APSRTC : శ్రీకాకుళం నుంచి పూరీ రథయాత్రకు ప్రత్యేక బస్సు సర్వీస్
Srikakulam to Puri Rath Yatra Bus: పూరీ రథయాత్రకు వెళ్లే భక్తుల కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసును ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.
శ్రీకాకుళం నుంచి ఒరిస్సాలోని పూరి జగన్నాథ రథయాత్రకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) ప్రత్యేక బస్సు సర్వీస్‌ను అందుబాటులోకి తెచ్చింది. శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుంచి ఒరిస్సాలోని పూరీ రథయాత్రకు ఆర్టీసీ స్పెషల్ లగ్జరీ బస్ సర్వీస్‌ను వేసింది. భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక సర్వీస్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రయాణీకులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా డీపీటీవో ఏ.విజయ్‌కుమార్ తెలిపారు.
కొత్త మార్గాలు, ఆధ్యాత్మిక పర్యటక కేంద్రాలకు నిత్యం కొత్త సర్వీసులను, ప్రత్యేక సర్వీసులను ఆర్టీసీ అందుబాటులోకి తెస్తుంది. అందులో భాగంగానే శ్రీకాకుళం నుంచి ప్రత్యేక సర్వీసును తీసుకొచ్చింది. ఏపీఎస్ ఆర్టీసీ గత కొంత కాలంగా ఈ ప్రత్యేక సర్వీసులను అందుబాటులోకి తెస్తోంది. సీజన్ ప్రకారం ఆధ్యాత్మిక, పుణ్యక్షేత్రాలకు, టూరిస్టు ప్రాంతాలకు ఆర్టీసీ సర్వీస్‌లను వేస్తుంది.
టైమింగ్స్ ఇవే….
ఈ నెల 13న (శనివారం) రాత్రి 8 గంటలకు శ్రీకాకుళం బస్ కాంప్లెక్స్ నుంచి సూపర్ లగ్జరీ బస్ బయలుదేరుతుంది. 14 (ఆదివారం) ఉదయం 5 గంటలకు పూరీ చేరుకుంటుంది. జగన్నాథస్వామి దర్శనం చేసుకున్న తరువాత మధ్యాహ్నం 12 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి, మధ్యాహ్నం 3ః30 గంటలకు కోణార్క్ వెళ్తుంది. అక్కడ సూర్యదేవాలయ సందర్శన అనంతరం సాయంత్రం 6 గంటలకు బస్సు కోణార్క్‌లో బయలుదేరుతుంది. మరుసటి రోజు జులై 15 (సోమవారం) ఉదయం 6 గంటలకు శ్రీకాకుళం చేరుకుంటుంది.
ఈ యాత్రకు సంబంధించి ఒక్కో టికెట్టు ధర రూ.2,200గా నిర్ణయించారు. టికెట్ రిజర్వ్ చేసుకునేవారు డిపో కార్యాలయంలో సంప్రదించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు 7382921647, 9959225608 ఫోన్ నంబర్లను సంప్రదించాలి.
అయోధ్య-కాశీ యాత్రకు ప్రత్యేక బస్సు సర్వీసులు
అనంతపురం జిల్లా మడకశిర నుండి ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య-కాశీ యాత్రకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) ప్రత్యేక బస్సు సర్వీస్‌ను అందుబాటులోకి తెచ్చింది.
భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక సర్వీస్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రయాణీకులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీపీటీవో మధుసూదన్ తెలిపారు. ఈనెల 14 (ఆదివారం) నుంచి ప్రత్యేక బస్సు సర్వీస్ అందుబాటులోకి రానుంది. ఆదివారం మడకశిర బస్ కాంప్లెక్స్‌లో ఈ బస్సు బయలుదేరుతుంది. టిక్కెట్టు బుక్ చేసుకోవాలనుకునే వారు ఆర్టీసీ బస్ కాంప్లెక్స్‌లో సంప్రదించాలి.
మరోవైపు జంగారెడ్డిగూడెం నుండి హైదరాబాద్‌కు నూతన స్టార్ లైనర్ నాన్ ఏసి స్లీపర్ బస్సులను, విశాఖపట్నం వైపునకు సూపర్ లగ్జరీ బస్సులను ఏపీఎస్ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చింది. అలాగే తెనాలి నుండి బెంగళూరు, విజయవాడ తదితర ప్రాంతాలకు బస్సు సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది.