Lover Attack: పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలి గొంతు కోసిన యువకుడు
06 September 2023, 7:43 IST
- Lover Attack: ప్రేమించిన యువతి పెళ్లికి ఒప్పుకోలేదని దాడికి పాల్పడుతున్నఉదంతాలు తరచూ వెలుగు చూస్తున్నాయి. హైదరాబాద్ ఎల్బీనగర్ ఉదంతం మరువక ముందే విశాఖలో అదే తరహా ఘటన జరిగింది. ప్రియురాలి గొంతు కోసిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
విశాఖ పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు
Lover Attack: ప్రియుడి ప్రవర్తన నచ్చకపోవడంతో పెళ్లికి నిరాకరించడమే ఆమె చేసిన తప్పైంది. ఇరు కుటుంబాలు పెళ్లికి అంగీకరించినా ప్రియుడి ప్రవర్తన నచ్చకపోవడంతో అతనితో కలిసి జీవించేందుకు ఇష్టపడక పోవడంతో ఆగ్రహించిన ప్రియుడు గొంతు కోసి పరారయ్యాడు.
విశాఖపట్నంలోని మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో యువతిపై దాడిఘటన కలకలం రేపింది. విశాఖ పట్నం ఇండస్ట్రియల్ ఏరియా ప్రాంతానికి చెందిన యువతిని, ఎన్.రామారావు(27) అనే వ్యక్తి ప్రేమించాడు. ఇద్దరు దాదాపు పదేళ్లుగా ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. కొద్ది రోజుల క్రితం రెండు కుటుంబాలకు చెందిన పెద్దలు మాట్లాడుకొని ఇద్దరికీ పెళ్లి చేయాలని నిర్ణయించారు.
ఈ క్రమంలో యువతీ యువకుల మధ్య మనస్పర్థలు వచ్చాయి. ప్రియుడి తీరు నచ్చకపోవడంతో యువతి అతనితో పెళ్లికి నిరాకరించింది. అతడిని పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పింది. దీంతో యువతిపై రామారావు కోపం పెంచుకున్నాడు. పెళ్లికి నిరాకరించడానికి రామారావు ప్రవర్తనలో మార్పు రావడమే కారణమని యువతి బంధువులు ఆరోపిస్తున్నారు. పెళ్లికి పదేపదే ఒత్తిడి తెస్తుండడంతో ఇరవై రోజుల క్రితం పెద్దలు పంచాయితీ పెట్టారు.
తాను రామారావును పెళ్లి చేసుకోనని ఆమె తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో రామారావు సోమవారం రాత్రి ఆమె ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో యువతి మేడపై ఉండడంతో అక్కడికి వెళ్లాడు. మళ్లీ పెళ్లి ప్రస్తావన చేశాడు. ఆమె నిరాకరించడంతో రామారావు వెంటనే బ్లేడ్‌తో దాడి చేశాడు. ఆమె మెడపై తీవ్ర గాయాలయ్యాయి. ఆ తరువాత రామారావు కూడా మెడ, చేతిపై బ్లేడ్‌తో కోసుకున్నాడు.
యువతిని కుటుంబసభ్యులు దగ్గరలో ఉన్న ప్రైవేటు ఆస్పత్రికి తీసుకొని వెళ్లగా వైద్యులు మెడపై 12 కుట్లు వేశారు. ఉదయం వరకు ప్రాణంతో ఉంటే ఫోన్ చేయి' అని చెప్పి అక్కడి నుంచి పరారయ్యాడు. రక్తం మడుగులో ఉన్న బాధితురాలు అరవడంతో కుటుంబీకులు వచ్చి ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయం లేదని వెల్లడించారు.పెళ్లికి అంగీకరించకపోవడంతో ఆమె ఎదుట చని పోదామని వెళ్లానని, పెనుగులాటలో బ్లేడ్ ఆమె మెడకు తగిలి గాయమైందని నిందితుడు రామారావు చెబుతున్నాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన మల్కాపురం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.