Crop Loan Waiver Guidelines: రూ. 2 లక్షల రుణమాఫీ స్కీమ్ - ఈ ముఖ్యమైన ప్రశ్నలకు జవాబులు తెలుసుకోండి...!-what are the eligibility criteria for telangana crop loan waiver scheme frequently asked question faq ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Crop Loan Waiver Guidelines: రూ. 2 లక్షల రుణమాఫీ స్కీమ్ - ఈ ముఖ్యమైన ప్రశ్నలకు జవాబులు తెలుసుకోండి...!

Crop Loan Waiver Guidelines: రూ. 2 లక్షల రుణమాఫీ స్కీమ్ - ఈ ముఖ్యమైన ప్రశ్నలకు జవాబులు తెలుసుకోండి...!

Maheshwaram Mahendra Chary HT Telugu
Jul 17, 2024 11:06 AM IST

TG Govt crop Loan waiver guidelines: తెలంగాణలో రైతుల రుణమాఫీ మార్గదర్శకాలు విడుదలైన సంగతి తెలిసిందే. భూమి కలిగివున్న ప్రతి రైతు కుటుంబానికి రూ.2 లక్షల పంట రుణ మాఫీ వర్తిస్తుందని సర్కార్ తెలిపింది. అయితే ఈ స్కీమ్ అమలుకు సంబంధించి రైతుల్లో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

తెలంగాణలో రైతుల రుణమాఫీ
తెలంగాణలో రైతుల రుణమాఫీ

TG Govt Loan Waiver Guidelines : తెలంగాణలో రైతుల రుణమాఫీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా జూలై 15వ తేదీన మార్గదర్శకాలను విడుదల చేసింది. డిసెంబర్ 12, 2018 నుంచి డిసెంబర్ 09, 2023 వరకు తీసుకున్నపంట రుణాలకు ఈ స్కీమ్ వర్తిస్తుందని స్పష్టం చేసింది.

ఈ మార్గదర్శకాలకు సంబంధించి చాలా మంది రైతుల నుంచి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎలాంటి రుణాలను మాఫీ చేస్తారు..? రూ. 2 లక్షల కంటే రుణం ఉంటే మాఫీ అవుతుందా..? లేదా..? నిజంగానే రేషన్ కార్డును ప్రమాణికంగా తీసుకునే స్కీమ్ ను వర్తింపజేస్తారా…? వంటి ప్రశ్నల విషయంలో క్లారిటీకి రాలేకపోతున్నారు. ఇలాంటి కొన్ని ప్రశ్నలకు ఇక్కడ సమాధానాలు చూడండి.

ప్రశ్న: రుణమాఫీ ఎవరికి వరిస్తుంది..? కటాఫ్ తేదీలు ఏంటి..?

జవాబు - భూమి ఉన్న ప్రతి కుటుంబానికి రూ.2 లక్షలు రుణమాఫీ వర్తిస్తుంది. డిసెంబర్ 12, 2018 నుంచి డిసెంబర్ 09, 2023 వరకు తీసుకున్నపంట రుణాలకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. వీటిని కటాఫ్ తేదీలుగా ప్రభుత్వం ప్రకటించింది.

ప్రశ్న: ఎవరికి ఈ స్కీమ్ వర్తించదు..?

ఎస్‌హెచ్‌జీ(వయం సహాయక బృందాలు), జేఎల్‌జీ, ఆర్‌ఎంజీ, ఎల్‌ఈసీఎస్‌ రుణాలతో పాటు రీషెడ్యూల్‌ చేసిన రుణాలకు మాత్రం రుణమాఫీ వర్తించదు. గోల్డ్ లోన్ వంటి వాటికి కూడా వర్తించదు.

ప్రశ్న: 2 లక్షల కంటే ఎక్కువ రుణం తీసుకున్న రైతులు ఏం చేయాలి..? మార్గదర్శకాలు ఏం చెబుతున్నాయి?

జవాబు - రైతులకు 2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉంటే... రైతులు ముందుగా రూ.2 లక్షలు దాటి పైన ఉండే మొత్తాన్ని బ్యాంకులకు చెల్లించాలి. ఆ తర్వాత అర్హత గల రైతులకు రూ.2 లక్షల రుణాన్ని ప్రభుత్వం నేరుగా రైతు రుణ అకౌంట్లలోకి జమ చేస్తుంది. ఉదాహరణకు ఓ రైతుకు సంబంధించి రూ.2.50 లక్షల రుణం ఉంటే రైతు రూ.50 వేలు చెల్లించాల్సి ఉంటుంది. మిగతా రూ.2 లక్షలు ప్రభుత్వమే చెల్లిస్తుంది.

ప్రశ్న: రుణమాఫీ నిధులను ఎలా జమ చేస్తారు…?

జవాబు: రుణమాఫీ మొత్తాన్ని డీబీటీ(Direct Benefit Transfer) పద్ధతిలో నేరుగా రైతు రుణ ఖాతాల్లోనే జమ చేస్తారు. రుణమాఫీ మొత్తాన్ని డీసీసీబి లేదా బ్యాంకు బ్రాంచికి విడుదల చేస్తారు. ఆ బ్యాంకు… రుణమాఫీ మొత్తాన్ని సీఏసీఎస్ లో ఉన్న రైతు ఖాతాలో జమ చేస్తారు.

ప్రశ్న: మొదటగా ఎవరికి మాఫీ కానుంది..? ఎప్పటిలోపు ఈ ప్రక్రియ పూర్తి అవుతుంది…?

జవాబు: రుణమాఫీ ప్రక్రియను ఆరోహణ క్రమంలో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత రూ.1లక్షలోపు రుణాలను క్లియర్ చేస్తారు. రూ.2లక్షల వరకు రుణమాఫీ ప్రక్రియను ఆగస్టు 15లోగా పూర్తిచేస్తారు.

ప్రశ్న: రేషన్ కార్డు ప్రామాణికమా..? తాజాగా ప్రభుత్వం ఏం చెప్పింది…?

రైతు కుటుంబం గుర్తింపునకు రేషన్‌కార్డు ప్రామాణికమని ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. దీనిపై పలువర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీనిపై స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం క్లారిటీ ఇచ్చారు. భూమి పాసుబుక్ పై రుణం ఉన్న ప్రతి రైతు కుటుంబానికి రూ.2 లక్షల రుణమాఫీ వర్తిస్తుందని స్పష్టం చేశారు. కేవలం కుటుంబ నిర్ధారణకే రేషన్ కార్డును వాడుతున్నామని పేర్కొన్నారు.

ప్రశ్న: ఈ స్కీం ఏ పంట రుణాలకు వర్తిస్తుంది…?

జవాబు: రుణమాఫీ స్కీమ్ స్వల్ప కాలిక పంట రుణాలకు మాత్రమే వర్తిస్తుంది. దీర్ఘకాలిక పంటలకు ఈ స్కీమ్ వర్తించదు.

ప్రశ్న: ఏ తేదీ నుంచి రుణమాఫీ డబ్బులు జమ కానున్నాయి…?

జవాబు: జులై 18వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు రూ.లక్ష వరకు రుణమాఫీ నిధులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఆగస్టు 15వ తేదీలోప ఆపై రుణాలు క్లియర్ అవుతాయి.

ప్రశ్న: ఎలాంటి పరిస్థితుల్లో రుణమాఫీ సొమ్మును రికవరీ చేస్తారు…?

జవాబు: ఈ పథకం క్రింద రుణమాఫీ పొందడానికి రైతులు తప్పుడు సమాచారం ఇచ్చినట్టు గుర్తించినట్లయితే లేదా మోసపూరితంగా పంటరుణాన్ని పొందినట్లు లేదా పంట రుణమాఫీకి అర్హులుకారని కనుగొన్నట్లయితే చర్యలు ఉంటాయి. పొందిన రుణమాఫీ మొత్తాన్ని రైతు తిరిగి ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ఆ మొత్తాన్ని రికవరీ చేయడానికి చట్టప్రకారం వ్యవసాయశాఖ సంచాలకుల వారికి అధికారం ఉంటుందని సర్కార్ తెలిపింది.

ప్రశ్న: ఏమైనా సందేహాలు, ఇబ్బందులు తలెత్తితే ఏం చేయాలి…?

జవాబు: ఈ స్కీమ్ లో ఇబ్బందాలు, సందేహాలను పరిష్కరించేందుకు గ్రీవెన్స్ సెల్ ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. రైతులు తమ ఇబ్బందులను ఐటి పోర్టల్ ద్వారా లేదా మండల స్థాయిలో ఏర్పాటు చేసే సహాయ కేంద్రాలను సంప్రదించవచ్చు.

ప్రశ్న: ఎన్ని రోజుల్లో సమస్యలను పరిష్కరిస్తారు…?

జవాబు: రుణమాఫీ చేసే విషయంలో రైతు ఇచ్చే ఫిర్యాదుపై సంబంధిత అధికారులు 30 రోజుల్లో పరిష్కరించాలి. అట్టి వివరాలను తప్పనిసరిగా లబ్ధిదారుడికి తెలియజేయాల్సి ఉంటుంది.

Whats_app_banner

సంబంధిత కథనం