్మేషన్ సైన్స్ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇందులో బ్యాచిలర్ డిగ్రీ(Blisc), మాస్టర్ డిగ్రీ(Mlisc) చేయవచ్చు.
- అధికారిక వెబ్ సైట్ - https://anucde.org
- మెయిల్ అడ్రెస్- anucdedirector@gmail.com
- కోర్సుల వివరాల సమాచారం తెలుసుకునేందుకు సంప్రదించాల్సిన నెంబర్లు :0863-2346222/2346208/2346214
- కోర్సుల వివరాలు, ఫీజు, కాలపరిమితి తెలుసుకునేందుకు లింక్ - https://anucde.org/dashboards/analytics/
అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో ప్రవేశాలు:
మరోవైపు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో డిగ్రీ, పీజీ, డిప్లోమా ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే పలుమార్లు దరఖాస్తుల గడువును కూడా పొడిగించారు. సెప్టెంబర్ 30వ తేదీతో గడువు ముగియగా… మరోసారి అధికారులు గడువును పెంచారు. అక్టోబర్ 15వ తేదీ వరకు ఆన్ లైన్ అప్లికేషన్లు చేసుకోవచ్చని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఏపీ, తెలంగాణలోని స్టడీ సెంటర్లలో కూడా అప్లికేషన్లు చేసుకోవచ్చు.
అర్హత కలిగిన అభ్యర్థులు https://www.braouonline.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవచ్చు. ఈ సైట్ లో వెళ్లి ముందుగా అభ్యర్థి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. కోర్సుల వివరాలు, ట్యూషన్ ఫీజు వివరాలను వెబ్ సైట్ లో పొందుపరిచారు. ఆన్ లైన్ దరఖాస్తుల రుసుంతో పాటు ట్యూషన్ ఫీజును ఆన్‌లైన్ విధానంలో చెల్లించాల్సి ఉంటుంది. క్రెడిట్/డెబిట్ కార్డు ద్వారా ఏపీ, టీఎస్ ఆన్లైన్ సెంటర్ ల ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు.
ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునే సమయంలో స్టడీ సెంటర్లను జాగ్రత్తగా ఎంచుకోవాలి. మీకు దగ్గరగా, అనుకూలంగా ఉండే ప్రాంతాల వివరాలను వెబ్ సైట్ లో చూడొచ్చు. కేవలం హైదరాబాద్ పరిధిలోనే కాకుండా జిల్లాల్లోనూ స్టడీ సెంటర్లలో పేర్లు నమోదు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం వర్సిటీ హెల్ప్‌లైన్ నెంబర్లు 7382929570, 7382929580, 7382929590 & 7382929600 సంప్రదించవచ్చని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.