తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Visakha Railway Zone: ఫిబ్రవరిలో విశాఖ రైల్వే జోన్‌కు శంకుస్థాపన.. ఎంపీ సత్యవతి

Visakha Railway Zone: ఫిబ్రవరిలో విశాఖ రైల్వే జోన్‌కు శంకుస్థాపన.. ఎంపీ సత్యవతి

Sarath chandra.B HT Telugu

23 January 2024, 9:49 IST

google News
    • Visakha Railway Zone: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న విశాఖ రైల్వే జోన్‌కు ఫిబ్రవరిలో శంకుస్థాపన జరుగనున్నట్లు ఎంపీ సత్యవతి వెల్లడించారు. 
ఎంపీ సత్యవతి
ఎంపీ సత్యవతి

ఎంపీ సత్యవతి

Visakha Railway Zone: దాదాపు పదేళ్లుగా ఎదురు చూస్తున్న విశాఖ రైల్వే జోన్‌కు త్వరలో శంకు స్థాపన జరుగనుంది. విశాఖపట్నం కేంద్రంగా సౌత్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిందని అనకాపల్లి ఎంపీ బీవీ సత్యవతి చెప్పారు.

ఫిబ్రవరి మొదటి వారంలో రైల్వే జోన్‌ నిర్మాణానికి భూమిపూజ చేయనున్నట్లు ఎంపీ సత్యవతి వివరించారు. కేంద్ర ప్రభుత్వం సౌత్‌ కోస్ట్‌ రైల్వేజోన్‌ నిర్మాణానికి రూ.170 కోట్లు కేటాయించిందని, భూమిపూజకు రూ.10 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. వడ్లపూడిలో రైల్వేస్థలం 100 ఎకరాలు ఉండగా, జీవీఎంసీ పరిధిలోని ముడసర్లోవలో 52 ఎకరాల స్థలాన్ని కూడా రైల్వే అధికారులకు అప్పగించినట్లు వివరించారు.

ఇప్పటికే సౌత్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌కు ఓఎస్‌డీ స్థాయి అధికారిని కేంద్ర ప్రభుత్వం విశాఖలో నియమించిందని పేర్కొన్నారు. ప్రజల అభీష్టాన్ని, రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాన్ని గౌరవించి విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గిందని చెప్పారు.

విభజన చట్టంలోని అంశాలను కేంద్ర ప్రభుత్వం దశలవారీగా అమలు చేస్తోందని చెప్పారు. 'ప్రత్యేక హోదా వద్దు ప్రత్యేక ప్యాకేజీ ముద్దు..' అని ప్రకటించిన చంద్రబాబు గతాన్ని మరిచిపోయినా... జనం ఇంకా గుర్తుంచుకున్నారని ఆమె అన్నారు.

రాజశేఖరరెడ్డి గోదావరి జలాలను ఇచ్ఛాపురం వరకూ అందించాలని పోలవరం ప్రాజెక్టును చేపడితే చంద్రబాబు నాయుడు అడ్డుకున్న రోజులను గుర్తెరగాలని పేర్కొన్నారు. ప్రాజెక్టును పూర్తిచేయాలంటే సుమారు రూ.56 వేల కోట్లు ఖర్చవుతుందని, ఈ విషయంపై కేంద్ర జలవనరుల శాఖమంత్రితో చర్చించామని ఎంపీ సత్యవతి చెప్పారు.

అనకాపల్లి జిల్లా కశింకోట మండలం తాళ్లపాలెం నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులు భూసేకరణలో ఇబ్బందుల కారణంగా ముందుకు సాగలేదని, చోడవరం మండలంలో ఒక గ్రామ ప్రజలు సహకరించకపోవడంతో పనుల్లో జాప్యం జరిగిందన్నారు.

ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ, ఇతర నేతలు గత ఐదేళ్లలో ఏనాడూ కేంద్ర మంత్రులను కలవేలదని సత్యవతి ఆరోపించారు.

తదుపరి వ్యాసం