MLC Kavitha Hunger Strike: ఢిల్లీ వేదికగా కవిత నిరాహార దీక్ష.. అజెండా ఇదే
Bharat Jagruthi strike at delhi: ఢిల్లీ వేదికగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దీక్ష చేయనున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ ముందుకు తీసుకురావాలన్న డిమాండ్ తో దీక్షను చేపట్టేందుకు సిద్ధమయ్యారు.
MLC Kavitha Strike at Delhi: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జాతీయ స్థాయిలో పోరాటానికి సిద్ధమయ్యారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై నిరాహార దీక్ష చేయనున్నారు. ఇందుకోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ ను వేదికగా నిర్ణయించారు. ఈ మేరక గురువారం పోస్టర్ ను ఆవిష్కరించారు. మహిళా దినోత్సవం పురస్కరించుకొని మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ ముందుకు తీసుకురావాలని డిమాండ్ తో ఈ దీక్షను చేపట్టనున్నట్లు కవిత ప్రకటించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత... కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో రెండు సార్లు హామీ ఇచ్చింది గుర్తు చేశారు. రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి మాట తప్పుతుందని మండిపడ్డారు. ఇందుకు నిరసనగా భారత జాగృతి ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఈ నెల 10వ తేదీన ఒకరోజు నిరాహార దీక్ష చేయనున్నట్లు తెలిపారు. మార్చి 13 నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయని... ఈ సమావేశాల్లోనే మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ బిల్లు 2010లోనే సభ ముందుకు రాగా... పలు పార్టీలు వ్యతిరేకించాయని చెప్పారు. ఆయా పార్టీలు ప్రస్తావిస్తున్న అంశాలపై కూడా చర్చించి... బిల్లును సభ ముందుకు తీసుకురావాలని అన్నారు.
"మార్చి 8(మహిళా దినోత్సవం)న ఈ దీక్ష చేపట్టాలని అనుకున్నాం. కానీ ఆరోజు హోలీ రావటంతో 10వ తేదీన దీక్ష చేపట్టాలని నిర్ణయించారు. మార్చి 13న పార్లమెంట్ సమావేశాలు మొదలుకానున్నాయి. ఈ సమావేశంలోనే మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ ముందుకు తీసుకోరావాలి. 2014లో, 2019 ఎన్నికల మెనిఫెస్టోలో మహిళలకు రిజర్వేషన్లు తీసుకువస్తామని బీజేపీ చెప్పింది. కానీ మాట తప్పింది. జనాభా గణన చేపట్టకపోవడం దురదృష్టకరం. ఓసీపీ గణాంకాలను కూడా ఇవ్వాలి. జనాభా దామాషా ప్రకారం కోటా రావాలి. జనగణన జరిగి తీరాల్సిందే. జన గణన చేయకపోవటం చాలా దుర్మార్గం. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు నిరాహరా దీక్ష చేపడుతాం. అప్పటివరకు మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు. శాంతియతంగా ఈ దీక్ష చేపడుతాం. భారీ ఎత్తున మహిళలు పాల్గొంటారు." అని కవిత స్పష్టం చేశారు.
ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై స్పందించిన కవిత... బీజేపీని టార్గెట్ చేశారు. మోదీ వైఫల్యాలను ప్రశ్నిస్తే విచారణ ఏజెన్సీలతో భయపెడుతున్నారని మండిపడ్డారు. ఇష్యూను డైవర్ట్ చేయడానికి తాము ఆందోళనలు చేయటం లేదన్నారు. విపక్ష నేతలనే టార్గెట్ చేస్తున్నారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. అదానీపై ఎందుకు విచారణ జరిపించటం లేదని ప్రశ్నించారు. సుప్రీం ఆదేశాలతో అదానీపై దర్యాప్తు జరిగే పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు. తనని అరెస్ట్ చేస్తారంటూ బీజేపీ నేతలు మాట్లాడటం... మ్యాచ్ ఫిక్సింగ్ లా ఉందంటూ కామెంట్స్ చేశారు.