Bhuvanagiri Suicides: ఎస్సీ హాస్టల్లో ఇద్దరు విద్యార్ధినుల ఆత్మహత్య.. భువనగిరిలో తీవ్ర ఉద్రిక్తత
Bhuvanagiri Suicides: తెలంగాణ రాష్ట్రంలో సంచలన సృష్టించిన భువనగిరి ఎస్సీ హాస్టల్ SC hostel విద్యార్థినుల ఆత్మహత్యల వ్యవహారంలో కీలక మలుపు చోటు చేసుకుంది. గత వారం హాస్టల్లో ఆత్మహత్యకు పాల్పడిన భవ్య, వైష్ణవి మృతదేహాలపై వారి కుటుంబ సభ్యులు పంటితో కొరికిన గాయాలు, వాతలను గుర్తించారు.
Bhuvanagiri Suicides: భువనగిరి SC hostelలో హాస్టల్లో ఇద్దరు చిన్నారులు ఆత్మహత్య చేసుకున్న వ్యవహారంపై రకరకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తమ బిడ్డలు ఆత్మహత్య చేసుకునే అంతా పిరికి వాళ్ళు కాదని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భవ్య, వైష్ణవి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఆదివారం భువనగిరి (Bhuvanagiri) జిల్లా కేంద్రంలోని ఎస్సీ హాస్టల్ ఎదుట ఆ తర్వాత ఏరియా దవాఖాన ఎదుట మెయిన్ రోడ్డుపై బైఠాయించారు. ఉదయం హాస్టల్ కు వచ్చిన కుటుంబ సభ్యులు అక్కడ ధర్నాకు దిగారు.
వారికి స్థానికులు, ప్రజాసంఘాల వారు మద్దతుగా నిలిచారు. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో అక్కడి నుంచి స్థానిక ఏరియా హాస్పిటల్ ముందు మెయిన్ రోడ్డుపై బైఠాయించారు. వీరికి ప్రతిపక్ష బీఆర్ఎస్ brs తో పాటు విద్యార్థి మహిళా ప్రజా సంఘాలు మద్దతుగా నిలిచాయి.
రోడ్డుపైనే ఆందోళన దిగి పెద్ద ఎత్తున ప్రభుత్వం నినాదాలు చేశారు కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పాలని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
హాస్టల్ సిబ్బందిపై అనుమానం…
హాస్టల్ వార్డెన్ (hostel warden), వాచ్‌మాన్ ,ఆటో డ్రైవర్‌పై తమకు అనుమానాలు ఉన్నాయని భవ్య, వైష్ణవి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సూసైడ్ లెటర్ లో హ్యాండ్ రైటింగ్ తమ పిల్లలది కాదని స్పష్టం చేశారు.
ఇటీవల ఆటో డ్రైవర్ విషయంలో చిన్న ఘటన జరగగా తమ దృష్టికి వచ్చిందని, ఇది పక్కా హత్యే అని వారు మండిపడ్డారు. హాస్టల్‌లో ఇంతా జరగుతున్న వార్డెన్, యాజమాన్యం ఏం చేస్తున్నారని తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపైనే బైఠాయించి తమ పిల్లలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
దీంతో రోడ్డుకు ఇరువైపులా పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచి పోయింది.అధికారులు నచ్చ జెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. ఈ క్రమంలో పోలీసులతొ ఆందోళన చేస్తున్న వారికి వాగ్వాదం చేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు చేసేదేమీ లేక వాహనాలు రాకపోకలు మళ్ళించారు.
మరోవైపు ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన ఘటనలో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. చేతికొచ్చిన పిల్లలు చనిపోయారనే వార్తను జీర్ణించుకోలేకపోయారు. అక్కడే కింద పడిపోయి గుండెలు పగిలేలా రోదించారు.ఈ ఘటన అక్కడ చుట్టూ ఉన్న వారిని సైతం తీవ్రంగా కలిచి వేసింది. స్థానికులు సైతం కంటతడి పెట్టారు.
శ్రద్ధాంజలి ఫ్లెక్సీని చూసి భవ్య తల్లి బోరున విలపించి అక్కడే సొమ్మ సిల్లీ పడిపోయింది .మరోవైపు వైష్ణవికి తల్లి లేదు. చిన్నప్పుడే చనిపోయింది తండ్రి దివ్యాంగుడు.ఆరెండ్ల క్రితం తమ్ముడు కూడా చనిపోయాడు. దీంతో ఆ తండ్రికి కన్నీళ్ళు కూడా కరువయ్యాయి.
విద్యార్ధినుల ఆత్మహత్య ఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. ఎస్సీ హాస్టల్ లో తోటి విద్యార్ధినులు,ఉపాధ్యాయులు, ట్యూషన్ టీచర్, తో పాటు పలువురిని పోలీసులు విచారిస్తున్నారు.క్లూస్ టీం ఆధారంగా పోలీసులు ఆధారాలు సేకరించారు.
వాచ్ మ్యాన్,ఆటో డ్రైవర్, వార్డెన్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.కాగా భవ్య, వైష్ణవి మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్ట్ మార్టం నివేదిక వేస్తే పూర్తి స్పష్టత వస్తుందని పోలీసులు చెబుతున్నారు.
(కేతిరెడ్డి తరుణ్ హైదరాబాద్ జిల్లా)