Avanti Srinivas Resignation: మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, భీమిలీ నియోజక వర్గం బాధ్యతలకు రాజీనామా చేశారు. గత కొంత కాలంగా పార్టీకి దూరంగా ఉంటున్న ఆవంతి జనసేనలో చేరాలని యోచిస్తున్నట్టు సన్నిహితులు చెబుతున్నారు. 2019-22 మధ్య కాలంలో వైసీపీ ప్రభుత్వంలోఆవంతి శ్రీనివాస్ ఏపీ క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఎంపీగా టీడీపీ తరపున ప్రాతినిధ్యం వహించారు.
ఏపీలో వైసీపీ వ్యవహారిస్తున్న తీరును అవంతి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఓడిన వెంటనే గెలిచిన ప్రభుత్వంపై పోరాటాలు చేయడాన్ని తప్పు పట్టారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, సూపర్ సిక్స్ అమలు చేశారో లేదో ఐదేళ్ల తర్వాత నిర్ణయిస్తారన్నారు.
గతంలో రాజశేఖర్ రెడ్డి కూడా ఎన్నికల హామీలపై ప్రజలకిచ్చిన హామీలను ఐదేళ్లలో నెరవేర్చామా లేదా అన్నది ప్రజలు నిర్ణయిస్తారన్నారని గుర్తు చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి ఐదేళ్లు సమయం ఇచ్చారని, ఐదు నెలలు కూడా సమయం ఇవ్వకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు, రాస్తారోకోలు చేయాలనడం సరికాదన్నారు.
స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. తెలంగాణలో పదేళ్లు కేసీఆర్ సారథ్యంలో స్థిరమైన ప్రభుత్వం ఉండటం వల్ల ఆ రాష్ట్రం అభివృద్ధి చెందిందని అన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో దూసుకుపోతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందలేకపోయిందన్నారు.
రాజకీయాల కోసం ప్రతి విషయంలో ప్రయోజనాల కోసం పాకులాడటం నచ్చలేదన్నారు. తనకు వ్యక్తిగత సమస్యలు కూడా ఉన్నందున వ్యక్తిగత కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. రాజీనామా లేఖను వైసీపీ అధ్యక్షుడు జగన్‌తో పాటు, విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు, ఉత్తరాంధ్ర వ్యవహారాల ఇన్‌ఛార్జికి పంపారు.
ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి కనీసం ఏడాది సమయం ఇస్తే బాగుండేదని అవంతి అభిప్రాయపడ్డారు. ఎన్నికల తర్వాత కూడా పార్టీ నాయకత్వంలో మార్పు రాలేదని, ఏదో ఆశించి రాజకీయాల్లోకి రాలేదని, ఎక్కడ గౌరవం ఉంటే ఆ పార్టీలోకి వెళ్తానని చెప్పారు. పార్టీలో నాయకుడి వల్ల కార్యకర్తలు, నాయకులు ఉన్నారని అనుకుంటారని, నాయకులు, కార్యకర్తలు కూడా ముఖ్యమని, అధికారంలో ఉన్నా పార్టీ కార్యకర్తలు, నాయకులు అనేక ఇబ్బందులు పడ్డారన్నారు. లోటు పాట్లు సవరించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించారని అవంతి ఆరోపించారు.