Tirumala : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్... వాచీలు, మొబైల్ ఫోన్ల ఈ-వేలం - ఇలా పాల్గొనొచ్చు
Tirumala Srivari Temple News:భక్తులకు అలర్ట్ ఇచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీవారికి కానుకగా సమర్పించిన వాచీలు, మొబైల్ ఫోన్లను మార్చి 13వ తేదీన వేలం వేయనున్నట్లు ప్రకటన విడుదల చేసింది.
Tirumala Srivari Watches and Mobiles Auction: తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన వాచీలు, మొబైల్ ఫోన్లను వేలం వేయనుంది టీటీడీ. మార్చి 13న రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ- వేలం వేయనున్నారు. ఇందులో టైటాన్, క్యాషియో, టైమెక్స్, ఆల్విన్, సొనాట, టైమ్‌వెల్, ఫాస్ట్‌ట్రాక్, ర్యాడో కంపెనీల వాచీలున్నాయి. ఆదేవిధంగా ఐ ఫోన్లు, వివో, నోకియా, కార్బన్, శామ్సంగ్, మోటోరోలా, ఒప్పో కంపెనీల మొబైల్ ఫోన్లు వున్నాయి.
కొత్తవి/ఉపయోగించిన/పాక్షికంగా దెబ్బతిన్న వాచీలు మొత్తం 23 లాట్లు, మొబైల్ ఫోన్లు 27 లాట్లు ఈ-వేలంలో ఉంచారు. ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో కార్యాలయం వేళల్లో సంప్రదించవచ్చని తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. టీటీడీ వెబ్‌సైట్ www.tirumala.org లేదా రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్ www.konugolu.ap.gov.in ను సంప్రదించవచ్చని సూచించింది.
విశేష పర్వదినాలివే..
Special Festivals at Tirumala: ఈ మార్చి నెలలో శ్రీవారి ఆలయంలో నిర్వహించే విశేష ఉత్సవాలను ప్రకటించింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మేరకు పూర్తి వివరాలను వెల్లడించింది. మార్చి 8వ తేదీన మహా శివరాత్రి వేడక జరగనున్నట్లు పేర్కొంది. మార్చి 20 నుంచి 24వతేదీ వరకు శ్రీవారి తెప్పోత్సవాలు ఉంటాయని వెల్లడించింది. మార్చి 25న తుంబురు తీర్థ ముక్కోటి, శ్రీ లక్ష్మీ జయంతి నిర్వహించనున్నట్లు తెలిపింది.
మార్చిలో జరిగే విశేష ఉత్సవాలు :
• మార్చి 3న పల్స్ పోలియో.
• మార్చి 6, 20న సర్వ ఏకాదశి.
• మార్చి 8న మహాశివరాత్రి.
• మార్చి 20 నుంచి 24వతేదీ వరకు శ్రీవారి తెప్పోత్సవాలు.
• మార్చి 25న తుంబురు తీర్థ ముక్కోటి, శ్రీ లక్ష్మీ జయంతి.
పల్స్ పోలియో….
ధేశవ్యాప్త కార్యక్రమంలో భాగంగా తిరుమలలో మార్చి 3వ తేదీ పల్స్ పోలియో కార్యక్రమం జరుగనుంది. ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమం మార్చి 3న ఉదయం 6 గంటలకు తిరుమల ఆలయం ముందు ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది.
భక్తుల సౌకర్యార్థం తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో పల్స్ పోలియో చుక్కల నిర్వహణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అశ్విని ఆసుపత్రి, ఆర్టీసీ బస్టాండ్, జియన్ సి టోల్ గేట్, సిఆర్ ఓ, పిఎసి 1 మరియు 2, కొత్త బస్టాండ్, హెల్త్ ఆఫీస్, విక్యూసి 1 మరియు 2, ఏటిసి, ఎంబిసి-34, వరాహస్వామి విశ్రాంతి గృహం 1, రాంభగీచా రెస్ట్ హౌస్ 1, కేకేసి, మేదరమిట్ట, పాపవినాశనం, సుపాదం, బాలాజీ నగర్ వినాయక ఆలయం, బాలాజీ నగర్ బాల బడి, ఎస్వి హై స్కూల్, తిరుమల ఆలయం లోపల మరియు వెలుపల, ఉద్యోగుల డిస్పెన్సరీలతో సహా మొత్తం 25 కేంద్రాలలో పోలియో చుక్కలు వేస్తారు. ఇందులో భాగంగా శనివారం ఉదయం 10.30 గంటలకు ఎస్వీ హైస్కూల్ నుంచి బాలాజీ నగర్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి యాత్రికులు మరియు స్థానికుల కొరకు జీపులో ప్రకటనలు చేస్తూ అవగాహన కలిగించనున్నారు.