Woman Suicide attempt: కృష్ణా వారధి నుంచి దూకి మహిళ ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులు
29 September 2023, 6:50 IST
- Woman Suicide attempt: గురువారం రాత్రి చిమ్మచీకట్లో కృష్ణా వారధి పై నుంచి నదిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసిన మహిళను పోలీసులు కాపాడారు. వాహనాలు రద్దీగా దూసుకుపోయే సమయంలో బ్రిడ్జిపై స్కూటీ నిలిపి ఒక్కసారిగా మహిళ నదిలో దూకేసింది.
మహిళను కాపాడి నది నుంచి బయటకు తీసుకు వస్తున్న పోలీసులు
Woman Suicide attempt: కుటుంబ కలహాలతో నదిలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించిన ఓ మహిళను పోలీసులు సకాలంలో స్పందించి కాపాడారు. తాడేపల్లి నుంచి విజయవాడ వచ్చే మార్గంలో కృష్ణా నది వంతెన పై నుంచి దూకి ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. గురువారం రాత్రి వాహనాల రద్దీ ఉన్న సమయంలోనే ఈ ఘటన జరిగింది. ప్రత్యక్షంగా చూసిన వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
రాత్రి పది గంటల సమయంలో తాడేపల్లి పోలీస్ స్టేషన్‌కు కంట్రోల్ రూమ్ నుంచి సమాచారం అందింది. విషయం తెలిసిన వెంటనే తాడేపల్లి ఎస్ఐ రమేష్‌తో పాటు ట్రాఫిక్ పోలీసులు రియాక్ట్ అయ్యారు. స్పాట్‌కు చేరుకుని పరిశీలించారు. ఘటనా స్థలంలో బాధితురాలు తీసుకొచ్చిన ద్విచక్ర వాహనం మాత్రమే ఉండటంతో వివరాలు తెలియలేదు. టార్చి లైట్ల సాయంతో నదిలోకి పరిశీలించడంతో బాధితురాలు ప్రాణాలతోనే ఉన్నట్లు గుర్తించారు.
27వ నంబరు ఖానా వద్ద నదిలో దూకిన మహిళ కొద్ది దూరంలోనే చెట్టును పట్టుకుని ఉన్నట్టు గుర్తించారు. కృష్ణానది మధ్యలో ఓ పాయలో మాత్రమే ప్రస్తుతం ప్రవాహం ఉంది. ప్రకాశం బ్యారేజీ నుంచి నీటి విడుదల లేకపోవడంతో ప్రవాహం తక్కువగానే ఉంది. మహిళను గుర్తించిన వెంటనే పోలీసులు ఇసుక తిన్నెల మీదుగా నదిలోకి వెళ్లి ఆమెను గుర్తించారు. వారధి పై నుంచి కిందకు దూకడంతో బాధితురాలు తీవ్రంగా గాయపడినట్లు గుర్తించారు.
మహిళ ఉన్న ప్రదేశానికి వెళ్లేందుకు మార్గం లేకపోవడంతో స్థానిక యువకులతో కలిసి రెస్క్యూ ప్రారంభించారు. చిమ్మచీకటిలోనే రెండు గంటల పాటు శ్రమించి బాధితురాలు ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. నది మధ్యలో అక్కడకక్కడ నీటి మడుగులు ఉండటంతో పోలీసులు వాటిని దాటుకుంటూ స్పాట్ చేరుకున్నారు.
తాడేపల్లి ఎస్సై రమేష్‌తో పాటు నైట్ పెట్రోలింగ్ పోలీసులు స్వయంగా స్ట్రెచర్‌పై బాధితురాలిని కిలోమీటర్ పైగా నదిలో మోసుకుంటూ బయటకు తీసుకు వచ్చారు. విజయవాడ-తాడేపల్లి మధ్య కృష్ణానది దాదాపు రెండు కిలో మీటర్ల వెడల్పున విస్తరించి ఉంటుంది. తాడేపల్లి ట్రాఫిక్ పోస్ట్ సమీపంలో 108 అంబులెన్స్‌ను ఉంచి అక్కడి వరకు బాధితురాలిని తీసుకు వచ్చారు. అనంతరం ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్య కు ప్రయిత్నించిన మహిళను విజయవాడ కృష్ణలంకకు చెందిన మహిళ గా గుర్తించారు. పోలీసులు స్పందించిన తీరును స్థానికులు అభినందించారు.