Bapatla Crime: బాపట్ల జిల్లాలో దారుణం...తల్లి లేని బాలికపై సామూహిక అత్యాచారం
Bapatla Crime: బాపట్ల జిల్లాలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. తల్లి లేని బాలికపై ఒకరి తరువాత ఒకరు ఇద్దరు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి విచారణ జరిపారు. ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై పోక్సో కేసు నమోదు చేశారు.
Bapatla Crime: బాపట్ల జిల్లాలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం కలకలం రేపింది. బాపట్ల జిల్లా కొల్లూరు మండలంలోని ఒక గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత బాలికకు తల్లి లేదు. తండ్రి వద్దనే ఉంటోంది. తనపై ఇద్దరు వ్యక్తులు అఘాయిత్యం చేశారని ఆ బాలిక తండ్రికి చెప్పడానికి భయపడింది. దీంతో ఈ విషయం బయటకు రాలేదు. కొన్ని రోజులుగా బాలిక మానసిక ప్రవర్తనలో మార్పు, అనారోగ్యానికి గురి కావడంతో గమనించిన తండ్రి తమ దగ్గరి బంధువులకు చెప్పాడు. బంధువులు ఆ బాలికను అడగడంతో అసలు విషయం బయట పడింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొల్లూరు మండటంలోని ఒక గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలికకు తల్లి లేదు. తండ్రి సంరక్షణలో ఉంటుంది. తాను ఏదో ఒక పని చేస్తే కాస్తైనా డబ్బులు వస్తాయని, తన అవసరాలకు వేరొకరిపైన ఆధార పడే అవసరం లేదని భావించింది. కుటుంబానికి ఆర్థికంగా సాయంగా ఉంటుందనే ఉద్దేశంతో కొల్లూరు మండల కేంద్రంలోని ఒక బట్టల షాప్‌లో పని చేయడం ప్రారంభించింది.
స్వగ్రామం నుంచి బాలిక రోజూ ఆటోలో కొల్లూరు వచ్చి బట్టల షాప్‌లో పని చేసుకుని, మళ్లీ రాత్రి తిరిగి ఆటోలో ఇంటికి వెళ్తుంది. ఎప్పటి లాగే గత నెల 26న రాత్రి 9 గంటల సమయంలో బాలిక బట్టల షాప్‌లో పని ముగించుకుని, ఇంటికి వెళ్లడానికి ఆటో కోసం వేసి చూస్తున్న సమయంలో ఆవులవారి పాలెం శివారు క్రీస్తులంకకు చెందిన యువకుడు విప్పర్ల ప్రేమ్‌కుమార్ తన ద్విచక్ర వాహనంపై అక్కడికి చేరుకున్నాడు. బాలికకు ప్రేమ్ కుమార్‌కు గతంలోనే తెలుసు. తాను కూడా బాలిక వెళ్లే వైపు వెళ్తున్నానని, ఇంటివద్ద దింపుతానని ఆ బాలికను ప్రేమ్ కుమార్ నమ్మించాడు. దీంతో ఆ బాలిక ద్విచక్ర వాహనం ఎక్కింది. అయితే ప్రేమ్ కుమార్ కొల్లూరు కరకట్ట నుంచి దారి మళ్లించి దిగువున ఉన్న ఇటుక బట్టీల్లోకి తీసుకెళ్లాడు.
రాత్రి సమయం కావడంతో చీకటిలో దారి మళ్లించడాన్ని ఆ బాలిక పసిగట్టలేదు. దీంతో ఇటుక బట్టీల వద్ద బాలికను దింపి బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ బాలిక ఎంత ప్రతిఘటించినా వదలకుండా అత్యాచారం చేశాడు. అంతేకాకుండా తన స్నేహితుడికి ఫోన్ చేసి అక్కడకు పిలిచాడు. ప్రేమ్ కుమార్ ఫోన్‌తో అతని స్నేహితుడు బెజ్జం శ్యామ్ కుమార్‌తో పాటు మరో యువకుడు అక్కడికి వచ్చాడు. శ్యామ్ కుమార్ బాలికను తన ద్విచక్ర వాహనంపై దింపుతానని నమ్మించాడు. దీంతో శ్యామ్ కుమార్‌తో వచ్చిన వేరొక యువకుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
శ్యామ్ కుమార్ కూడా ఆ బాలికను ఇంటి వద్ద దింపలేదు. మరో ఇటుక బట్టీలోకి ద్విచక్రవాహనంపై బాలికను తీసుకెళ్లాడు. అక్కడ బాలికపై అత్యాచారానికి పాల్పడి అనంతరం బాలికను ఇటుక బట్టీల వద్దే వదిలి వెళ్లిపోయాడు. బాలిక కాస్త తేరుకొని ఆ రాత్రి సమయంలో కాలినడకన ఇంటికి చేరుకుంది. తల్లి లేని ఆ బాలిక తనపై జరిగిన అఘాయిత్యాన్ని తండ్రికి చెప్పుకునేందుకు భయపడింది. అయితే బాలిక మానసిక ప్రవర్తన కొద్ది రోజులుగా బాగోకపోవడం, ముభావంగా ఉండటంతో అనారోగ్యానికి గురైంది.
దీన్ని గమనించిన తండ్రి తమ దగ్గరి బంధవులుకు విషయం చెప్పాడు.బంధువులు బాలికను బుజ్జగించి అడగడంతో తనపై జరిగిన అఘాయిత్యాన్ని వివరించింది. దీనివల్ల ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. బుధవారం తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. బుధవారం రేపల్లె డీఎస్పీ ఎ. శ్రీనివాసరావు విచారణ చేపట్టారు.
నిందితులు విప్పర్ల ప్రేమ్‌కుమార్, బెజ్జం శ్యామ్‌కుమార్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అత్యాచారం జరిగిన ప్రాంతాన్ని వేమూరు సీఐ రామాంజనేయులు, కొల్లూరు ఎస్ఐ జి. ఏడుకొండలు పరిశీలించారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని బాలిక కుటుంబ సభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)