Bhuvanagiri BRS MP Ticket 2024 : తెరపైకి ఉద్యమకారులు, బీసీ కార్డుతో నేతలు..! భువనగిరి BRS ఎంపీ టికెట్ ఎవరికి ..?
Bhuvanagiri BRS MP Ticket 2024 : భువనగిరి ఎంపీ టికెట్ కోసం బీఆర్ఎస్ లోని పలువురు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో కొందరు ఉద్యమకారులు కూడా ఉన్నారు. బీసీ జనాభా ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గం నుంచి కారు గుర్తుపై ఎవరికి టికెట్ దక్కబోతుందనేది ఆసక్తికరంగా మారింది.
Bhuvanagiri BRS MP Ticket 2024 : అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన బీఆర్ఎస్... ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. నియోజకవర్గాలవారీగా సమీక్షలు చేస్తూ... కేడర్ లో జోష్ నింపే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే అధికారం కోల్పోయిన నేపథ్యంలో.... వచ్చే పార్లమెంట్ ఎన్నికలు అత్యంత సవాల్ గా మరాయి. ఈ క్రమంలో.... బలమైన అభ్యర్థులను బరిలో ఉంచి మెజార్టీ ఎంపీ సీట్లను గెలుచుకోవాలని భావిస్తోంది. గత తప్పిదాలను పునరావృతం కాకుండా.... జాగ్రత్తలు తీసుకోవాలని చూస్తోంది. అయితే ఈసారి టికెట్ దక్కే నేతలు ఎవరనేది ఆసక్తికరంగా మారింది.
బీసీ సెగ్మెంట్ గా గుర్తింపు...!
రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాల్లో భువనగిరి ఒకటి. బీసీ సామాజికవర్గ ఓట్లు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గం నుంచి టికెట్ ఎవరికి దక్కబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ నియోజకవర్గ పరిధిలో జనగామ, ఆలేరు, తుంగతుర్తి, మునుగోడు, నకిరేకల్, భువనగిరి, ఇబ్రహీంపట్నం అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో తుంగతుర్తి, నకిరేకల్ లో ఎస్సీ సామాజికవర్గ ఓట్లు అత్యధికంగా ఉండగా… మిగతా నియోజకవర్గాల్లో మాత్రం బీసీల ఓట్ల శాతం అత్యధికంగా ఉంటాయి. ఈ పార్లమెంట్ పరిధిలోని ఒక్క జనగామ తప్ప... మిగతా అన్నింటిలోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు ఓడిపోయారు. ఏడు స్థానాలకుగాను కేవలం ఒక్క స్థానంలో గెలిచారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఈ సీటు కోసం పార్టీలోని పలువురు కీలక నేతలు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆశిస్తున్న నేతలు వీరే...?
భువనగిరి పార్లమెంట్ ప్రాంతమంతా కూడా ప్రజా ఉద్యమాలకు కేరాఫ్ అని చెప్పొచ్చు.నాటి సాయుధ రైతాంగ పోరాటమే కాదు... మొన్నటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వరకు కూడా ఈ ప్రాంతంలోని వాళ్లు క్రియాశీలక పాత్ర పోషించారని చెప్పొచ్చు. బీసీ వాదం కూడా ఎక్కువగా ఉండే ప్రాంతంగా కూడా ఈ నియోజకవర్గానికి పేరుంది. ఈ టికెట్ కోసం బీఆర్ఎస్ లోని పలువురు నేతలతో పాటు ఉద్యమకారులు ప్రయత్నిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ దక్కని పలువురు నేతలు... ఈ టికెట్ ను గట్టిగా ఆశిస్తున్నారు. బీసీ సామాజికవర్గానికి చెందిన ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్... ఈసారి తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్ఎస్ లో చేరిన తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. గతంలో బీఆర్ఎస్ లో పని చేసిన అనుభవం ఉండటంతో పాటు ఉద్యమకారుడిగా గుర్తింపు ఉంది. నకిరేకల్ నియోజవర్గానికి చెందిన మరో ఉద్యమకారుడు డాక్టర్ చెరుకు సుధాకర్ కూడా భువనగిరి ఎంపీ స్థానాన్ని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ పార్టీ తొలి నాళ్ల నుంచి భాగస్వామిగా ఉన్న నేతగా ఆయనకు పేరుంది. తెలంగాణ ఉద్యమంలో పీడీ యాక్ట్ కేసు కూడా నమోదైంది. గౌడ సామాజికవర్గానికి చెందటం ఆయనకి కలిసివచ్చే అంశం అని పలువురు చెబుతున్నారు.
వీరే కాకుండా... కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరిన మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కూడా ఈ టికెట్ ను ఆశిస్తున్నారు. బీసీ సామాజికవర్గానికి చెందిన నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. ఇక భువనగిరి నుంచి పోటీ చేసిన ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఇక శాసనమండలి ఛైర్మన్ కుమారుడైన గుత్తా అమిత్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే ఆయన... నల్గొండ బరిలో ఉండేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి చెందిన క్యామ మల్లేశ్ (కురుమ) కూడా టికెట్ పై ఆశలు పెట్టుకున్నారు. మాజీ కార్పొరేషన్ ఛైర్మన్లు పల్లె రవి కుమార్ గౌడ్, దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ తో పాటు మరికొందరు నేతలు కూడా ఈ టికెట్ కోసం పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ టికెట్ ఖరారు విషయంలో బీఆర్ఎస్ లోతుగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల ఎంపికను కూడా పరిగణనలోకి తీసుకొని ముందుకెళ్లాలని భావిస్తుందట..! బీసీ కార్డుతో ప్రత్యర్థి పార్టీలు బరిలో ఉంటే ఎవరిని ఖరారు చేయాలి..?ఎవరికి టికెట్ ఇస్తే గెలుపు అవకాశాలు బలంగా ఉంటాయి..? వంటి పలు అంశాలపై లెక్కలు వేసుకునే పనిలో పడిదంట..! మొత్తంగా కీలక నేతలు భువనగిరి టికెట్ ఆశిస్తున్న నేపథ్యంలో.... గులాబీ బాస్ కేసీఆర్ ఎవరివైపు నిలుస్తారనేది మరికొద్దిరోజుల్లోనే తేలిపోనుంది...!
సంబంధిత కథనం