Konda Surekha: వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంటున్నా.. అనుకోకుండా జరిగిపోయిందన్న సురేఖ
Konda Surekha: కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడంతో మంత్రి కొండా సురేఖ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు. మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ మీ మనోభావాలను దెబ్బతీయడం కాదని వివరణ ఇచ్చారు.
Konda Surekha: సినీ నటి సమంత-నాగ చైతన్య విడాకుల వ్యవహారంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో సోషల్ మీడియా వేదికగా ఆమె వివరణ ఇచ్చారు. “ నా వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ మీ @Samanthaprabhu2 మనోభావాలను దెబ్బతీయడం కాదు” అంటూ కొండా సురేఖ వివరణ ఇచ్చారు.
"స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు కేవలం అభిమానం మాత్రమే కాదు.. ఆదర్శం కూడా..
నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ, మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లైతే బేషరతుగా నా వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాను.. అన్యద భావించవద్దు." అని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
కేటీఆర్ చేస్తున్న ఆరోపణల్ని విమర్శించే క్రమంలో అనుకోకుండా తాను మరో కుటుంబాన్ని బాధించానని, ఇది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని కొండా సురేఖ వివరణ ఇచ్చారు. తాను చేసిన వ్యాఖ్యలు వారిని బాధించాయని తెలిసిన వెంటనే వాటిని ఉపసంహరించుకున్నానని కొండా సురేఖ చెప్పారు. ఈ వివాదంలో సంబంధం లేని కుటుంబాన్ని బాధించినందుకు విచారం వ్యక్తం చేశారు. కేటీఆర్ మీద తన వైఖరిలో మార్పు లేదని, ఆయన వ్యవహారాన్ని న్యాయపరంగా తేల్చుకుంటానని చెప్పారు.
నాగచైతన్య, సమంత విడిపోవడానికి కేటీఆర్ కారణమని మంత్రి కొండా సురేఖ బుధవారం ఆరోపించారు. చాలా మంది హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకొని విడిపోవడానికి కూడా కేటీఆర్ కారణమని సంచలన ఆరోపణలు చేశారు.
బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మంత్రిని సన్మానిస్తున్న సమయంలో తీసిన చిత్రాలతో అసభ్య ప్రచారం చేయడంపై స్పందించే క్రమంలో కొండా సురేఖ చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మూడు సోషల్ మీడియా అకౌంట్లు దుబాయ్ నుంచి ఆపరేషన్స్ జరుగుతున్నాయని అన్నారు. తనపై అసభ్యకరమైన పోస్టులు పోస్టులు పెడితే కనీసం ఖండించకుండా... ఇష్టానుసారంగా కేటీఆర్ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న కేటీఆర్… పోస్టులు పెట్టిన వారిని పార్టీ నుంచి బహిష్కరించకుండా... వెనకేసుకొచ్చేలా మాట్లాడతున్నారని అన్నారు. పోస్టుల వ్యవహారంపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు.
"కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు ఎంతో మంది హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నాడు. డ్రగ్స్ కేసుల్లో ఇరికించి ఇబ్బందులు పెట్టాడు. నాగచైతన్య - సమంత విడిపోవడానికి కారణం కేటీఆర్. చాలా మంది హీరోయిన్లు సినిమా ఫీల్డ్ నుంచి బయటికి వెళ్లడానికి కూడా కారణం కేటీఆర్. ఈ విషయం అందరికి తెలుసు" అని కొండా సురేఖ వ్యాఖ్యానించారు.
మహిళనైన తనపై అసభ్యకర పోస్టులు పెట్టడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని బీఆర్ఎస్ పార్టీకి చెందిన హరీశ్ రావు కనీసం ఖండించారని గుర్తు చేశారు. కానీ కేటీఆర్ మాత్రం సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. గతంలో మేయర్ విజయలక్ష్మీ, మంత్రి సీతక్కపై కూడా అసభ్యకరమైన పోస్టులు పెట్టారని గుర్తు చేశారు. ఈ పోస్టుల వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కొండా సురేఖ అభిప్రాయపడ్డారు.
నాగార్జున కుటుంబం అభ్యంతరం….
కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సినీ పరిశ్రమ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. "మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్థులని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి. బాధ్యత గలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవలిసిందిగా కోరుతున్నాను" - అని హీరో నాగార్జున ట్వీట్ చేశారు.
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తీవ్రంగా స్పందించారు. "ఏంటీ సిగ్గులేని రాజకీయాలు… సినిమాల్లో నటించే ఆడవాళ్లంటే అంత చిన్న చూపా?" అంటూ ట్వీట్ చేశారు.
విడాకులు వ్యక్తిగతం..
"నా విడాకులు వ్యక్తిగత విషయం, దాని గురించి ఊహాగానాలు చేయడం మానుకోవాలని నేను అభ్యర్థిస్తున్నాను. స్త్రీగా ఉండటానికి, బయటకు వచ్చి నిలబడి పోరాడటానికి....చాలా ధైర్యం, బలం కావాలి. ఈ ప్రయాణం నన్ను మార్చినందుకు గర్వపడుతున్నాను. దయచేసి చిన్నచూపు చూడకండి. ఒక మంత్రిగా మీ మాటలకు వాల్యూ ఉందని మీరు గ్రహించారని ఆశిస్తున్నాను. వ్యక్తుల వ్యక్తిగత విషయాల పట్ల మాట్లాడేటప్పుడు బాధ్యతగా, గౌరవంగా ఉండాలని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. నా విడాకులు పరస్పర అంగీకారం, సామరస్యపూర్వకంగా జరిగాయి. ఎటువంటి రాజకీయ కుట్ర ప్రమేయం లేదు. దయచేసి నా పేరును రాజకీయ పోరాటాలకు దూరంగా ఉంచగలరా? నేను ఎప్పుడూ రాజకీయాలకు అతీతంగా ఉంటాను. అలానే ఉండాలని కోరుకుంటున్నాను" అని హీరోయిన్ సమంత సామాజిక మాధ్యమంలో పోస్టు పెట్టారు.
లీగల్ నోటీసులు పంపిన కేటీఆర్…
మరోవైపు మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. కేవలం రాజకీయ కక్షతో, రాజకీయ ప్రయోజనాల కోసం తన పేరును వాడుకుంటున్నారన్నారు. ఒక మహిళ అయి ఉండి ఇంకొక మహిళ పేరును, సినిమా నటుల పేరును వాడుకొని వారి వ్యక్తిత్వ హననానికి పాల్పడడం దురదృష్టకరం అన్నారు. అసలు తనకు సంబంధమే లేని ఫోన్ ట్యాపింగ్, ఇతర అంశాల పైన కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు అసత్యపూరితమని కేటీఆర్ లీగల్ నోటీసులో పేర్కొన్నారు.
ఒక మంత్రిగా కొండా సురేఖ తన మంత్రి హోదాను దుర్వినియోగం చేశారని కేటీఆర్ ఆరోపించారు. ఎలాంటి సాక్ష్యాలు లేకుండా కొండా సురేఖ చేసిన అసత్య పూరిత వ్యాఖ్యలు, దురుద్దేశ పూరిత మాటలు మీడియా, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అయ్యాయన్నారు. ఎలాంటి సాక్ష్యాదారాలు చూపించకుండా మాట్లాడిన కొండా సురేఖ ఒక మంత్రి అని, ఆమె చేసిన వ్యాఖ్యలను సాధారణ ప్రజలు నిజాలుగా భ్రమపడే అవకాశం ఉందని కేటీఆర్ పంపిన లీగల్ నోటీసులు అన్నారు. ఒక మంత్రిగా తన సహచర అసెంబ్లీ సభ్యుడు అని సోయి కూడా లేకుండా కొండా సురేఖ మాట్లాడడం ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో కూడా కొండా సురేఖ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తమైంది.
జూనియర్ ఎన్టీఆర్ ఆగ్రహం…
సమంత-నాగచైతన్యలపై మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు ఎన్టీఆర్ స్పందించారు. "కొండా సురేఖ గారూ, వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి లాగడం తగదన్నారు. పబ్లిక్ ఫిగర్లు, ప్రత్యేకించి మీలాంటి బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు తప్పనిసరిగా వ్యక్తుల గౌరవాన్ని మరియు గోప్యతను గౌరవించాలి. ముఖ్యంగా సినిమా పరిశ్రమ గురించి నిర్లక్ష్యపూరితంగా, నిరాధారమైన ఆరోపణలు చూసి నిరుత్సాహంగా ఉందని, ఇతరులు నిరాధార ఆరోపణలు చేస్తుంటే మేం ఊరుకోమన్నారు. ఒకరి పట్ల మరొకరు గౌరవాన్ని కొనసాగించాలని. ప్రజాస్వామ్య భారతదేశంలో , సమాజం ఇలాంటి నిర్లక్ష్య ప్రవర్తనను కొనసాగకుండా చూడాల్సి ఉందన్నారు.
సంబంధిత కథనం