తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Lock Down Murders: బెజవాడలో దారుణం..లాక్‌డౌన్‌లో వరుస హత్యలు

Lock Down Murders: బెజవాడలో దారుణం..లాక్‌డౌన్‌లో వరుస హత్యలు

HT Telugu Desk HT Telugu

13 April 2023, 6:52 IST

google News
    • Lock Down Murders: కోవిడ్‌ లాక్‌డౌన్‌  కాలంలో ఒంటరి వృద్ధుల్ని లక్ష్యంగా చేసుకుని వరుస హత్యలకు పాల్పడిన ముఠాను విజయవాడ పోలీసులు కటకటాలవెనక్కి పంపారు. రెండేళ్ల క్రితం కాకతాళీయంగా బయటపడిన ఈ కేసులో నిందితులు హత్యలు చేశారని తెలియడంతో పోలీసులు ఖంగుతిన్నారు.విచారణలో నిందితులకు యావజ్జీవ శిక్ష విధించారు.
హత్యలకు పాల్పడిన నిందితులు
హత్యలకు పాల్పడిన నిందితులు

హత్యలకు పాల్పడిన నిందితులు

Lock Down Murders: వీధుల్లో కూరగాయాలు అమ్ముకునే వారిలా నటిస్తూ ఒంటరి మహిళలు, వృద్ధుల్ని గుర్తించి హత్యలకు పాల్పడి ఆపై దోపిడీలకు పాల్పడిన ముఠాకు విజయవాడ కోర్టు యావజ్జీవ జైలు శిక్ష విధించింది. విజయవాడలోని పెనమలూరు, కానూరు ప్రాంతాలకు చెందిన ఆటోడ్రైవర్లు ముఠాగా ఏర్పడి కోవిడ్ లాక్‌డౌన్‌ సమయంలో ఆరు హత్యలు, దోపిడీలకు పాల్పడ్డారు. ఓ రోజు ఏటిఎంలో చోరీ చేసేందకు ఈ ముఠా ప్రయత్నించింది. ఏటిఎంపగులగొడుతుండగా స్థానికులు గుర్తించడంతో పారిపోయారు. సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా అనుమానితుల్ని గుర్తించి విచారణ ప్రారంభించారు.

పోలీసుల విచారణలో నిందితులు ఏటిఎం దొంగలు కాదని, హత్యలకు పాల్పడుతున్న గ్యాంగుగా గుర్తించారు. ఒంటరిగా ఉన్న వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకుని, హత్యలు చేసి నగలను దోచుకున్నట్లు తెలియడంతో పోలీసులు నివ్వెరపోయారు. 22ఏళ్ల వయసులోపు ఉన్న ఐదుగురు నిందితులు పక్కా ప్లాన్‌తో వరుస హత్యలకు పాల్పడ్డారు. ఒక్క హత్యపై కూడా పోలీస్ కేసు నమోదు కాలేదు. ఊపిరాడకుండా చేసి హత్యలు చేసి నగలు దోచుకుని పారిపోయే వారు.

విజయవాడతో పాటు కృష్ణాజిల్లాలో ి ఒంటరిగా వున్న వృద్ధ మహిళలను టార్గెట్ చేసి, రెక్కీ నిర్వహించి హత్యచేసి బంగారు ఆభరణాలు దోచుకునే ఐదుగురు సభ్యుల ముఠాను ది.2021 జూన్‌ 23న పెనమలూరు పోలీసులు అరెస్ట్ చేశారు. పోరంకి గ్రామానికి చెందిన వేల్పూరి ప్రభుకుమార్, సుంకర గోపి రాజు, తాడిగడప, కార్మిక నగర్ కట్టకు చెందిన పొనమాల చక్రవర్తి అలియాస్ చక్రి, మోరం నాగ దుర్గారావు అలియాస్ చంటిలు ఆటో డ్రైవర్లుగా పనిచేస్తున్నారు.ఒకే ప్రాంతం వారు కావడంతో వీరి మధ్య స్నేహం ఏర్పడింది. వీరితో పాటు కామయ్యతోపుకు చెందిన మద్ది ఫణీంద్రకుమార్ పెయింటింగ్ పనులు చేస్తుంటాడు.

ఏటిఎం చోరీ కేసులో విచారిస్తుండగా నిందితులు గతంలో చేసిన హత్యలు వెలుగులోకి వచ్చాయి. 2020-21 మధ్య కాలంలో విజయవాడ శివార్లలో ఐదుగురు మహిళల్ని హత్య చేసినట్లు గుర్తించారు. పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిదిలో పోరంకి విష్ణుపురం కాలని, తాడిగడప కార్మికనగర్ కట్ట, పోరంకి తూముల సెంటర్ మరియు కోదండ రామాలయం సెంటర్ లలో జరిగిన నలుగురు వృద్ధ మహిళలను హత్య చేసినట్లు గుర్తించారు. కంచిచిచర్లలో మరో జంటను హతమార్చారు. నిందితు వద్ద సుమారు 10 లక్షల విలువైన 384 గ్రాముల బంగారు ఆభరణాలను ఒక ఆటో మరియు బైక్ ను రికవరీ చేశారు.

పోలీసుల విచారణలో నిందితులు వృద్ధులైన మహిళలు ఒంటరిగా నివాసముండే ఇళ్ళను గుర్తించి లక్ష్యంగా చేసుకున్నట్లు నిర్ధారణైంది. విజయవాడ నగరంలోని కంకిపాడుతో పాటు ఉయ్యూరులో, పెనమలూరులో, తెనాలి మరియు మంగళగిరిలో నేరాలు చేయడానికి రెక్కీ నిర్వహించారు. నిందితులను అరెస్ట్ చేయడంతో వరుస హత్యలకు బ్రేక్ పడింది. 2021 నవంబర్‌లో నిందితులపై ఛార్జిషీట్ వేశారు. నిందితులపై నేరం ఋజువు కావడంతో ఐదుగురు నిందితులకు జీవితకాలం కఠినకారాగార శిక్షా మరియు ఒకొక్కరికి రూ.1,300/- జరిమానా విధించారు.

లాక్‌డౌన్‌ నేరాలకు కలిసొచ్చింది….

లాక్‌డౌన్‌ సమయంలో నిందితులకు కలిసొచ్చింది. హత్యలు చేసినా ఎవరు గుర్తించరనే నమ్మకం కలిగింది. వీధులు నిర్మానుష్యంగా ఉండటం, ఊపిరాడకుండా చేసి చంపేసినా కోవిడ్‌ కారణంగా చనిపోయి ఉంటారనే నమ్మకంతో హత్యలు మొదలు పెట్టారు.

2021జూన్‌ 11న పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధి పోరంకి సెంటర్లో ఉన్న ఒక బ్యాంక్ ఏ.టి.ఎం.లోకి కొందరు నిందితులు ప్రవేశించి ఏ.టి.ఎం. పగులగొట్టి నగదు దొంగిలించేందుకు ప్రయత్నం చేసి విఫలమయ్యారు. ఈ ఘటనపై పెనమలూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఏ.టి.ఎం. లోని సి.సి.టివి ఫుటేజ్ ద్వారా ఇద్దరు వ్యక్తులు ముఖానికి ప్లాస్టిక్ కవర్ ముసుగుగా వేసుకొని వచ్చినట్లు గుర్తించి, ఆ సి.సి. టివి ఫుటేజ్ ఆధారంగా పాతనేరస్థులను, ఆటో డ్రైవర్లను మరియు పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని తాడిగడప నందు ఒక ఇంటిలో దొంగతనం కేసు గురించి విచారిస్తున్న సమయంలో హత్యలు వెలుగు చూశాయి.

ఐదుగురు నిందితుల్లో నలుగురు ఆటో డ్రైవర్లుగా పని చేయడం, సమీప ప్రాంతాల్లో నివాసం ఉండటం వలన వీరి మధ్య పరిచయాలు ఏర్పడ్డాయి. చెడు వ్యసనాలకు బానిసలైన ఐదుగురు నిందితులు తరచుగా కలుసుకుని మాట్లాడుకునే సమయంలో నేరాలు చేయడం ద్వారా సులభంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ఒంటరిగా ఉంటున్న వృద్ధులను హత్య చేస్తే ఎవరికి అనుమానంరాదని మరియు కరోనా సమయంలో చనిపోయిన వారిని సహజమరణంగా భావించి త్వరగా ఖననం చేస్తారనే ఉద్దేశ్యంతో వృద్ధులను టార్గెట్ చేసుకుని ఈ తరహా నేరాలకు పాల్పడ్డారని పోలీసులు చెబుతున్నారు. .

అనుకున్నదే తడవుగా పైన తెలిపిన నిందితులు ఆటోలో కూరగాయలు అమ్ముకునే వారిలాగా తిరుగుతూ ఇళ్ళలో ఒంటరిగా ఉంటున్న వృద్ధ మహిళలను గుర్తించి వారిపై రెక్కి నిర్వహించి ఆ ఇంటికి ఎవ్వరు రాని సమయంలో లోనికి ప్రవేశించి వృద్ధ మహిళను చంపి బంగారు నగలను దోచుకునేవారు.

వరుస హత్యలు చేశారిలా…..

2020వ అక్టోబర్ నెలలో పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధి, పోరంకి గ్రామం విష్ణుపురం కాలనీలో ఒంటరిగా నివాసం ఉండే సళిని అనే మహిళను చంపేశారు.2020వ నవంబర్ నెలలో పోరంకి గ్రామంలో తూముల సెంటర్ వద్ద సమీపంలో నివాసం ఉండే సీతా మహాలక్ష్మిని, 2021 జనవరి నెలలో తాడిగడప, కార్మికనగర్ కట్ట వద్ద ఒంటరిగా నివాసం ఉంటున్న తాళ్ళూరు ధనలక్ష్మిని, 2021 జూన్ నెలలో పోరంకి గ్రామం, పాత పోస్టాఫీసు సమీపంలో ఒంటరిగా నివాసం ఉంటున్న పాపమ్మ మహిళలను హత్య చేసి, ఆభరణాలను దొంగిలించారు. మృతుల కుటుంబ సభ్యులు చనిపోయిన వారిపై ఎటువంటి గాయాలు లేకపోవడంతో సహజమరణాలుగా భావించి పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.

2020వ డిసెంబర్ నెలలో కృష్ణా జిల్లా, కంచికచర్లలో అర్ధరాత్రి. సమయంలో ఒక ఇంట్లోకి ప్రవేశించి ఇంట్లో నిద్రపోతున్న వృద్ధ దంపతులు నాగేశ్వరరావు, ప్రమీలారాణిలను హత్య చేసి, వారి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు దొంగిలించారు. ఇందుకు సంబంధించి కంచికచర్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. 2021మార్చి నెలలో తాడిగడప, కార్మికనగర్ లో నివాసం ఉండే మల్లేశ్వరరావు అనే వ్యక్తి ఇంట్లోకి అర్ధరాత్రి సమయంలో ప్రవేశించి, ఇంట్లో బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలు మరియు సెల్ఫోన్ దొంగిలించారు. దీనిపై పెనమలూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

తదుపరి వ్యాసం