Inter Caste Marriages: ఏపీలో కొత్త సమస్య.. ఆ కులాల్లో ఆడపిల్లల కొరత, కులాంతరమైనా ఫర్లేదంటున్న అబ్బాయిలు…-ap faces new crisis shortage of girls in certain castes parents willing to consider inter caste marriages ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Inter Caste Marriages: ఏపీలో కొత్త సమస్య.. ఆ కులాల్లో ఆడపిల్లల కొరత, కులాంతరమైనా ఫర్లేదంటున్న అబ్బాయిలు…

Inter Caste Marriages: ఏపీలో కొత్త సమస్య.. ఆ కులాల్లో ఆడపిల్లల కొరత, కులాంతరమైనా ఫర్లేదంటున్న అబ్బాయిలు…

Bolleddu Sarath Chandra HT Telugu
Dec 12, 2024 06:33 AM IST

Inter Caste Marriages: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ట్రెండ్‌ మొదలైంది. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందిన కొన్ని కులాలు తీవ్రమైన ఆడపిల్లల కొరత ఎదుర్కొంటున్నాయి. దీంతో సొంత కులంలో మగపిల్లలకు పెళ్లి కావడం కష్టమైపోతోంది. పల్లెలు, పట్టణాలనే తేడా లేకుండా అన్ని చోట్ల ఇదే సమస్య నెలకొంది.

ఏపీలో కొన్ని కులాల్లో  పెరిగిన ఆడపిల్లల కొరత
ఏపీలో కొన్ని కులాల్లో పెరిగిన ఆడపిల్లల కొరత (PC Pixabay)

Inter Caste Marriages: ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని సామాజిక వర్గాల్లో మగపిల్లలకు పెళ్లిళ్లు కావడమే కష్టమైపోతోంది. మ్యాట్రిమోనీ వెబ్‌సైట్లు, పెళ్లిళ్ల బ్రోకర్లు అడిగినంత చెల్లిస్తున్నా సరైన సంబంధాలు కుదరడం లేదు.అయా కులాల్లో ఆడపిల్లలకు తీవ్రమైన డిమాండ్ నెలకొంది. సామాజిక హోదా, కుటుంబ నేపథ్యం, ఆర్థిక స్థితిగతులు, గుణగణాలను పరిగణలోకి తీసుకుని గతంలో పెళ్లి సంబంధాలు కుదిరేవి. 

ఇప్పుడు ఏ కులమైన ఫర్లేదు అందమైన ఆడపిల్ల దొరికితే చాలనే పరిస్థితి వచ్చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సమస్య ఉంది. ప్రధానంగా రెండు ప్రధాన సామాజిక వర్గాలకు చెందిన యువకులు ఈ ముప్పును ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. తమ సామాజిక వర్గం వారు ఎంత దూరంలో ఉన్నా పెళ్లి చేసుకోడానికి సిద్ధం అవుతున్నారు. 

ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన సామాజిక వర్గాల్లో కమ్మ, రెడ్డి, కాపు, బ్రహ్మణ, క్షత్రియ, వైశ్య కులాలు ముందుంటాయి. వీరిలో ఆర్థికంగా, సామాజికంగా మిగిలిన వారికంటే కమ్మ, రెడ్డి కులాలు బలమైన వర్గాలుగా ముద్రపడ్డాయి. రెండు, మూడు దశాబ్దాలుగా ఈ రెండు కులాల్లో ఒకరిద్దరు సంతానానికి చాలామంది పరిమితం అయ్యారు. ఒక్క సంతానానికి పరిమితం కావడంతో పాటు ఎక్కువమంది మగపిల్లల కోసమే ప్రాధాన్యమిచ్చారు. 

దీంతో అయా కులాల్లో ఆడపిల్లల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఆస్తులను పంచిపెట్టాల్సి వస్తుందనే కారణంతో పెద్ద కుటుంబాల్లో ఏక సంతానం, అది కూడా మగపిల్లలకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వడంతో వారి స్థాయికి తగిన ఆడపిల్లలు లేకుండా పోయారు.

ప్రస్తుతం 30-35ఏళ్ల వయసు దాటిన పురుషుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. చదువుకుని, మంచి ఉద్యోగాలు చేస్తున్నవారు, ఐటీ సెక్టార్‌లో భారీ జీతాలు అందుకుంటున్న వారిలో కూడా 30కు చేరువ అవుతున్నా పెళ్లిళ్లు కావడం లేదు. చదువు లేని వారు, ఉద్యోగాల్లో స్థిరపడకుండా సొంతంగా సంపాదించుకుంటున్న వారికైతే మరీ కష్టమైపోతోంది.

ఆస్తిపాస్తులున్నా పెళ్లి కావట్లేదు..

గ్రామాల్లో ఇళ్లు, పొలాలు, ఆస్తులు, మంచి కుటుంబ నేపథ్యం ఉన్నా సొంత సామాజిక వర్గంలో పెళ్లి సంబంధాలు దొరకడం గగనమైపోతోంది. సొంత వ్యాపారాలు చేసుకుంటున్న వారు, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు చేస్తున్న వారికి కూడా ఈ రకమైన సమస్యను ఎదుర్కొంటున్నారు. పిల్ల దొరికితే చాలు, పెళ్లైతే మన కులమే వస్తుంది కదా అనుకుంటున్నారు. కులాంతర వివాహమైనా ఫర్లేదు, కట్న కానుకలు అక్కర్లేదు, కాస్త చదువుకుని, అందంగా ఉంటే చాలని దిగి వస్తున్నారు. ఇతర కులాల వారైనా సంబంధం కలుపుకోడానికి సై అంటున్నారు.

ఈ తరహా పెళ్లి సంబంధాల కోసం పెద్ద సంఖ్యలో డిమాండ్ ఉందని గుంటూరు జిల్లాలో పెళ్లిళ్ల బ్రోకర్‌గా పనిచేసే మార్కండేయులు చెప్పారు. అగ్రకులాల యువకులు ఇతర కులాల సంబంధాలు, బీసీ కులాల వారితో సంబంధం కలుపుకోడానికి ఏ మాత్రం వెనకాడటం లేదని చెప్పారు. దీనికి ప్రధాన కారణం అయా కులాల్లో ఆడపిల్లలు లేకపోవడంతో పాటు ఇతర కారణాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు.

భవిష్యత్తులో ఎదురు కట్నం ఇవ్వాల్సి ఉంటుందేమో...

ఆడపిల్లల కొరత ఎదుర్కొంటున్న సామాజిక వర్గాల్లో ఆడపిల్లలు ఉన్న ఇళ్లకు బాగా డిమాండ్ ఏర్పడింది. పెళ్లి కుదరాలంటే అమ్మాయి తరపు వారు పెట్టే కండిషన్లకు తలొగ్గుతున్నారు. ఆస్తిపాస్తులు లేకపోయినా ఆడపిల్లను ఇవ్వడమే ఆస్తిగా భావిస్తున్నారు. అమ్మాయి అందంగా ఉండి, ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్ అయితే ఎదురుకట్నం ఇచ్చి పెళ్లి చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. దీంతో ఆడపిల్లల తరపు వారు అన్ని రకాల కండిషన్లకు తలొగ్గుతున్నారు. కట్నం ప్రస్తావనే తీసుకురావడం లేదు.

అమ్మాయి తల్లిదండ్రులు మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వారైతే కట్నం లేకపోవడంతో పాటు, పెళ్లికి అయ్యే ఖర్చు మొత్తం భరించడానికి కూడా అదే సామాజిక వర్గానికి చెందిన పెళ్లి కొడుకు కుటుంబం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఆడపిల్లల తల్లిదండ్రులు ఆస్తిపాస్తులు ఉన్న వారికే ప్రాధాన్యమిస్తున్నారు. ఒకే కులానికి చెందినా వారైనా తమ కుమార్తె భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పెద్దింటికి పంపడానికి ప్రాధాన్యమిస్తున్నారు. దీంతో మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి కుటుంబాలు ఇతర కులాల సంబంధాలను చూడాల్సి వస్తోంది.

ఏపీలో కులాంతర వివాహాల ట్రెండ్‌ ఎప్పటి నుంచో ఉన్నా విధిలేని పరిస్థితుల్లో ఇతర సామాజిక వర్గాల అమ్మాయిలతో సంబంధం కలుపుకోడానికి అగ్రకులాలు సంకోచించడం లేదు. కమ్మ-రెడ్డి, కమ్మ-కాపు, కాపు-రెడ్డి సంబంధాలు సాధారణంగా మారిపోయాయి.బీసీకులాల మధ్య కులాంతర పెళ్లిళ్లు కూడా గణనీయంగా పెరిగాయి. యువతీయువకులు ఉద్యోగాల్లో స్థిరపడిన వారైతే కులానికి ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ప్రేమ వివాహాలకు కూడా యువతీ యువకుల తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పడం లేదు.

కులాల హద్దులు చెరిపేసి….

సామాజికంగా అగ్రకులాలుగా భావించే రెండు మూడు ప్రధాన కులాల్లో ఇటీవల మరో ధోరణి కనిపిస్తోంది. తమ కులంలో అమ్మాయిల కొరత నేపథ్యంలో బీసీ కులాలకు చెందిన వారైనా ఫర్లేదని పెళ్లిళ్ల బ్రోకర్లను ఆశ్రయించే వారి సంఖ్య పెరిగింది. గ్రామాల్లో సామాజిక హోదా ఉన్నా ఉద్యోగాలు చేయకుండా సొంత వ్యాపారాలు చేసేవారు, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన యువకులు 30-35 ఏళ్ల వయసు సమీపిస్తున్న వారు పెళ్లైతే చాలనే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. సమీప భవిష్యత్తులో అసలు ఏ కండిషన్ లేకుండా పెళ్లైతే చాలనుకునే రోజులు కూడా సమీపంలో ఉన్నాయి.ఒక తరం నలభై ఏళ్లకు చేరువైతే పెళ్లిళ్లకు కూడా దాదాపు జనరేషన్ గ్యాప్‌ వచ్చే ప్రమాదం కూడా పొంచి ఉంది.

Whats_app_banner