PM Vishwakarma scheme: చేతి వృత్తి కళాకారులకు తక్కువ వడ్డీకే రూ. 1 లక్ష రుణం; ‘విశ్వ కర్మ’ స్కీమ్ కు కేంద్ర కేబినెట్ ఓకే-union cabinet approves pm vishwakarma scheme ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Pm Vishwakarma Scheme: చేతి వృత్తి కళాకారులకు తక్కువ వడ్డీకే రూ. 1 లక్ష రుణం; ‘విశ్వ కర్మ’ స్కీమ్ కు కేంద్ర కేబినెట్ ఓకే

PM Vishwakarma scheme: చేతి వృత్తి కళాకారులకు తక్కువ వడ్డీకే రూ. 1 లక్ష రుణం; ‘విశ్వ కర్మ’ స్కీమ్ కు కేంద్ర కేబినెట్ ఓకే

HT Telugu Desk HT Telugu
Aug 16, 2023 05:09 PM IST

PM Vishwakarma scheme: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన ‘ప్రధానమంత్రి విశ్వకర్మ’ పథకానికి కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద చేతివృత్తుల కళాకారులకు రూ. 1 లక్ష వరకు అతి తక్కువ వడ్డీకే రుణం ఇస్తారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (ANI )

PM Vishwakarma scheme: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాన నరేంద్ర మోదీ ప్రకటించిన ‘ప్రధానమంత్రి విశ్వకర్మ’ పథకానికి కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద చేతివృత్తుల వారికి రూ. 1 లక్ష వరకు అతి తక్కువ వడ్డీకే రుణం ఇస్తారు. ఈ పథకం వివరాలను కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ బుధవారం వెల్లడించారు. ఈ పథకం కోసం రానున్న ఐదేళ్లలో రూ. 13 వేల కోట్ల రూపాయలను వెచ్చించనున్నామని తెలిపారు.

రూ. 1 లక్ష వరకు..

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నివసించే సాంప్రదాయ చేతివృత్తుల కళాకారులకు, వారి కుటుంబాలకు ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అశ్వనీ వైష్ణవ్ తెలిపారు. విశ్వకర్మ జయంతి రోజు నుంచి ఈ పథకం అమలు ప్రారంభమవుతుందన్నారు. ఈ పథకం కింద చేతివృత్తుల కళాకారులకు లేదా వారి కుటుంబాలకు, ఎలాంటి తనఖాలు అవసరం లేకుండా, రూ 1 లక్ష వరకు ఐదు శాతం గరిష్ట వార్షిక వడ్డీతో రుణం అందిస్తామన్నారు. సంప్రదాయ వృత్తి నైపుణ్యాలున్న కళాకారులకు ఈ పథకం ఉపయోగపడుతుందని తెలిపారు. మొత్తంగా 18 సంప్రదాయ చేతి వృత్తుల కళాకారులను ఈ పథకంలో లబ్ధిదారులుగా చేర్చామన్నారు.

ప్రధానంగా ఓబీసీలకు..

ఈ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 77 వ స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో మంగళవారం ప్రకటించారు. ఈ పథకం ద్వారా ఓబీసీలు, చేనేత కార్మికులు, స్వర్ణ కళాకారులు, చెప్పులు కుట్టేవారు, వడ్రంగులు, రజక వృత్తిలో ఉన్నవారు, నాయి బ్రాహ్మణులు, కుమ్మర్లు, మేస్త్రీ పనివారు.. తదితరులు ప్రయోజనం పొందుతారని ప్రధాని మోదీ తన ప్రసంగంలో వివరించారు. దేశ వ్యాప్తంగా ఈ పథకం ద్వారా 30 లక్షల మంది చేతి వృత్తుల కళాకారులు ప్రయోజనం పొందుతారన్నారు.

ఇతర సహాయాలు కూడా..

ఈ పథకంలో లబ్ధి పొందుతున్న కళాకారులకు విశ్వ కర్మ ఐడీ కార్డులను, విశ్వకర్మ సర్టిఫికెట్స్ ను, పనిముట్ల కొనుగోలుకు నగదును, నైపుణ్య శిక్షణను, మార్కెటింగ్ సపోర్ట్ ను అందిస్తామన్నారు. ఈ పథకంలో తొలి విడతగా రూ. 1 లక్ష వరకు, రెండో దశలో రూ. 2 లక్షల వరకు రుణం అందిస్తామన్నారు. ఇందుకు 5% మాత్రమే వార్షిక వడ్డీ ఉంటుందన్నారు.

Whats_app_banner