Sai Pallavi Warning: సాయి పల్లవి మాస్ వార్నింగ్.. రామాయణం కోసం తాను వెజిటేరియన్‌గా మారానన్న వార్తపై సీరియస్
Sai Pallavi Warning: సాయి పల్లవి మాస్ వార్నింగ్ ఇచ్చింది. రామాయణం మూవీ కోసం తాను వెజిటేరియన్ గా మారానన్న వార్తలపై ఆమె చాలా ఘాటుగా స్పందించింది. ఇలాగే పుకార్లు పుట్టిస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటానంటూ తన ఎక్స్ అకౌంట్ ద్వారా హెచ్చరించింది.
Sai Pallavi Warning: సాయి పల్లవి ప్రస్తుతం బాలీవుడ్ లో రణ్‌బీర్ కపూర్ తో కలిసి రామాయణ మూవీ చేస్తున్న విషయం తెలుసు కదా. అయితే ఈ సినిమా చేస్తున్న కారణంగా ఆమె వెజిటేరియన్ గా మారిందంటూ ఓ పోర్టల్ న్యూస్ రాసింది. దీనిపై తాజాగా తన ఎక్స్ అకౌంట్ ద్వారా సాయి పల్లవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోసారి ఇలా రాస్తే చట్టపరమైన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చింది.
సాయి పల్లవి వార్నింగ్
తమిళ న్యూస్ వెబ్ సైట్ పోర్టల్ వికటన్ ప్లస్ లో వచ్చిన వార్తను షేర్ చేస్తూ సాయి పల్లవి బుధవారం (డిసెంబర్ 11) రాత్రి ఓ ట్వీట్ చేసింది. ఆ వార్తలో తాను రామాయణం మూవీ కోసం వెజిటేరియన్ గా మారినట్లు ఉంది. ఈ మూవీలో సీతగా నటిస్తుండటంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా రాసుకొచ్చారు. దీనిపై సాయి పల్లవి చాలా తీవ్రంగా స్పందిస్తూ ఓ పెద్ద పోస్టు చేసింది.
"చాలాసార్లు, నిజానికి ప్రతిసారీ నాపై నిరాధార పుకార్లు, తప్పుడు ప్రకటనలు, అబద్ధాలను రాసినా సైలెంట్ గా ఉంటూ వస్తున్నాను. కానీ ఇక ఉపేక్షించను. ఎందుకంటే ఇది మళ్లీ మళ్లీ జరుగుతూనే ఉంది. అసలు ఆగేలా లేదు. ముఖ్యంగా నా సినిమా రిలీజ్, అనౌన్స్‌మెంట్ అయ్యే సమయాల్లో, నా కెరీర్లో ఆనందంగా సెలబ్రేట్ చేసుకునే క్షణాల్లో ఇలాంటివి వస్తున్నాయి. ఇక నుంచి ఏదైనా పేరున్న మీడియా లేదా వ్యక్తుల నుంచి ఇలాంటి చెత్త స్టోరీలు వార్తలు లేదా పుకార్ల రూపంలో వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాను" అని సాయి పల్లవి హెచ్చరించింది.
సాయి పల్లవి ఎప్పుడూ వెజిటేరియనే..
తమిళ న్యూస్ పోర్టల్ తన గురించి తప్పుడు వార్త రాయడంతో సాయి పల్లవి తీవ్రంగా స్పందించింది. తాను రామాయణ సినిమా కోసమే వెజిటేరియన్ గా మారానని అనడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేసింది. నిజానికి సాయి పల్లవి ఎప్పుడూ వెజిటేరియనే. ఈ విషయాన్ని ఆమె గతంలోనూ పలుమార్లు చెప్పింది. అంతేకాదు తాను ఎక్కడికి వెళ్లినే తనకు కేవలం శాకాహార వంటకాలే చేసేందుకు ప్రత్యేకంగా వంటవాళ్లు కూడా ఉంటారని ఆమె తెలిపింది. తానో ప్రాణం పోతుంటే చూడలేనని, అందుకే ఎప్పుడూ వెజిటేరియన్ గానే ఉంటానని సాయి పల్లవి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
ఇక సాయి పల్లవి సినిమాల విషయానికి వస్తే ఆమె రామయణ మూవీతోపాటు తెలుగులో నాగ చైతన్యతో కలిసి తండేల్ సినిమాలోనూ నటిస్తున్న విషయం తెలిసిందే. లవ్ స్టోరీ తర్వాత ఈ ఇద్దరూ కలిసి నటిస్తున్న రెండో సినిమా ఇది. ఈ మధ్యే ఆమె అమరన్ మూవీలో శివకార్తికేయన్ తో కలిసి నటించింది. ఈ సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.