తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Anantapur: అనంత‌పురం జిల్లాలో విషాదం.. రీల్స్ చేసే స‌ర‌దాలో యువ‌కుడు.. క్వారీలో జారిప‌డి మృతి

Anantapur: అనంత‌పురం జిల్లాలో విషాదం.. రీల్స్ చేసే స‌ర‌దాలో యువ‌కుడు.. క్వారీలో జారిప‌డి మృతి

HT Telugu Desk HT Telugu

01 September 2024, 9:04 IST

google News
    • Anantapur: అనంతపురం జిల్లాలో విషాదం జరిగింది. రీల్స్ చేసే స‌ర‌దాలో యువ‌కుడు క్వారీలో జారిప‌డి మృతి చెందాడు. ఈ ఘ‌ట‌న‌తో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ విషాద ఘ‌ట‌న చిల‌మ‌త్తూరు మండ‌లం య‌గ్నిశెట్టిప‌ల్లిలో శ‌నివారం జరిగింది.
అనంత‌పురం జిల్లాలో విషాదం
అనంత‌పురం జిల్లాలో విషాదం (CCO)

అనంత‌పురం జిల్లాలో విషాదం

హిందూపురం ప‌ట్ట‌ణం బాలాజీ న‌గ‌ర్‌కు చెందిన రియాజ్‌వుల్లాకు ఇద్ద‌రు పిల్ల‌లు. అందులో మ‌హ‌మ్మ‌ద్ కైఫ్ (22) ఒక‌రు. రెండు రోజుల కిందటే మ‌హ‌మ్మ‌ద్ కైఫ్ చెల్లి పెళ్లి జ‌ర‌గ‌డంతో.. స‌ర‌దాగా కుటుంబ స‌భ్యులంతా క‌లిసి య‌గ్నిశెట్టిప‌ల్లి స‌మీపంలోని క్యారీకి వెళ్లారు. కుటుంబ స‌భ్యులంతా అక్క‌డ పొలాల్లో ఉన్నారు. మ‌హ‌మ్మ‌ద్ కైఫ్ మాత్రం నీటిలోకి దిగాడు.

గ‌ట్టుపైన కొంత మంది బంధువులు వీడియో తీస్తుండ‌గా.. మ‌హమ్మ‌ద్ కైఫ్ నీటిలోకి దిగి విన్యాసాలు చేస్తున్నాడు. ఈ స‌మ‌యంలో కాలు జారి మునిగిపోయాడు. ఎంతసేప‌టికి బ‌య‌ట‌కు రాకపోవ‌డంతో.. బంధువులు గ‌ట్టిగా కేక‌లు వేశారు. కుటుంబ స‌భ్యులు వ‌చ్చి చూసే స‌రికి కైఫ్ మునిగిపోయాడు. కుటుంబ స‌భ్యుల‌కు ఎవ‌రికీ ఈత రాక‌పోవ‌డంతో.. త‌మ క‌ళ్ల‌ముందే మునిగిపోతున్నా కాపాడ‌లేని దీనస్థితిలో ఉన్నారు.

కుటుంబ స‌భ్యులు ఇంట్లో ఉన్న పెద్ద‌వారికి స‌మాచారం ఇచ్చారు. వారు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఈ విష‌యం తెలుసుకున్న ఎస్ఐ మునీర్ అహ్మ‌ద్.. అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచారం అందించారు. వారితోపాటు ఎస్ఐ ఘ‌ట‌న స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని బ‌య‌ట‌కు తీసేందుకు అగ్నిమాప‌క సిబ్బంది గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. కానీ.. మృతదేహం ల‌భ్యం కాలేదు.

రాత్రి కావ‌డ‌తో ఆదివారం వ‌చ్చి మృతదేహాన్ని వెతుకుతామ‌ని అగ్నిమాప‌క సిబ్బంది చెప్పి వెళ్లిపోయారు. దీంతో కుటుంబ స‌భ్యులు, బంధువులు క‌న్నీరుమున్నీరుగా విలపించారు. ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. గ‌తంలో త‌న ఫోన్‌ల్లో వేరేవాళ్లు ఇదే ప్ర‌దేశంలో చేసిన రీల్స్‌ను చూసి.. మ‌హమ్మ‌ద్ కైఫ్ కూడా య‌గ్నిశెట్టిప‌ల్లి క్వారీకి వ‌చ్చిన‌ట్లు బంధువులు తెలిపారు. శుభ‌కార్యం జ‌రిగిన ఇంట్లోనే విషాదం నెలకొందని దుఖిస్తున్నారు. పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని వెలికి తీసిన త‌రువాత పోస్టుమార్టం నిమిత్తం ఆసుప‌త్రికి త‌ర‌లిస్తామ‌ని చెప్పారు.

(రిపోర్టింగ్- జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

తదుపరి వ్యాసం