BRS In Karnataka: కర్ణాటకలో బిఆర్‌ఎస్‌ పోటీ లేనట్టే..మరి ప్రచారం సంగతేంటి..?-will there be a campaign of brs president in the karnataka assembly elections or not ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Will There Be A Campaign Of Brs President In The Karnataka Assembly Elections Or Not

BRS In Karnataka: కర్ణాటకలో బిఆర్‌ఎస్‌ పోటీ లేనట్టే..మరి ప్రచారం సంగతేంటి..?

HT Telugu Desk HT Telugu
Mar 30, 2023 08:11 AM IST

BRS In Karnataka: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ పోటీ లేనట్టేనని తేలి పోయింది. బిఆర్‌ఎస్‌ ఆవిర్భావ సమయంలో హడావుడి చేసిన కన్నడ పార్టీకి అండగా ఉంటామని ప్రకటించిన కేసీఆర్ ఇప్పుడు వెనక్కి తగ్గారు. వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల వరకు ఎదురు చూడాలనే నిర్ణయానికి వచ్చారు.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

BRS In Karnataka: జేడీఎస్, బీఆర్‌ఎస్‌ మైత్రి బంధానికి ఎన్నికల ముందే బ్రేకులు పడినట్టు కనిపిస్తోంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో కేసీఆర్ పార్టీ పోటీ చేస్తుందా లేదా అనే ఆసక్తి నెలకొంది. తాజా రాజకీయ పరిస్థితులు నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల్లోనే బిఆర్‌ఎస్‌ అభ్యర్థుల్ని పోటీకి దింపాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. జేడీఎస్‌ ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటుందనే విషయంలో స్పష్టత లేకపోవడం కూడా ఓ కారణమని చెబుతున్నారు. జేడీఎస్‌ ఒంటరిగా పోటీచేస్తే కేసీఆర్‌ ప్రచారానికి వెళ్తారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

త్వరలో జరుగనున్న కర్ణాటక శాసనసభ ఎన్నికలకు దూరంగా ఉండాలని భారత్‌ రాష్ట్ర సమితి నిర్ణయించింది. కర్ణాటకలో జరిగే ఎన్నికల్లో పోటీ చేయాలని గతంలో నిర్ణయించినా లోక్‌సభ ఎన్నికల వరకు వేచి ఉండాలని భావిస్తోంది. కర్ణాటకలో ఎన్నికల పరిస్థితులు ఎలా ఉంటాయి, ఎన్నికల్లో అక్కడి పా ర్టీలు ఎలాంటి వ్యూహాలను అమలు చేస్తాయి, పొత్తులు, ఇతర అంశాల ప్రభావం ఏమిటనే అంశాలను బీఆర్‌ఎస్‌ పరిశీలించాలని నిర్ణయించారు. కర్ణాటక ఎన్నికల సరళిని పరిశీలించడానికి ప్రత్యేక బృందాన్ని కర్ణాటకకు పంపనున్నారు.

జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టే లక్ష్యంతో టీఆర్‌ఎస్‌ పార్టీ పేరు మార్చుకుని గత ఏడాది అక్టోబర్‌లో బీఆర్‌ఎస్‌గా అవతరించింది. పార్టీ పెట్టిన తొలి నాళ్లలో పొరుగునే ఉన్న కర్ణాటక, మహారాష్ట్రల్లో అడుగు పెట్టేందుకు హడావుడి చేసినా వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల వరకు ఇతర రాష్ట్రాల్లో జరిగే అన్ని ఎన్నికలకు దూరంగా ఉంటామని తర్వాత ప్రకటించింది.

కర్ణాటకలో స్నేహం ఉన్నట్టా లేనట్టా….

కర్ణాటకలో ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలైంది. ఎన్నికల్లో ప్రత్యక్ష పోటీకి దూరంగా ఉన్నా బిఆర్‌ఎస్‌ ఎలాంటి పాత్ర పోషించాలనే విష‍యంలో పార్టీలో భిన్నాభి ప్రాయాలు ఉన్నాయి. కర్ణాటకలో ప్రధాన రాజకీయపక్షాలైన బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్‌ వ్యూహాలను బిఆర్‌ఎస్‌ బేరీజు వేస్తోంది.

గతంలో హైదరాబాద్‌ రాష్ట్రంలో అంతర్భాగంగా ఉండి ప్రస్తుతం కల్యాణ కర్ణాటకగా పిలుస్తున్న బీదర్, రాయచూర్, యాద్గిర్, కొప్పల్, కలబుర్గి జిల్లాల్లో బీఆర్‌ఎస్‌ బలోపేతం చేయడానికి ప్రయత్నాలు చేశారు. పలువురు బీఆర్‌ఎస్‌ నేతలు తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో పర్యటించి వివిధ పార్టీల నేతలతో భేటీ కూడా అయ్యారు. ఆ తర్వాత కర్ణాటకను పక్కన పెట్టి మహారాష్ట్ర, ఏపీ, ఒడిశా రాష్ట్రాలపై దృష్టి సారించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా.. అక్కడ అధికారంలో ఉన్న బీజేపీతో పాటు ప్రతిపక్షంలో ఉ్న కాంగ్రెస్‌ వ్యతిరేక ఓటు బ్యాంకులో చీలికను నివారించడం, జనతాదళ్‌ సెక్యులర్‌ పార్టీకి మేలు చేసేందుకే కన్నడ రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు బీఆర్‌ఎస్‌ చెబుతోంది.

మాజీ ప్రధాని దేవెగౌడ, ఆయన కుమారుడు, మాజీ సీఎం కుమారస్వామి నేతృత్వంలోని జేడీ (ఎస్‌) కర్ణాటక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే ఆ పార్టీ తరఫున కేసీఆర్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉందంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అవగాహన కోసం బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు జేడీఎస్‌ను సంప్రదిస్తున్నాయని ఇటీవల కుమారస్వామి ప్రకటించారు. జేడీఎస్‌ ఇతర పార్టీలతో ఎన్నికల అవగాహన కుదుర్చుకుంటే కర్ణాటక ఎన్నికల్లో బిఆర్‌ఎస్ వైఖరి ఎలా ఉంటుందనేది కూడా చర్చ జరుగుతోంది.

కుమారస్వామిని కర్ణాటక సీఎంగా చేసేందుకు తన వంతు సహకారం అందిస్తానని కేసీఆర్‌ గతంలో ప్రకటించారు. గత ఏడాది అక్టోబర్‌లో హైదరాబాద్‌లో జరిగిన బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభ, డిసెంబర్‌లో ఢిల్లీలో జరిగిన బీఆర్‌ఎస్‌ కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమాలకు కుమారస్వామి హాజరయ్యారు. ఈ ఏడాది జనవరిలో ఖమ్మంలో జరిగిన బీఆర్‌ఎస్‌ సభకు కేసీఆర్‌తోపాటు మరో ముగ్గురు సీఎంలు హాజరైనా కుమారస్వామి రాలేదు. ఫిబ్రవరి 17న తెలంగాణ సచివాలయాన్ని ప్రారంభించేందుకు పలువురు సీఎంలు, విపక్ష నేతలను ఆహ్వానించగా.. అందులో కుమారస్వామి పేరు లేదు. ఎన్నికల ప్రచారంలో ఉండటంతో రాలేకపోతున్నట్టు కుమారస్వామి వివరణ ఇచ్చారు. మరోవైపు జేడీ(ఎస్‌)తో బీఆర్‌ఎస్‌ మైత్రి బీటలు వారిందని ప్రచారం జరిగింది.

IPL_Entry_Point