YS Sharmila On MLC Kavitha Strike: మహిళలకు 33 శాతం సీట్లు మీరెందుకు ఇవ్వలేదు?
YS Sharmila Slams MLC Kavitha: ఢిల్లీ వేదికగా ఎమ్మెల్సీ కవిత తలపెట్టిన దీక్షపై విమర్శలు గుప్పించారు వైఎస్ షర్మిల. దీక్ష చేయాల్సింది ఢిల్లీలో కాదని... ప్రగతి భవన్ ముందు అంటూ హితవు పలికారు.
YS Sharmila On MLC Kavitha Strike: మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దీక్షను చేపట్టనున్నారు. ఢిల్లీ వేదికగా మార్చి 10వ తేదీన నిరాహార దీక్షను చేపట్టనున్నట్లు ప్రకటించారు. అయితే కవిత దీక్షపై ట్విట్టర్ వేదికగా స్పందించారు వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల. దీక్ష చేయాల్సింది ఢిల్లీలో కాదు.. ప్రగతిభవన్ ముందు.. ఫామ్ హౌజ్ ముందు అంటూ హితవు పలికారు. బతుకమ్మ ఆడుతూ లిక్కర్ స్కామ్ కు పాల్పడిన మీరు.. మహిళలకే తలవంపు తెచ్చారంటూ కవితను టార్గెట్ చేశారు. ఇప్పుడు ఆ స్కాంను పక్కదారి పట్టించేందుకే ఈ కొత్త డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు.
"లిక్కర్ స్కామ్ ను పక్కదారి పట్టించేందుకు ముఖ్యమంత్రి బిడ్డ మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అంటూ కొత్తరాగం అందుకోవడం విడ్డూరం. బంగారం పోయిందని దొంగలే ధర్నా చేసినట్టుంది. రెండు సార్లు అధికారంలోకి వచ్చిన మీరు, మహిళలకు 33 శాతం సీట్లు ఎందుకు కేటాయించలేదు..? 2014 ఎన్నికల్లో మహిళలకు ఇచ్చింది 6 సీట్లు అంటే 5.88 శాతం మాత్రమే. ఇదేనా మహిళలకు మీరిచ్చే గౌరవం..? 2018లో మహిళలకు 4 సీట్లు అంటే 3.36 శాతం మాత్రమే.. ఇదేనా మహిళలకు మీరిచ్చే మర్యాదా? శాసనమండలిలో 34 సీట్లకు మహిళలకు మూడు సీట్లు.. అంటే 8.82 శాతం. ఇదేనా మహిళల పట్ల మీకున్న చిత్తశుద్ధి...? 17 పార్లమెంట్ స్థానాలకు మహిళలకు రెండు సీట్లు.. అంటే 11.76%.. ఇదేనా మహిళలపై మీకున్న ప్రేమ..?" అని షర్మిల ప్రశ్నించారు.
తెలంగాణ తొలి క్యాబినెట్ లో మహిళలకు చోటు లేదని.... ఇప్పుడున్న క్యాబినెట్ లో పట్టుమని ఇద్దరు మంత్రులు మాత్రమే ఉన్నారని విమర్శించారు. ఇదేనా మహిళలపై మీకున్న మక్కువ? మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయడంలో మీ తండ్రి గారికి వచ్చిన అడ్డంకి ఏంటి? అంటూ కవితను వైఎస్ షర్మిల నిలదీశారు.
సంబంధిత కథనం