Srikakulam: రణస్థలంలో విషాదం.. కుమార్తెను చూడటానికి వెళ్లిన తండ్రి.. మళ్లీ తిరిగి రాలేదు!-father and son killed in road accident in srikakulam district ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Srikakulam: రణస్థలంలో విషాదం.. కుమార్తెను చూడటానికి వెళ్లిన తండ్రి.. మళ్లీ తిరిగి రాలేదు!

Srikakulam: రణస్థలంలో విషాదం.. కుమార్తెను చూడటానికి వెళ్లిన తండ్రి.. మళ్లీ తిరిగి రాలేదు!

HT Telugu Desk HT Telugu
Aug 26, 2024 09:36 AM IST

Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. త‌న కుమార్తెను చూడ‌టానికి వెళ్లి వ‌స్తున్న స‌మ‌యంలో జ‌రిగిన‌ రోడ్డు ప్ర‌మాదంలో.. తండ్రీ కొడుకులు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదం
శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదం

శ్రీ‌కాకుళం జిల్లా ర‌ణ‌స్థ‌లం మండ‌లం బంటుప‌ల్లి జంక్ష‌న్ వ‌ద్ద జాతీయ ర‌హ‌దారిపై ఆదివారం ప్రమాదం జరిగింది. ద్విచ‌క్ర‌వాహ‌నాన్ని లారీ ఢీకొట్ట‌ింది. ఈ ప్ర‌మాదంలో తండ్రీకొడుకులు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. విజ‌య‌న‌గ‌రం జిల్లా రేగిడి మండ‌లం ఉప్ప‌ర నాయుడు వ‌లస గ్రామానికి చెందిన క‌ర‌ణం రామ‌కృష్ణ (52), ఆయ‌న కుమారుడు సాయికిర‌ణ్ (21)తో క‌లిసి భోగాపురంలో చ‌దువుకుంటున్న త‌న కుమార్తెను చూడ‌టానికి వెళ్లారు.

రెండు రోజుల కిందటే..

విశాఖ‌ప‌ట్నంలో డిగ్రీ చ‌దువుతున్న కుమారుడు సాయికిరణ్.. రెండు రోజుల కిందట్ ఇంటికి వ‌చ్చాడు. అక్క‌ను చూసొద్దాంరా అని తండ్రి అడగడంతో ఇద్దరు కలిసి వెళ్లారు . భోగాపురంలో కోచింగ్ సెంట‌ర్‌లో ఉన్న త‌న కుమార్తె సాత్విక‌ను కలిశారు. కాసేపు ఆమెతో గ‌డిపి.. ఇంటి విష‌యాలు, బంధువుల విష‌యాలు ముచ్చ‌టించారు.

లారీ ఢికొట్టడంతో..

తిరిగి స్వ‌గ్రామానికి వ‌స్తున్న స‌మ‌యంలో.. శ్రీ‌కాకుళం జిల్లా ర‌ణ‌స్థ‌లం మండ‌లం బంటుప‌ల్లి జంక్ష‌న్ వ‌ద్ద వీరి బైక్‌ను లారీ ఢీకొంది. దీంతో తండ్రి కొడుకులు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. స్థానికులు పోలీసుల‌కు సమాచారం ఇచ్చారు. రామ‌కృష్ణ జేబులో ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా.. అడ్ర‌స్ తెలుసుకుని కుటుంబ స‌భ్యుల‌కు పోలీసులు స‌మాచారం ఇచ్చారు. రామ‌కృష్ణ‌, సాయి కిర‌ణ్ మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం శ్రీ‌కాకుళం రిమ్స్ ఆస్ప‌త్తికి త‌ర‌లించారు.

రిమ్స్‌కు బంధువులు..

శ్రీ‌కాకుళం రిమ్స్‌కు కుటుంబ స‌భ్యులు, బంధువులు చేరుకున్నారు. సాయి కిర‌ణ్ స్నేహితులు కూడా రిమ్స్‌కు చేరుకున్నారు. కుటుంబ స‌భ్యులు, బంధువుల రోద‌న‌లు మిన్నంటాయి. భ‌ర్త‌, కుమారుడు మృతితో రామకృష్ణ భార్య ర‌త్న కుమారి క‌న్నీరుమున్నీరుగా విలపించారు. త‌న‌తో మాట్లాడి వెళ్లిన కాసేపటికే తండ్రి, త‌మ్ముడు మృతిచెందారన్న వార్త విన్న సాత్విక.. దుఖం చూసి అక్కడనున్నవారు కంటతడి పెట్టారు.

( రిపోర్టింగ్- జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ప్రతినిధి )