Auto gift: ఆమె అభిమానానికి ఆటో బహుమానం, పిఠాపురంలో పవన్ గెలుపుతో మాట నిలబెట్టుకున్న సినీ నిర్మాత
12 July 2024, 8:33 IST
- Auto gift: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో ఓ వృద్ధురాలు చేసిన వ్యాఖ్యలు ఎన్నికలకు ముందు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పవన్ గెలిస్తే తనకున్న రిక్షా అమ్మేసి పార్టీ ఇస్తానన్న మాటలు వైరల్ అయ్యాయి.
మరియమ్మకు ఆటో కానుకగా ఇచ్చిన సినీ నిర్మాత శ్రీనివాస కుమార్
Auto gift: 'పిఠాపురంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విజయం సాధిస్తే తన భర్త తొక్కే రిక్షాను అమ్మేసైనా సరే ఊరంతా పార్టీ చేస్తానని..' వృద్ధురాలు ఉత్సాహంగా చెప్పింది. పవన్ కల్యాణ్ తన కుమారుడని, ఎమ్మెల్యేగా గెలిస్తే తన భర్త తొక్కే రిక్షా అమ్మేసి ఊళ్లో అందరికి విందు ఇస్తానని కాకినాడ జిల్లా పిఠాపురం మండలం జగ్గయ్యచెరువుకు చెందిన మరియమ్మ ఎన్నికల ముందు యూట్యూబర్లతో చెప్పారు.
పవన్ మీద ఉన్న అభిమానాన్ని ఉద్వేగంతో, అభిమానంగా ఆమె మాటలు ఎన్నికలకు ముందు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరియమ్మ అభిమానం జనసేన కార్యకర్తల్లో ఉత్సాహం నింపింది. నిరుపేద కుటుంబానికి చెందిన మరియమ్మ అభిమానానికి కదిలిపోయిన ఆ పార్టీ నాయకులు అప్పట్లో నిత్యావసర వస్తువులు, నగదు సాయం చేశారు. ఆమె మాట ప్రకారం పవన్ గెలిస్తే మరింత సాయం చేస్తామనిమాట ఇచ్చారు.
సినీ నిర్మాత శ్రీనివాస్ కుమార్ గురువారం పిఠాపురం వచ్చి మరియమ్మకు ఆటోను బహుమతిగా ఇచ్చారు. స్థానిక జనసైనికుల సమక్షంలో ఆటో తాళాలను ఆమెకు అందించారు. ఆ తర్వాత మరియమ్మను ఆటోలో ఎక్కించుకుని కొంతదూరం ప్రయాణించారు. మరియమ్మ దంపతులు సంతోషంగా ఉండాలని ఆకాం క్షించారు.
ఎన్నికలకు ముందు మరియమ్మ అభిమానంతో చెప్పిన మాటలు చూసి పవన్ గెలిస్తే ఆటో కొనిస్తానని చెప్పానని, అన్నమాట ప్రకారం వారికి ఆటో అందించినట్టు చెప్పారు.